Fight For Dog In Mahabubabad: కన్నబిడ్డల విషయంలోనే కాదు పెంపుడు జంతువుల విషయంలోనూ చాలామందికి చెప్పలేని మమకారం ఉంటుంది. ఆ అభిమానం వారిని ఎంతదూరమైనా వెళ్లేలా చేస్తుంది. సరిగ్గా ఇలాంటి ఘటనే మహబూబాబాద్ (Mahabubabad) జిల్లాలో చోటు చేసుకుంది. కుక్కను పెంచింది ఒకరైతే.. అది ఇంటి నుంచి తప్పిపోవడంతో మరొకరికి దొరికింది. కొద్ది రోజుల తర్వాత పెంచిన యజమానికి కుక్క కనిపించడంతో అది నా కుక్క అంటూ పంచాయతీ పెట్టాడు. లేదు లేదు అది నా కుక్క అంటూ దాన్ని దొరికితే పెంచుకుంటున్న వ్యక్తి వాదించాడు. దీంతో ఈ వివాదం పోలీస్ స్టేషన్‌కు చేరింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నెల్లికుదురు మండలం మధనతుర్తి గ్రామానికి చెందిన సారయ్య ఓ కుక్కను పెంచుకున్నాడు. అది 8 నెలల క్రితం ఇంటి నుంచి తప్పిపోయింది. దీంతో సారయ్య కొన్ని రోజుల పాటు గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో వెతికినా జాడ దొరకలేదు.


అయితే, నెల్లికుదురులో (Nellikuduru) భిక్షాటనకు వచ్చిన వారి వద్ద సారయ్య తన పెంపుడు కుక్కను చూశాడు. దీంతో ఇది నా కుక్క అని వారిని అడగ్గా.. ఇది నా కుక్కే అంటూ వారు వాదించారు. ఇరువురి మధ్య పంచాయితీ పెరగడంతో పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. అయితే, ఇరువర్గాలను శాంతింపచేసిన ఎస్సై రమేష్ బాబు కుక్కను స్థానిక పశువుల దవాఖానా సిబ్బందికి అప్పగించారు. వారు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని యానిమల్ బర్త్ కేర్ సెంటర్‌కి కుక్కను తరలించారు. మరి ఈ కుక్క పంచాయతీ ఎలా పరిష్కారం అవుతుందనేది ఆసక్తిగా మారింది.


Also Read: Train Reservations: కేవలం ఐదే 5 నిమిషాలు - రైళ్లల్లో రిజర్వేషన్లన్నీ ఫుల్, సంక్రాంతికి ఊరెళ్లే వారికి ఈసారి కష్టాలు తప్పవా?