Devotees Rush In Khairathabad: వరుస సెలవులు కావడంతో ఖైరతాబాద్ మహాగణపతిని (Khairatabad Mahaganesh) దర్శించుకునేందుకు శనివారం ఉదయం నుంచి భక్తులు భారీ తరలివస్తున్నారు. దీంతో పరిసర ప్రాంతాల్లో జనసంద్రంగా మారాయి. ఈ క్రమంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. క్యూ లైన్‌లో భక్తులను త్వరగా దర్శనం చేయించి ముందుకు కదిలిస్తున్నారు. సీసీ కెమెరాల ద్వారా ప్రత్యేకంగా మానిటరింగ్ చేస్తున్నారు. అటు, ఆకతాయిల నుంచి మహిళలకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేకంగా షీ టీమ్స్ ఏర్పాటు చేశారు. అటు, ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా సిబ్బంది ప్రత్యేక చర్యలు చేపట్టారు.
మెట్రో స్టేషన్‌లో రద్దీ
అటు, ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ భక్తులతో కిటకిటలాడుతోంది. ఎల్బీనగర్, మియాపూర్ నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలిరావడంతో మెట్రో స్టేషన్ పరిసరాలు జనసంద్రంగా మారాయి. ఈ క్రమంలో మెట్రో అధికారులు ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. టికెట్ కౌంటర్లు, ఎగ్జిట్ గేట్ల వద్ద రద్దీ పెరగకుండా చర్యలు చేపట్టారు. ప్రయాణికులను క్యూఆర్ కోడ్ టికెట్లు, కార్డు ద్వారా వేర్వేరు లైన్లలో పంపిస్తోంది. స్టేషన్ లోపల ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్ ద్వారా ముందస్తుగానే టికెట్లు బుక్ చేసుకోవాలని.. కార్డుల్లో సరిపడా డబ్బులు లేకపోతే ఎంట్రీ స్టేషన్‌లో రీఛార్జ్ చేసుకోవాలని ప్రయాణికులకు సూచిస్తున్నారు.
ఖైరతాబాద్ మెట్రో స్టేషన్‌లో ఉదయం నుంచీ గంటగంటకూ రద్దీ పెరుగుతుండడంతో మెట్రో యాజమాన్యం అదనపు సిబ్బందిని ఏర్పాటు చేసింది. గణేశుని దర్శనం కోసం వచ్చే ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటోంది. టికెట్ కౌంటర్లు, ఎంట్రీ, ఎగ్జిట్ గేట్లతో పాటు ప్లాట్ ఫాం వద్ద భద్రతా సిబ్బంది ప్రయాణికులకు తగిన సూచనలు చేస్తున్నారు.
Also Read: Mahabubabad News: 'అది నా కుక్క కాదు కాదు నాది' - పోలీస్ స్టేషన్‌కు చేరిన శునక పంచాయతీ