LIC Jeevan Tarun Policy: ప్రభుత్వ రంగ జీవిత బీమా సంస్థ 'లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా' ‍‌(LIC) నుంచి అనేక పథకాలు అందుబాటులో ఉన్నాయి. మీ పిల్లల చదువుల నుంచి ఆర్థిక ఇబ్బందులు లేని పదవీ విరమణ జీవితాన్ని గడిపే వరకు చాలా పథకాలను ఈ బీమా సంస్థ అమలు చేస్తోంది. పైగా, జీవిత బీమా కవరేజ్‌ అందిస్తోంది. అందుకే, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్‌ పాలసీల్లో డబ్బును పెట్టుబడి పెట్టడానికి ఇష్టపడే జనాభా పెద్ద సంఖ్యలో ఉంటుంది. ఇది ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి, పెట్టుబడికి గ్యారెంటీ ఉంటుంది. దేశవ్యాప్తంగా కోట్లాది మంది LIC పాలసీదార్లుగా ఉన్నారు. 


LIC, దేశంలోని ప్రతి వయస్సు విభాగానికి, ప్రతి ఆర్థిక తరగతి కోసం విభిన్న పథకాలను తీసుకువచ్చింది. పిల్లల కోసమే ప్రత్యేకంగా కొన్ని పథకాలు (LIC Policy for Children) రూపొందించింది. ఈ రోజు అలాంటి పాలసీ గురించి మనం తెలుసుకుందాం. దీనిని కొనుగోలు చేస్తే, మీ పిల్లల చదువుల టెన్షన్‌కు తెర పడుతుంది. ఈ పథకం పేరు LIC జీవన్ తరుణ్ పాలసీ (LIC Jeevan Tarun Policy). ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు ఎంత మొత్తాన్ని తిరిగి పొందవచ్చో తెలుసుకుందాం.


జీవన్‌ తరుణ్‌ కోసం పిల్లల వయస్సు ఎంత ఉండాలి? 
LIC జీవన్ తరుణ్ పాలసీలో మీరు పెట్టుబడి పెట్టాలంటే, పిల్లల వయస్సు కనిష్టంగా 3 నెలలు - గరిష్టంగా 12 సంవత్సరాలు ఉండాలి. మీ సంతానానికి 20 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు పెట్టుబడి పెట్టవచ్చు. దీని తర్వాత, 5 సంవత్సరాల పాటు ఎలాంటి పెట్టుబడి పెట్టక్కర్లేదు. ఆ తర్వాత, అంటే మీ పిల్లల వయస్సు 25 సంవత్సరాలు నిండిన తర్వాత, అతను మొత్తం డబ్బును క్లెయిమ్ చేయవచ్చు. ఆ డబ్బుతో పిల్లల చదువులు, పెళ్లి ఖర్చుల టెన్షన్ కు తెర పడుతుంది.


కనీస హామీ మొత్తం రూపంలో ఎంత లభిస్తుంది?
ఈ పాలసీలో పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు ఖచ్చితంగా, కనీసం రూ. 75,000 హామీ మొత్తం ప్రయోజనం పొందుతారు. అదే సమయంలో గరిష్ట మొత్తానికి ఎటువంటి పరిమితి లేదు. ఈ పథకం కింద.. మీరు నెలవారీ, త్రైమాసిక, అర్ధ వార్షిక, వార్షిక ప్రాతిపదికన ప్రీమియం డిపాజిట్ చేయవచ్చు. జీవన్ తరుణ్ పాలసీ అనేది పార్టిసిపేటింగ్‌ లిమిటెడ్‌ పేమెంట్‌ స్కీమ్‌ అని గమనించాలి.


మెచ్యూరిటీ తేదీన ఎంత మొత్తం చేతికి అందుతుంది?   
ఒక వ్యక్తి, 12 సంవత్సరాల వయస్సులో ఉన్న పిల్లల కోసం ఈ పాలసీని కొనుగోలు చేశాడని అనుకుందాం. అతను, ప్రతిరోజూ క్రమం తప్పకుండా చిన్న మొత్తంలో రూ. 150 ఆదా చేస్తూ చేస్తే, సంవత్సరానికి దాదాపు రూ. 54,000 ప్రీమియం చెల్లించినట్లు అవుతుంది. ఇలా 8 సంవత్సరాల కాలంలో (సంతానానికి 20 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు) మొత్తం రూ. 4.32 లక్షలు డిపాజిట్ అవుతాయి. దీనిపై రూ. 2.47 లక్షలు బోనస్‌గా LIC చెల్లిస్తుంది. ఇప్పుడు, 25 సంవత్సరాల వయస్సులో అతను సుమారు 7 లక్షల రూపాయలకు యజమాని అవుతాడు.