Petre Rates States : తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు పెట్రో ధరలపై చర్చ జరుగుతోంది. కేంద్రం రెండు సార్లు భారీగా తగ్గించినప్పటికీ రాష్ట్రాలు పన్నుల్లో కొంత మేర తగ్గించడానికి కూడా నిరాకరించాయి. దీంతో కేంద్రం తన వంతుగా ఎంతో కొంత తగ్గించినప్పుడు రాష్ట్రాలు కూడా ఎందుకు తగ్గించవన్న వాదన వినిపిస్తోంది. అయితే రాష్ట్రాలు మాత్రం పెంచింది కేంద్రమేనని.. ఇంకా ఇంకా తగ్గించాలని వాదిస్తున్నాయి. అయితే కొన్ని రాష్ట్రాలు మాత్రం తగ్గించాయి. కానీ తెలుగు రాష్ట్రాలు మాత్రం అలాంటి ఆలోచన చేయడం లేదు. దీంతో రాజకీయం చేయడానికి అవకాశం దొరికినట్లయింది.
పెట్రో పన్నులు తగ్గించేది లేదంటున్న తెలుగు రాష్ట్రాలు !
కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ , డీజిల్ పై సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీని తగ్గించింది. బీజేపీ పాలిత, ఎన్డీయే పాలిత రాష్ట్రాలు వ్యాట్‌ను తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. గత దీపావళి సమయంలోనూ ఇలాగే తగ్గించారు. అప్పుడు కూడా కొన్ని రాష్ట్రాలు భారీగా తగ్గించాయి. కేవలం బీజేపీ పాలిత రాష్ట్రాలే కాకుండా… ఇతర ప్రభుత్వాలు ఉన్న చోట్ల కూడా తగ్గిస్తున్నాయి. బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న కేరళ, మహారాష్ట్ర, రాజస్తాన్ రాష్ట్రాలు పెట్రోల్‌పై వ్యాట్‌ను తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. ఇతర బీజేపీ రాష్ట్రాలు కూడా అదే తరహా ప్రకటనలు చేస్తున్నాయి. దీంతో అందరి చూపు తెలుగు రాష్ట్రాలపైనే పడుతోంది. తాజాగా తగ్గింపులతో దేశంలోనే అత్యధిక పెట్రోల్, డీజిల్ రేట్లు ఉన్న రాష్ట్రాలుగా ఏపీ, తెలంగాణ నిలుస్తున్నాయి. ప్రాథమికంగా అయితే పెట్రో పన్నుల తగ్గింపు అనే ఆలోచనే రెండు రాష్ట్రాల ప్రభుత్వాలకు లేదు. రోడ్లకు కనీస మరమ్మతులు చేయకపోయినా రోడ్ సెస్ వేసి ప్రజల దగ్గర పిండేసుకుంటున్న ఏపీ ప్రభుత్వం వాటిని తగ్గించడానికి కూడా ఏ మాత్రం సిద్ధంగా లేదు.
కేంద్రం సెస్‌లు తగ్గిస్తే చాలంటున్న రాష్ట్రాలు !
కేంద్ర ప్రభుత్వానికి పెట్రోల్, డీజిల్‌లపై సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ రూపంలో 2019–20 ఆర్థిక సంవత్సరంలో పెట్రోల్, డీజిల్‌పై సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ రూపంలో 1.78 లక్షల కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. 2020–21 ఆర్థిక సంవత్సరానికి ఇది రెట్టింపు కంటే ఎక్కువైంది. మొత్తం రూ. 3.72 లక్షల కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది. కారణం కేంద్రం పన్నులు భారీగా పెంచడమే. కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు 41 శాతం వాటా రావాలి. అంటే అంటే ఎక్సైజ్ డ్యూటీ రూపంలో వచ్చిన రూ. 3.72 లక్షల కోట్ల రూపాయల్లో రాష్ట్రాల వాటా కింద కేంద్రం రూ. 1,52,520 కోట్ల రూపాయలను చెల్లించాలి. కానీ కేంద్రం అన్ని రాష్ట్రాలకు కలిపి ఇచ్చింది రూ. 19,972 కోట్లు మాత్రమే. ఎందుకంటే కేంద్రం సెస్‌ల రూపంలో ఎక్కువ వసూలు చేస్తోంది. సెస్‌లలో వాటా రాష్ట్రాలకు ఇవ్వాల్సిన పని లేదు. బేసిక్ ఎక్సైజ్ డ్యూటీ మాత్రమే రాష్ట్రాలకు పంచాల్సి ఉంటుంది. ఈ పద్దు కింద చూపే దాంట్లో మాత్రమే రాష్ట్రాలకు వాటా ఉంటుంది. సెస్సుల రూపంలో వచ్చే దాంట్లో పైసా కూడా రాష్ట్రాలకు దక్కదు. గంపగుత్తగా వచ్చినదంతా కేంద్ర ఖజానాను వెళుతుంది. అందుకే సెస్‌లు తగ్గించాలని రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్నాయి.
కేంద్రం ఇవ్వట్లేదు కాబట్టి తాము వ్యాట్ తగ్గించేది లేదంటున్న రాష్ట్రాలు !
ఏపీలో లీటర్ పెట్రోల్‌పై 35.77 శాతం, డీజిల్‌పై 28.08 శాతం వ్యాట్ వసూలు చేస్తోంది. రోడ్ సెస్ అదనం. తెలంగాణ ప్రభుత్వం లీటర్ పెట్రోల్‌పై 35.2శాతం, డీజిల్‌పై 27.3శాతం వసూలుచేస్తున్నాయి. పన్ను పెంచింది కేంద్రం కాబట్టి కేంద్రమే తగ్గించాలని రాష్ట్రాలు వాదిస్తున్నాయి. కానీ కేంద్రం పన్నులు పెంచిన ప్రతీ సారి రాష్ట్రాలకు కూడా ఆదాయం పెరిగింది. కేంద్రం రేట్లు పెంచి వంద దాటించడం వల్ల రాష్ట్రానికి కూడా ఆదాయం పెరిగింది. కానీ ఈ ట్యాక్స్‌లు తగ్గించేందుకు మాత్రం రాష్ట్రాలు సిద్ధపడటం లేదు. ఆర్థిక పరంగా క్లిష్టపరిస్థితులను ఎదుర్కొంటున్న తెలుగు రాష్ట్రాలు ఇప్పుడిప్పుడే అలాంటి ఆలోచన చేసే అవకాశం కనిపించడం లేదు.