సీఎం కేసీఆర్ పాలనలో ఎస్సీ, ఎస్టీల జీవితాలు చితికిపోయాయని.. ఆదివాసీల జీవితాలు మార్చాలన్నదే కాంగ్రెస్ లక్ష్యమని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి వేదికగా జరిగిన దళిత, గిరిజన దండోరా సభలో రేవంత్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల కోసమే టీఆర్ఎస్ ప్రభుత్వం పథకాలు తెచ్చిందని.. ఉప ఎన్నికలు వచ్చినప్పుడే కేసీఆర్‌కు ఎస్సీలు గుర్తుకొస్తారని ఆరోపించారు. 119 నియోజవర్గాల్లో ఉప ఎన్నికలు వస్తేనే నిధులు ఇస్తామనేలా సీఎం ధోరణి ఉందని ఎద్దేవా చేశారు. దళిత బంధును తెలంగాణ అంతటా ఎందుకు అమలు చేయలేదని కేసీఆర్‌ను ప్రశ్నించారు. 



కేసీఆర్ బిడ్డను బిర్లాను.. కొడుకునే అంబానీని.. అల్లుడిని టాటాను చేశారని రేవంత్ అన్నారు.  ఆదివాసుల హక్కుల పోరాటం ఇంద్రవెల్లి గడ్డ మీదే జరిగిందని.. ఇదో ఉద్యమాల ఖిల్లా అని అన్నారు. తెలంగాణ బిడ్డల భవిష్యత్ దొర గడిలో బందీ అయిందని.. అందుకే ఇంద్రవెల్లి నుంచే తన పోరాటాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఇంద్రవెల్లిలో ఆనాటి ఘటనలో చనిపోయిన కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఆదిలాబాద్ జిల్లాలో మంత్రులు, ఎమ్మెల్యేలు సీఎంకు బానిసలుగా మారారని విమర్శించారు. 


బాల్క సుమన్ ఏం మాట్లాడుతున్నారు? 
దేశంలో దళితులను స్పీకర్ గా, కేంద్ర హోంమంత్రిగా, ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదని రేవంత్ అన్నారు. దళితుడిని సీఎం చేస్తానన్న కేసీఆర్ వ్యాఖ్యలు ఏమయ్యాయని ప్రశ్నించారు. మాజీ ఉప ముఖ్యమంత్రి రాజయ్యను పదవి నుంచి ఎందుకు తప్పించారో ఇప్పటివరకు ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. 



కేసీఆర్ బానిసల్లా పోలీసులు.. 
ఇంద్రవెల్లికి 12 కిలోమీటర్ల దూరంలో సభకు వచ్చే వారిని పోలీసులు ఆపారని, ఇదెక్కడి న్యాయమని రేవంత్ ప్రశ్నించారు. కొందరు పోలీసులు కేసీఆర్‌కు కట్టు బానిసల్లా మారారని ఆరోపించారు. ఇవన్నీ గుర్తు పెట్టుకుంటామని.. తాము అధికారంలోకి వచ్చాక లెక్క తేల్చుకుంటామని అన్నారు. ఈ సభలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ సహా పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. 


దళిత దండోరా సభకు పోటెత్తిన జనం
ఇంద్రవెల్లిలో నిర్వహిస్తున్న దళిత, గిరిజన దండోరా సభకు  జనం పోటెత్తారు. దీంతో గుడిహత్నూర్‌ నుంచి ఇంద్రవెల్లి మార్గంలో భారీగా ట్రాఫిక్‌ జామ్ అయ్యింది. పోలీసులు ఎక్కడికక్కడ వాహనాలు నిలిపివేస్తున్నారు. సభాస్థలికి దూరంగా వాహనాలను పార్కింగ్‌ చేయాలని కోరుతున్నారు.  కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలు కాలినడకన సభకు తరలివస్తున్నారు. సభాస్థలిలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. 






Also read: Dalit Dandora Yatra Live Updates: ఇంద్రవెల్లిలో కాంగ్రెస్ ‘దళిత దండోరా’.. కదం తొక్కిన నేతలు