Panchayat Awards : జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకొని దిల్లీలోని విజ్ఞాన భవన్ లో పంచాయత్ అవార్డుల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన గ్రామ పంచాయతీలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవార్డులు అందజేశారు. కేంద్రం ప్రకటించిన మొత్తం 46 జాతీయ అవార్డుల్లో 13 అవార్డులు తెలంగాణ గెలుచుకుంది. ఈ అవార్డులను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఆయా గ్రామాల సర్పంచ్ లు, ఎంపీపీలు, జిల్లా పరిషత్ ఛైర్మన్లు, అధికారులు స్వీకరించారు.
తెలంగాణ గ్రామాలకు అవార్డుల పంట
జాతీయ స్థాయిలో మరోసారి తెలంగాణ గ్రామాలు అత్యుత్తమంగా నిలిచాయి. కేంద్రం ప్రకటించిన మొత్తం 46 జాతీయ అవార్డుల్లో 13 అవార్డులు తెలంగాణ గ్రామాలు గెలుచుకున్నాయి. 8 దీన్ దయాల్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్ పురస్కారాలు, మరో 5 నానాజీ దేశ్ ముఖ్ సర్వోత్తమ పంచాయత్ సతత్ వికాస్ పురస్కారాలు తెలంగాణ గ్రామాలు అందుకున్నాయి. 9 కేటగిరీలలో అవార్డుల ఎంపిక జరగగా, 8 కేటగిరీ లలో అవార్డులు సాధించిన తెలంగాణను భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అభినందించారు. ఈ అవార్డులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఆయా గ్రామాల సర్పంచ్ లు, ఎంపీపీలు, జిల్లా పరిషత్ ఛైర్మన్లు, అధికారులు సోమవారం దిల్లీలో అందుకున్నారు.
దేశానికి ఆదర్శంగా తెలంగాణ
ఈ కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ... తెలంగాణలో సీఎం కేసీఆర్ వల్ల జరుగుతున్న పల్లె ప్రగతి అభివృద్ధి కార్యక్రమాలను, అవి సాధించిన ఫలితాలను వివరించారు. దేశంలో తెలంగాణ మాత్రమే కేంద్ర ఆర్థిక సంఘం నిధులకు సమానంగా గ్రామాలకు ఇస్తుందన్నారు. పల్లెల్లో వినూత్నంగా సాధించిన ప్రగతిని మంత్రి తెలిపారు. రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డులు తీసుకోవడం పట్ల ధన్యవాదాలు తెలిపారు. అవార్డులు అందుకున్న అధికారులు, ప్రజా ప్రతినిధులకు మంత్రి ఎర్రబెల్లి శుభాకాంక్షలు తెలిపారు. ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని అభినందించారు. అవార్డులు ఇచ్చిన కేంద్రానికి, రావడానికి కారణమైన సీఎం కేసీఆర్, సహకరించిన మంత్రులు కేటీఆర్, హరీశ్ రావులకు మంత్రి ఎర్రబెల్లి కృతజ్ఞతలు తెలిపారు. సీఎం కేసీఆర్ ఆలోచనా పథంలో పని చేస్తూ, ఇదే స్ఫూర్తిని కొనసాగించాలన్నారు. దేశానికి ఆదర్శంగా తెలంగాణను నిలపాలన్నారు. అన్ని రంగాల్లో ఇప్పటికే అగ్రగామిగా ఉన్న తెలంగాణను మరింత సమున్నతంగా తీర్చిదిద్దాలని మంత్రి ఎర్రబెల్లి సూచించారు.
సీఎం కేసీఆర్ హర్షం
పచ్చదనం, పరిశుభ్రతతో పాటు పలు విభాగాల్లో తెలంగాణ పంచాయతీలు దేశంలోనే అత్యున్నత స్థాయిలో నిలిచి రాష్ట్రపతి చేతుల మీదుగా దిల్లీలో సోమవారం జాతీయ అవార్డులు అందుకోవడం పట్ల సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మొత్తం 46 ఉత్తమ అవార్డుల్లో 13 అవార్డులను తెలంగాణ రాష్ట్రం కైవసం చేసుకోవడం మనందరికీ గర్వకారణమని సీఎం అన్నారు. దేశవ్యాప్తంగా 2.5 లక్షల గ్రామ పంచాయతీలు ఈ అవార్డుల కోసం పోటీ పడగా అందులో కేవలం 46 గ్రామాలు మాత్రమే అవార్డులు దక్కించుకున్నాయన్నారు. ఇందులోంచి 13 అవార్డులు తెలంగాణకే వచ్చాయన్నారు. మొత్తం జాతీయ అవార్డుల్లో 30 శాతం తెలంగాణ రాష్ట్రమే కైవసం చేసుకుందన్నారు. ఈ 13 ర్యాంకుల్లోంచి కూడా 4 ఫస్ట్ ర్యాంకులు తెలంగాణకే రావడం గొప్పవిషయమని సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు.