TSRTC Special Buses For Dasara : తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన పండుగలు వచ్చాయంటే చాలు సామాన్య ప్రయాణికులకు గుబులు మొదలవుతుంది. పండుగల కోసం రైళ్లల్లో, బస్సులలో ప్రత్యేక ఛార్జీలు వసూలు చేయడం చూస్తుంటాం. దసరా పండుగ సందర్భంగా ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ శుభవార్త అందించారు. విజయదశమిని పురస్కరించుకుని నడుపనున్న బస్సులకు ఎటువంటి అదనపు ఛార్జీలు వసూలు చేయడం లేదని సజ్జనార్‌ తెలిపారు. 


హైదరాబాద్‌లో మెట్రో అంతగా ప్రాఫిట్స్ అందించకపోయినా.. ఆర్టీసీకి మాత్రం ఆదరణ పెరుగుతూనే ఉంది. సామాన్యులకు అందుబాటులో ఉంటే సర్వీసు కావడంతో సేవలు మరింత మెరుగు చేస్తామన్నారు. ఇటీవల ఐదు రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా 1.30 కోట్ల మంది ప్రయాణికులను ఆర్టీసీ బస్సులు సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాయని చెప్పారు. ప్రయాణికుల భద్రతే ధ్యేయంగా సేవలు అందిస్తున్న సంస్థ ఆర్టీసీ అని సజ్జనార్ పేర్కొన్నారు. దసరా పండుగకు సైతం మరిన్ని బస్సులను నడిపి, ప్రయాణాకులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడం తమ బాధ్యత అన్నారు. ప్రయాణికుల మద్దతుతో ఆర్టీసీని మరింత అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తామన్నారు.


Also Read: టెస్లాను తలదన్నే కార్ల కంపెనీ తెలంగాణలో.. ప్రదర్శనకు సూపర్ SUV, అదిరిపోయే డిజైన్‌తో.. 


దసరాకు ప్రత్యేక బస్సులు..
తెలంగాణలో పెద్ద పండుగ విజయదశమి సందర్భంగా రాష్ట్రంలో 4,035 ప్రత్యేక బస్సులను నడపాలని ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని టీఎస్ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి ఇటీవల తెలిపారు. ప్రయాణికులు పండుగకు సొంతూళ్లకు వెళ్లడానికి ఇబ్బందులు కలగకూడదని ఎప్పటిలాగే ప్రత్యేక సర్వీసులను రాష్ట్ర ఆర్టీసీ సంస్థ నడుపుతుందని చెప్పారు. ప్రయాణికులకు ఏమైనా సమస్యలు తలెత్తితే తమ కాల్ సెంటర్ నెంబర్లు 040-68153333,  040-30102829 ద్వారా సంప్రదించాలని సూచించారు.


Also Read: తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ వర్షాలు.. ఆ జిల్లాల్లో కుండపోత వానలు పడే అవకాశం 


మరిన్ని హెల్ప్‌లైన్ నెంబర్లు..
పైన పేర్కొన్న ల్యాండ్ లైన్ నెంబర్లతో పాటు ప్రత్యేకంగా బస్టాండ్లకు సంబంధించి హెల్ప్ లైన్ నెంబర్లను టీఎస్ఆర్టీసీ ఛైర్మన్, ఎండీలు తెలిపారు. మహాత్మా గాంధీ బస్టాండ్ 9959226257, జూబ్లీహిల్స్ బస్ స్టేషన్ 9959226246, రేతిఫైల్ బస్టాండ్ 9959226154, కోఠి బస్టాండ్ 9959226160 నెంబర్లలో వివరాల కోసం సంప్రదించాలని ప్రయాణికులకు సూచించారు. 


నేడు ఫ్రీ ట్రాన్స్‌పోర్ట్.. 
యూపీఎస్​సీ ప్రిలిమ్స్ పరీక్ష రాసే అభ్యర్థులకు నేడు టీఎస్ ఆర్టీసీ ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పించింది. హైదరాబాద్ జంట నగరాలు, వరంగల్‌లోని ట్రై సిటీస్‌లో ప్రిలిమినరీ పరీక్ష రాసే అభ్యర్థులు హాల్ టికెట్ చూపించడం ద్వారా ఉచితంగా ప్రయాణించేలా టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్​ ఓ ప్రకటనలో తెలిపారు. అన్ని మెట్రో, ఏసీ బస్సుల్లోనూ అభ్యర్థులు ప్రయాణించే అవకాశం కల్పించారు.


Also Read: కొత్త వృద్ధాప్య పింఛన్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్... 57 ఏళ్ల వయసు నిండిన వారు అర్హులు... ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి