Electric Cars in India: భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్ల క్రేజ్ నిరంతరం పెరుగుతూనే ఉంది. ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ, వినియోగదారుల్లో పెరుగుతున్న అవగాహన కారణంగా దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ పెరిగింది. టాటా మోటార్స్, మహీంద్రా, బీవైడీ వంటి కంపెనీలకు సంబంధించిన ఎలక్ట్రిక్ కార్లు భారత మార్కెట్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. రీజనరేటివ్ ఫ్యూయల్ వినియోగాన్ని పెంచడానికి భారత ప్రభుత్వం కూడా ఈ వాహనాలను ప్రోత్సహిస్తోంది. దీని కారణంగా ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలు పెరుగుతున్నాయి.


దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ ఊపందుకుంది. కరోనాకు ముందు మార్కెట్లో కేవలం మూడు కంపెనీలకు సంబంధించే నాలుగు మోడల్స్ మాత్రమే మార్కెట్లో ఉండేవి. జాటో డైనమిక్స్ ప్రకారం 2023 సంవత్సరంలో ఏడు కంపెనీల ఎలక్ట్రిక్ వాహనాలు భారత మార్కెట్లోకి ప్రవేశించాయి.


దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్‌లో టాటా మోటార్స్ పెద్ద కంపెనీ. టాటా అందిస్తున్న ఎలక్ట్రిక్ కార్లలో టియాగో, టిగోర్, నెక్సాన్, పంచ్ ఉన్నాయి. అదే సమయంలో ఎంజీ మోటార్స్, మహీంద్రా వాహనాలు కూడా ఈవీ మార్కెట్‌లో పెద్ద వాటాను కలిగి ఉన్నాయి. చైనాకు చెందిన బీవైడీ కంపెనీ కూడా భారత మార్కెట్లోకి గొప్ప ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకొచ్చింది. దక్షిణ కొరియాకు చెందిన హ్యుందాయ్, కియా కంపెనీలు కూడా ఎలక్ట్రిక్ వాహనాల మోడళ్లను భారత మార్కెట్లోకి విడుదల చేశాయి.


ప్రపంచంలోనే నంబర్ వన్ కంపెనీగా బీవైడీ
చైనీస్ కార్ల తయారీదారు బీవైడీ ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లో అతిపెద్ద కంపెనీలలో ఒకటి. ఇటీవల అమ్మకాల పరంగా ఎలాన్ మస్క్ టెస్లాను అధిగమించింది. బీవైడీకి భారతదేశం చాలా పెద్ద మార్కెట్. 2023లో కంపెనీ భారతదేశంలో 2,658 వాహనాలను విక్రయించింది.


వచ్చే ఐదేళ్లలో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ 25 శాతం వృద్ధి చెందుతుందని టాటా మోటార్స్ 2023 నివేదిక పేర్కొంది. 2023 నాటికి భారతదేశంలోని రోడ్లపై 50 శాతం ఎలక్ట్రిక్ వాహనాలు నడుస్తాయి. ఎంజీ మోటార్ ఇండియా డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గౌరవ్ గుప్తా మాట్లాడుతూ తమ కంపెనీ అమ్మకాలలో 30 శాతం ఎలక్ట్రిక్ వాహనాల విక్రయం ద్వారా వస్తున్నాయని, కంపెనీ దీనికి సంబంధించిన పోర్ట్‌ఫోలియోను కొనసాగించాలి అనుకుంటున్నట్లు చెప్పారు.


బీవైడీ ఇటీవలే అమెరికన్ అగ్ర ఈవీ కంపెనీ టెస్లా నంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించింది. ఇంతకు ముందు వరకు అత్యధిక ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాల్లో టెస్లా నంబర్ వన్ స్థానంలో ఉండేది. ఇప్పుడు ఈ స్థానాన్ని చైనాకు చెందిన బీవైడీ సంస్థ స్వాధీనం చేసుకుంది. ఈవీ విక్రయాల పరంగా కూడా బీవైడీ ముందంజ వేసింది. టెస్లా రిలీజ్ చేసిన అమ్మకాల డేటా ప్రకారం 2023 నాలుగో త్రైమాసికంలో కంపెనీ 4,84,507 యూనిట్లను విక్రయించింది. అంతకు ముందు త్రైమాసిక అమ్మకాల కంటే ఇది 11 శాతం ఎక్కువ. కానీ అదే సమయంలో చైనాకు చెందిన బీవైడీ ఏకంగా 5,26,409 యూనిట్లను విక్రయించింది. దీంతో టెస్లా మార్కెట్లో రెండో స్థానానికి పడిపోయింది. అమ్మకాల పరంగా మాత్రమే కాకుండా ఈవీ ప్రొడక్షన్ పరంగా కూడా బీవైడీ కంటే టెస్లా వెనుకబడి ఉంటుంది. 2024లో కూడా టెస్లా మరింత ఎక్కువ ప్రత్యర్థి కంపెనీలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఇది టెస్లాకు అతి పెద్ద సవాల్‌గా నిలవనుంది.


Also Read: రూ.8 లక్షల్లోపు ధరలో టాప్-5 కార్లు ఇవే - బడ్జెట్‌లో కార్లు కావాలనుకునేవారికి బెస్ట్ ఆప్షన్ - ఈవీ కూడా!