Khammam Renuka Chowdary: తెలంగాణలో రాజ్యసభ సభ్యుల ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. కాంగ్రెస్‌ అభ్యర్థులు రేణుకా చౌదరి, అనిల్‌ కుమార్‌ యాదవ్, బీఆర్ఎస్‌ అభ్యర్థి వద్దిరాజు రవి ఏకగ్రీవంగా రాజ్యసభకు ఎన్నికయ్యారు. తెలంగాణ (Telangana)కు ఖాళీ అయిన మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. 3 నామినేషన్లే దాఖలు అయ్యాయి. దీంతో ఎన్నిక ఏకగ్రీవమైనట్లు రిటర్నింగ్ అధికారులు ప్రకటించారు. ఈ మేరకు ఎన్నికైనవారికి అధికారులు ధ్రువీకరణ పత్రం అందజేశారు. ఈ క్రమంలో రాజ్యసభకు ఎన్నికైనట్లు రేణుకా చౌదరికి అధికారులు ఇవాళ ధ్రువీకరణ పత్రం అందించారు. దీంతో ఆమెకు టీ కాంగ్రెస్ నేతలు శుభాకాంక్షలు తెలిపారు. రాజ్యసభకు ఎన్నికైన సందర్భంగా గాంధీభవన్‌కు వచ్చిన ఆమె.. ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటించారు. 


రాజ్యసభ ఎంపీగా అవకాశం కల్పించినందుకు ఏఐసీసీ పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలిపిన రేణుకా చౌదరి.. రాహుల్ న్యాయ యాత్ర పేద ప్రజల కోసం చేస్తున్న యాత్ర అని అన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మహిళా పక్షపాతి అని, అందుకే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత గ్యాస్ అందించారని తెలిపారు. 
పార్లమెంట్ ఎదుట రైతులు ఆందోళన చేస్తుంటే కేంద్రం ఏం చేస్తుందని ప్రశ్నించారు. రైతులపై కేంద్ర ప్రభుత్వం దౌర్జన్యం చేస్తుందని, దీనిపై రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తామని హెచ్చరించారు.
ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఏం ఆధారాలతో మాట్లాడుతున్నారని, ఆయనపై పరువు నష్టం దావా వేస్తామని రేణుకా చౌదరి తెలిపారు. ఖమ్మం ప్రజలు అందరూ తన వారసులేనని, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఖమ్మం సీటు గెలవడం ఖాయమని రేణుకా చౌదరీ ధీమా వ్యక్తం చేశారు.


ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీపై రేణుకా చౌదరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మోదీ తన సోదరుడు అని, రాబోయే రాఖీ పండుగకు రాఖీ కడుతామని అన్నారు. తాను రాజ్యసభ ఎన్నిక కావడం బహుమతి కాదని, బాధ్యత అని తెలిపారు. ఎన్నికలు వస్తుండటంతో ప్రతిపక్ష నేతల ఇళ్లపైకి ఈడీని పంపిస్తున్నారని, పదేళ్లు ఇదే చూశామని ఆరోపించారు. ఇకపై ఇలా సాగనివ్వమని రేణుకా హెచ్చరించారు. యువతకు ఉద్యోగాలు ఇవ్వకుండా మోదీ వారిని మోసం చేశారని విమర్శించారు. ఖమ్మంలో బీజేపీ, బీఆర్ఎస్‌కు చోటే లేదని, కాంగ్రెస్ నుంచి గెలిచే వారికే సీటు ఇవ్వాలని కోరారు. ఖమ్మం బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు కాంగ్రెస్‌లోకి వస్తే ఆహ్వానిస్తామని, కానీ ఖమ్మం సీటు మాత్రం కుదరదని అన్నారు. గాంధీభవన్‌లో చాలా కుర్చీలు ఉంటాయని, అక్కడ నామాకు అవకాశం ఉంటుందని వ్యంగ్యస్త్రాలు సంధించారు.  


కాగా రేణుకా చౌదరి 1984లో టీడీపీతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. ఆ పార్టీ నుంచి రెండుసార్లు వరుసగా రాజ్యసభకు వెళ్లారు. 1997 నుంచి 1998 వరకు హెచ్‌డీ దేవెగౌడ కేబినెట్‌లో కేంద్రమంత్రిగా పనిచేశారు. 1998లో టీడీపీని వీడి కాంగ్రెస్‌లో చేరారు. ఖమ్మం నుంచి రెండుసార్లు ఎంపీగా గెలిచిన ఆమె.. యూపీఏ హయాంలో కేంద్రమంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత 2012లో కాంగ్రెస్ నుంచి రాజ్యసభకు ఎన్నికవ్వగా.. ఇప్పుడు మరోసారి ఆ పార్టీ నుంచి పెద్దల సభలోకి అడుగుపెడుతున్నారు. తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో సీనియర్ మహిళా నేతగా రేణుకా చౌదరి ఉన్నారు.