Joinings into Congress party: అమరావతి: వైఎస్ షర్మిల చేరికలో ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ బలోపేతం అవుతున్నట్లు కనిపిస్తోంది. మంగళగిరి ఎమ్మెల్యే, వైసీపీకి రాజీనామా చేసిన నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆర్కేకు కాంగ్రెస్‌ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు వైఎస్ షర్మిల. అంతకుముందు విజయవాడలో ఏపీ కాంగ్రెస్ చీఫ్‌గా షర్మిల బాధ్యతలు స్వీకరించారు. గిడుగు రుద్రరాజు నుంచి నియామక పత్రాలు అందుకున్నారు.


అనంతరం షర్మిల మాట్లాడుతూ.. గత పదేళ్లలో ఏపీలో అభివృద్ధి జరగలేదని, అప్పులు మాత్రమే ఉన్నాయని టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలపై విమర్శలు గుప్పించారు. షర్మిల శనివారం ఇడుపులపాయకు వెళ్లి వైఎస్సార్ ఘాట్ వద్ద తండ్రికి నివాళులు అర్పించి, ఆశీర్వాదం తీసుకున్నారు. ఆ సమయంలో మాజీ మంత్రి మాజీ మంత్రి అహ్మదుల్ల ఘాట్ వద్ద APCC చీఫ్ షర్మిల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.


షర్మిల వెంటే ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి..
వైఎస్ షర్మిలతో కలిసి పనిచేస్తానని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కొన్ని రోజుల కిందటే ప్రకటించారు. ఏపీలో కాంగ్రెస్‌లో చేరే మొదటి ఎమ్మెల్యేను తానేనని వెల్లడించారు. చెప్పినట్లుగానే ఎమ్మెల్యే ఆర్కే ఆదివారం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ (Congress Party) నుంచి పోటీ చేయడంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, షర్మిల, కాంగ్రెస్ సూచనల మేరకు నడుచుకుంటానని ఆర్కే స్పష్టం చేశారు. షర్మిల నేతృత్వంలో కాంగ్రెస్‌లో చేరుతానని, ఆమెతో పాటు రాజకీయాల్లో కొనసాగుతానని తేల్చిచెప్పారు. అమరావతిపై చంద్రబాబు, జగన్ చేసిన తప్పులను షర్మిలకు చెబుతానన్నారు. షర్మిల నాయకత్వంలో తాను ఏపీ ప్రజల కోసం పోరాటం చేస్తానన్నారు.