అంబటి రాంబాబు ఆడియో అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ క్లిప్‌పై అంబటి రాంబాబు స్పందించారు. ఆ ఆడియోలో ఉన్న వాయిస్ తనది కాదని..ఓ వీడియో విడుదల చేశారు. తన పరువు ప్రతిష్టలు దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్నారని.. తనపై కుట్ర జరుగుతోందని ఆరోపించారు. గతంలోనూ తనపై ఇలా చేశారన్నారు. ఈ కుట్ర వెనుక ఎవరున్నారో త్వరలో వెలుగులోకి వస్తుందని ప్రకటించారు. అంబటి రాంబాబు ఓ మహిళతో మాట్లాడిన ఆడియో సోషల్ మీడియాలో విపరీతంగా సర్క్యూలేట్ అయింది. అందులో సుకన్య అనే మహిళ గురించి వాయిస్‌లో అసభ్యంగా మాట్లాడారు. ఆయన అంబటి రాంబాబేనని ఆయనదే వాయిస్ అని కొంత మంది పోస్టింగ్ పెట్టడం ప్రారంభించారు. దీంతో అది వైరల్ అయిపోయింది. అది తన దృష్టికి వచ్చిన తర్వాత అంబటి రాంబాబు స్పందించారు. తన వాయిస్ కానే కాదన్నారు.
కుట్రదారుల్ని బయట పెట్టడానికి ఆయన పోలీసులకు కంప్లైంట్ చేశారో లేదో స్పష్టత లేదు. గతంలోనూ ఆయన ప్రజారాజ్యం పార్టీకి చెందిన ఓ మహిళా కార్యకర్తతో అసభ్యంగా మాట్లాడినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఓ టీవీ చానల్ ఆ మాటలను అప్పట్లో విస్తృతంగా ప్రచారం చేసింది. ఆ మాటలు తనవేనని అంబటి రాంబాబు అప్పట్లో ఒప్పుకున్నారు కానీ.. మొత్తం కుట్ర అని ఆరోపించారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఆడియోలో మాటలు తనవి కావని మాత్రం చెబుతున్నారు. అంబటి రాంబాబు పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. అసలు ఈ ఆడియో ఎక్కడ పుట్టిందో తేల్చే అవకాశ ఉంది. ఇటీవలి కాలంలో అంబటి రాంబాబు ఆడియో టేపులు వెలుగులోకి రావడం ఇదే మొదటి సారి కాదు.
కొద్ది రోజుల కిందట.. సత్తెనపల్లి నియోజకవర్గంలో ఉన్న వైసీపీ నేత లక్ష్మిపార్వతి పొలంలో ప్రభుత్వం తరపున సబ్సిడీ కింద ఓ బోర్ వేయించడానికి చేసిన ప్రయత్నాల్లో ఆయన అనుచితంగా మాట్లాడినట్లుగా ఆడియో బయటకు వచ్చింది. ఆ ఆడియోపై అంబటి రాంబాబు స్పందించలేదు. దీంతో ఆయనదే వాయిస్ అనుకున్నారు. ఇప్పుడు బయటకు వచ్చిన ఆడియో మరీ దారుణంగా ఉండటంతో ఆయన స్పందించి ఖండించారు. ఈ ఆడియో వెనుక ఉన్న నిజానిజాలు బయటకు వెల్లడి కావాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఫేక్ ప్రచారాలతో సోషల్ మీడియా పోస్టింగ్‌లు ఇటీవలి కాలంలో ఎక్కువైపోయాయి. వాట్సాప్ చాట్‌లను ప్రత్యేకంగా క్రియేట్ చేసి... ఒకరిపై ఒకరు బురద చల్లుకుంటున్నారు. ఈ క్రమంలో ఆడియో టేపులు కూడా అలాగే బయటకు వస్తున్నాయేమో ... పోలీసులే తేల్చాలి. అధికార పార్టీ ఎమ్మెల్యేగా తనపై జరిగిన కుట్రను అంబటి రాంబాబే బయట పెట్టే అవకాశం ఉంది.