Telangana Cabinet News :  తెలంగాణలో రేవంత్ రెడ్డి కేబినెట్ విస్తరణ ఎప్పుడైనా ఉంటుందని అనుకున్నారు. రేవంత్ రెడ్డి గవర్నర్ ను కూడా కలవడంతో రాజ్ భవన్ లో ఏర్పాట్లు జరరగమే తరువాయని ప్రచారం  జరిగింది. కానీ ఇప్పుడు మళ్లీ సీన్ మారిపోయింది. ఇప్పుడల్లా మంత్రి వర్గ విస్తరణ లేదని కొత్త మంత్రులెవరూ ప్రమాణం చేయడం లేదని చెబుతున్నారు. దీనికి కారణం హైకమాండ్ నుంచి ఇంకా గ్రీన్ సిగ్నల్ రాకపోవడమే.  తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు.  మంత్రి వర్గ విస్తరణతో పాటు పీసీసీ చీఫ్ ఎంపికపై పార్టీ అగ్రనేతలతో చర్చలు జరిపారు. ప్రస్తుతం పాలనపై దృష్టి పెట్టాలని పూర్తి స్థాయి బడ్జెట్ పై కసరత్తు చేసి హామీల అమలు దిశగా కృషి చేయాలని హైకమాండ్ రేవంత్ కు చెప్పినట్లుగా తెలుస్తోంది. 


తెలంగాణ కేబినెట్‌లో ప్రస్తుతం ఆరు ఖాళీలు ఉన్నాయి. ఇందులో నాలుగైదు స్థానాలను భర్తీ చేయాలని రేవంత్ అనుకుంటున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలకు ప్రాతినిధ్యం లేదు. ఆయా జిల్లాలతో పాటు తీవ్రంగా ఒత్తిడి తెస్తున్న మరికొంత మంది సీనియర్లకు పదవులు ఇవ్వాలనుకున్నారు. కానీ వారికి ఇస్తే.. సామాజిక, ప్రాంతీయ సమీకరణాలు సరిపోవడం లేదు. దీంతో ఇప్పటికిప్పుడు కేబినెట్ విస్తరణ విషయాన్ని  పక్కన పెట్టడం మంచిదని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పుడే పార్టీలో చేరికల అంశం గందరగోళానికి కారణం అవుతోంది. పార్టీలో చేరుతున్న  బీఆర్ఎస్ నేతల వల్ల ఇప్పటికే ఉన్న క్యాడర్ డిస్ట్రబ్ అవుతోంది. ఇప్పుడు మంత్రి వర్గ విస్తరణ చేస్తే.. పదవులు రాని వారి వల్ల మరింతగా సమస్యలు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. 


మొదట్లోనే అన్ని పదవలు భర్తీ చేసి ఉంటే ఈ పాటికి అతా సర్దుకునేది. కానీ లోక్ సభ ఎన్నికల్లో మంచి పనితీరు కనబరిచిన వారికి పదవుల్లో ప్రాధాన్యం ఇస్తామని సంకేతాలు పంపడం కోసం వాటిని ఖాళీగా ఉంచారు. కానీ లోక్ సభ ఎన్నికల్లో అనుకున్నంతగా ఫలితాలు రాలేదు. పదమూడు స్థానాలు వస్తాయనుకుంటే..ఎనిమిది స్థానాలకే పరిమితమయ్యారు. తనకు అప్పగించిన టాస్క్ పూర్తి చేశానని తనకు మంత్రి పదవి కావాల్సిందేనని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పట్టుబడుతున్నారు ఇప్పటికే ఆయన సోదరుడు మంత్రిగా ఉన్నారు. ఇలాంటి సమస్యలు చాలా ఉన్నాయి. 


ఇక  నామినేటెడ్ పోస్టుల విషయంలోనూ ఇబ్బందికర వాతావరణం కనిపిస్తోంది. పార్టీ కోసం కష్టపడిన వారికి ఇవ్వాలన్నా సాధ్యం కావడం లేదు. ఒక్కో  నేత ... ఒక్కో  పేరును సూచించడం వల్ల అనేక సమస్యలు వస్తున్నాయి.  అందుకే గతంలో ప్రకటించిన నామినేటెడ్ పోస్టులకు కూడా ఇంకా జీవో జారీ చేయలేదు. హైకమాండ్ వద్ద లాబీయింగ్ చేసుకునే నేతుల కూడా ఎక్కుగా ఉన్నారు. ఆ వైపు నుంచి  వచ్చే ఒత్తిళ్ల కారణంగా పార్టీ కోసం పని చేసిన వారికి.. టిక్కెట్లు త్యాగం చేసిన వారికి పదవులు ఇవ్వలేకపోతున్నారు.