Harish Rao at Telangana Bhavan: హైదరాబాద్: అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీల (Congress 6 Guarantees)ను అమలు చేసేందుకు వంద రోజులు గడువు కోరుతోంది. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి వారం రోజులు గడవకముందే ప్రతిపక్ష బీఆర్ఎస్ (BRS) విమర్శలు మొదలుపెట్టడం తెలిసిందే. రోజులు గడస్తున్నా హామీల అమలులో అడుగు ముందుకు పడటం లేదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు (Harish Rao) విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కోడ్ పేరు చెప్పి, హామీల అమలును వాయిదా వేసే అవకాశం ఉందన్నారు. మార్చి 17 తో కాంగ్రెస్ ప్రభుత్వానికి వంద రోజులు నిండుతాయని, కానీ అప్పటికి పార్లమెంటు ఎన్నికల కోడ్ వస్తుందన్నారు. కోడ్ పేరు చెప్పి ప్రభుత్వం హామీల అమలును వాయిదా వేసే అవకాశం ఉందని.. కనుక ఎన్నికల కోడ్ వచ్చే లోపే కాంగ్రెస్ గ్యారంటీలు అమలు చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. 
తెలంగాణ భవన్ లో మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజకవర్గంపై బీఆర్ఎస్ నేతలు సమావేశం అయ్యారు. కార్యకర్తలు అద్భుతంగా మాటాడి, క్షేత్ర స్థాయి వాస్తవాలు చెప్పారని హరీష్ రావు మెచ్చుకున్నారు. ఉద్యమకారులు మాట్లాడిన మాటలు పాత జ్ఞాపకాలు గుర్తుకు వచ్చేలా చేశాయన్నారు. బీఆర్ఎస్ పార్టీకి విజయాలు, అపజయాలు ఉన్నాయని, కానీ ఓటమితో కుంగిపోతే తెలంగాణ వచ్చేదా అన్నారు. 2009 లో బీఆర్ఎస్‌కు పది సీట్లే వచ్చాయి.. ఇక పని అయిపోయిందని కేసీఆర్ ఊరుకుంటే తెలంగాణ వచ్చేదా ? అన్నారు.




ఓటమి స్పీడ్ బ్రేకర్ మాత్రమే
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి స్పీడ్ బ్రేకర్ మాత్రమే అన్నారు హరీష్ రావు. భవిష్యత్ లో వచ్చేది మళ్ళీ బీఆర్ఎస్ అని.. కాంగ్రెస్ 420 హామీల్లో వాళ్ళు పావలా వంతుకు మించి అమలు చేయలేరు అని జోస్యం చెప్పారు. మల్కాజ్ గిరిలో పోయినసారి రేవంత్ రెడ్డి తక్కువ ఓట్లతో గెలిచారని, ఎప్పుడూ నియోజకవర్గాన్ని పట్టించుకున్న పాపాన పోలేదని.. ఒక్క పైసా నిధులు తేలేదని విమర్శించారు. సీఎం రేవంత్ మొన్నటివరకూ ప్రాతినిధ్యం వహించిన మల్కాజ్ గిరి నియోజకవర్గంలో ఈ సారి మనం గెలిచి సత్తా చాటాలని పార్టీ శ్రేణులకు హరీష్ రావు పిలుపునిచ్చారు. ఏడింటికి ఏడు అసెంబ్లీ సీట్లు గెలిచాం, ఇప్పుడు కూడా ఎంపీ సీటు మనమే నెగ్గాలని సూచించారు.  


ఎన్నికల కోడ్‌గా బూచిగా చూపనున్న కాంగ్రెస్ 
‘ఇది పరీక్షా సమయం. మనం పార్లమెంటు ఎన్నికల్లో కచ్చితంగా గెలవాలి. కర్ణాటకలో ఐదు గ్యారంటీల హామీ ఇచ్చి కాంగ్రెస్ అభాసు పాలైంది. అక్కడ పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పరిస్థితి ఘోరంగా ఉండబోతోందని సర్వేలు చెబుతున్నాయ్. ఇక్కడ కూడా కాంగ్రెస్ కు కర్ణాటక లాంటి పరిస్థితే ఉంటుంది. పార్లమెంటు ఎన్నికల కోడ్ లోపే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలు నెరవేర్చాలి. ఎన్నికల కోడ్‌ను బూచిగా చూపి హామీల అమలును కాంగ్రెస్ వాయిదా చేయాలని చూస్తోంది.


రేవంత్ స్థానంలో బీఆర్ఎస్ నెగ్గాలన్న హరీష్ రావు  
బీజేపీ అబద్ధాలు ప్రచారం చేసి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో గతంలో కన్నా ఎక్కువ సీట్లు గెలిచింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు పాలపొంగు లాంటిదేనని అసెంబ్లీ ఎన్నికల్లో నగర ఓటర్లు నిరూపించారు. త్వరలో పార్లమెంటు ఎన్నికల ఫలితాలు కూడా అసెంబ్లీ ఫలితాల కన్నా భిన్నంగా ఉంటాయి. ఆ ఎన్నికలకు మీరు కష్టపడి పని చేయాలి. కాంగ్రెస్ పార్టీ ఐదేళ్లు అధికారంలో కొనసాగి మళ్ళీ అధికారం లోకి రావడం అరుదు. అందుకు ఇటీవల జరిగిన రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్ ఎన్నికల ఫలితాలే నిదర్శనం. చిన్న కారణాలతోనే బీఆర్ఎస్ ఓడిపోయిందని కార్యకర్తలు తెలుసుకోవాలి. కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు అయ్యాయి. ఆ రెండు పార్టీల డ్రామాలు ఎండగట్టి పార్లమెంటు ఎన్నికల్లో పార్టీని గెలిపించేందుకు కార్యకర్తలు ఇప్పట్నుంచే నడుం బిగించాలని’ మాజీ మంత్రి హరీష్ రావు బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు.