ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ శాంసంగ్ నుంచి త్వరలో విడుదల కానున్న గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 3, గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 3 ఫీచర్లు ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. మరో రెండు రోజుల్లో జరగనున్న (ఆగస్టు 11న) మెగా ఈవెంట్లో ఈ ఫోన్లను శాంసంగ్ అధికారికంగా లాంచ్ చేయనుంది. విడుదలకు ముందే ఈ ఫోన్ల ఫీచర్లు ఆన్‌లైన్‌లో దర్శనమిచ్చాయి. రెండర్ల ద్వారా ఈ ఫోన్ల స్పెసిఫికేషన్లు బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. 


తమ సంస్థ నుంచి త్వరలో రెండు ఫోల్డబుల్ ఫోన్లు తీసుకురానున్నట్లు శాంసంగ్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రకటన వెలువడిన నాటి నుంచి ఫోన్ల ఫీచర్లు, ధరలకు సంబంధించి పలు లీకులు వస్తున్నాయి. విన్ ఫ్యూచర్ వెల్లడించిన వివరాల ప్రకారం.. శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 3లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉండనుంది. రెండర్లు విడుదల చేసిన ఫొటోల్లో గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 3.. పర్పుల్, బ్లాక్ రంగుల్లో ఉంది. అయితే ఈ ఫోన్లను ఫాంటమ్ బ్లాక్, ఫాంటమ్ గ్రీన్ మరియు ఫాంటమ్ సిల్వర్ కలర్‌ వేరియంట్లలో అందించనున్నట్లు తెలుస్తోంది. 



ఇక శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 3 విషయానికి వస్తే.. ఇది డ్యూయల్ టోన్ ఫినిష్‌తో రానుంది. వెనుకవైపు రెండు కెమెరాలు (లేదా పోన్ మూసి వేస్తే ముందు ఒక కెమెరా) ఉండేలా దీనిని డిజైన్ చేశారు. ఇది క్రీమ్, లావెండర్, ఫాంటమ్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో రానుంది. ఈ రెండు ఫోన్లలో స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్ అందించే అవకాశం ఉంది. ఇక గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 3లో 4400 ఎంఏహెచ్, గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 3లో 3300 ఎంఏహెచ్ బ్యాటరీ కెపాసిటీ అందించినట్లు తెలుస్తోంది. అలాగే ఈ రెండు ఫోన్లలో ఫాస్ట్ ఛార్జింగ్, వైర్‌లెస్ చార్జింగ్ సదుపాయాలు అదనపు ఆకర్షణగా నిలిచే అవకాశం ఉంది. 


గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 3 ఫీచర్లు.. 
గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 3 ఫోన్ ఆండ్రాయిడ్ 11 ఆధారిత వన్ యూఐ 3.1తో పనిచేయనుంది. ఇందులో లోపల వైపున 7.6-అంగుళాల డైనమిక్ అమోఎల్ఈడీ డిస్‌ప్లే ఉండనుంది. మెయిన్ డిస్‌ప్లే రిజల్యూషన్ 2,208x1,768 పిక్సెల్స్ కాగా, రిఫ్రెష్ రేట్ 120 Hzగా ఉండనుంది. 370 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ ఉంటుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ఫీచర్ అందించే అవకాశం ఉంది. ఇక ఈ ఫోన్ బయటవైపు 6.2 అంగుళాల సూపర్ అమోఎల్ఈడీ డిస్‌ప్లే‌తో రానుంది. 2,260x832 పిక్సెల్స్ డిస్‌ప్లే రిజల్యూషన్, 387 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 120 Hz రిఫ్రెష్ రేట్ ఉండనున్నాయి. వీటిలో 12 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ ఉండనున్నాయి. 



గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 3 ఫీచర్లు..
గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 3 ఫోన్‌లో 6.7 అంగుళాల డైనమిక్ అమోఎల్ఈడీ ఫోల్డబుల్ మెయిన్ డిస్‌ప్లే ఉండనుంది. మెయిన్ డిస్‌ప్లే స్క్రీన్ రిజల్యూషన్ 2,640x1,080 పిక్సెల్స్, పిక్సెల్ డెన్సిటీ 425 పీపీఐ, రిఫ్రెష్ రేట్ 120 Hzగా ఉండనున్నాయి. ఈ ఫోన్ బయటవైపు 1.9 అంగుళాల డిస్‌ప్లే ఉండే అవకాశం ఉంది. ఇందులో 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ ఉండనుంది.  


Also Read: Noise Colorfit Pro 3 Launch: నాయిస్ నుంచి స్మార్ట్ వాచ్ రిలీజ్.. సరికొత్తగా హ్యాండ్ వాష్ రిమైండర్ ఫీచర్