తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల తొలి జాబితాను సీపీఎం విడుదల చేసింది. మొత్తం 14 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. మరో 3 స్థానాలైన నల్గొండ, హుజూర్ నగర్, కోదాడ స్థానాల్లో అభ్యర్థులను సాయంత్రం ప్రకటించే అవకాశం ఉంది. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఖమ్మం జిల్లా పాలేరు నుంచి బరిలోకి దిగనున్నారు. దీంతో  పాటు మేనిఫెస్టోను సైతం ప్రకటించారు. అయితే, కాంగ్రెస్ తో పొత్తు కోసం సీపీఎం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. మిర్యాలగూడ, వైరా స్థానాలు ఇవ్వాలని సీపీఎం కోరగా, కాంగ్రెస్ నుంచి స్పష్టమైన నిర్ణయం రాకపోవడంతో, 17 నియోజకవర్గాల్లో ఒంటరిగానే పోటీ చేయనున్నట్లు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రకటించారు.


అభ్యర్థులు వీరే



  • భద్రాచలం (ఎస్టీ) - కారం పుల్లయ్య

  • అశ్వారాపుపేట (ఎస్టీ) - పిట్టల అర్జున్

  • పాలేరు - తమ్మినేని వీరభద్రం

  • మధిర (ఎస్సీ) - పాలడుగు భాస్కర్

  • వైరా (ఎస్టీ) - భూక్యా వీరభద్రం

  • ఖమ్మం - ఎర్ర శ్రీకాంత్

  • సత్తుపల్లి (ఎస్సీ) - మాచర్ల భారతి

  • మిర్యాలగూడ - జూలకంటి రంగారెడ్డి

  • నకిరేకల్ (ఎస్సీ) - చినవెంకులు

  • భువనగిరి - కొండమడుగు నర్సింహ

  • జనగాం - మోకు కనకారెడ్డి

  • ఇబ్రహీంపట్నం - పగడాల యాదయ్య

  • పటాన్ చెరు - జె.మల్లికార్జున్

  • ముషీరాబాద్ - ఎం.దశరథ్


'బీజేపీ ఓటమే లక్ష్యం'


తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ ఓటమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. భద్రాచలం, మధిర స్థానాలు వదులుకున్నా, మిర్యాలగూడ, వైరా స్థానాలపై డెడ్ లైన్ లోపు కాంగ్రెస్ స్పందించలేదని అన్నారు. వైరా విషయంలో భట్టి విక్రమార్క మాట మార్చారని పేర్కొన్నారు. కాంగ్రెస్​ నేతల వైఖరి, తమను ఎంతో బాధించిందని ఆవేదన వ్యక్తం చేశారు. కమ్యూనిస్టులకు విలువ ఇవ్వని కాంగ్రెస్‌ తో పొత్తు ఉండదని చెప్పిన తమ్మినేని, అనివార్య పరిస్థితుల్లో ఒంటరిగానే పోటీ చేయాలని నిర్ణయించుకున్నామని తెలిపారు.


సీపీఐకి మద్దతు


అసెంబ్లీలో కమ్యూనిస్టులకు ప్రాతినిధ్యం ఉంటేనే ప్రజలకు మేలు జరుగుతుందని తమ్మినేని అభిప్రాయపడ్డారు. కమ్యూనిస్టు పార్టీలు ఐక్యంగా పోటీ చేయాలని నిర్ణయించినప్పటికీ సీపీఐ వైఖరి చెప్పలేదని, అయినప్పటికీ సీపీఐకి మద్దతిస్తామని పేర్కొన్నారు. ఒకవేళ కాంగ్రెస్‌తో పొత్తు కొనసాగించి సీపీఐ పోటీ చేస్తే ఆ పార్టీకి మద్దతిస్తూ అక్కడ పోటీ చేయబోమని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో సీపీఎం పోటీ చేసే స్థానాల్లో కాకుండా మిగతా చోట్ల బీజేపీని ఓడించే ప్రధాన పార్టీకి మద్దతివ్వాలని తమ కార్యకర్తలకు సూచిస్తామన్నారు. 


కాంగ్రెస్ తో సీపీఐ పొత్తు


మరోవైపు, కాంగ్రెస్ తో సీపీఐ పొత్తు ఖరారైంది. సీపీఐకి కొత్తగూడెం సీటు, మరో ఎమ్మెల్సీ ఆఫర్ ఇవ్వగా, మునుగోడులో స్నేహ పూర్వక పోటీ చేస్తామని సీపీఐ తెలిపింది. అయితే, మునుగోడులో పోటీ వద్దని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సూచించగా, మరోసారి చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సీపీఎంతో పొత్తుపైనా సీపీఐ నేతలు ప్రస్తావించారు. ఖమ్మం జిల్లాలో ఓ సీటును సీపీఎంకు కేటాయించాలని సీపీఐ నేతలు సూచించగా, కాంగ్రెస్ అధిష్ఠానం దీనిపై సీపీఎంతో చర్చిస్తున్నారని రేవంత్ తెలిపారు.


Also Read: మహిళా రిజర్వేషన్లపై ఎమ్మెల్సీ కవిత కీలక నిర్ణయం