తమిళ స్టార్ హీరో సూర్య డైరెక్టర్ శివ దర్శకత్వంలో నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం 'కంగువా' డబ్బింగ్ మొదలయ్యింది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణసంస్థలు యూవీ క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ నిర్మిస్తున్నాయి. ఇందులో బాలీవుడ్ నటి దిశా పటానీ హీరోయిన్ గా నటిస్తున్నారు. 


చారిత్రాత్మక నేపథ్యంలో తెరకెక్కబోతున్న ఈ చిత్రానికి జనవరిలో షూటింగ్ పూర్తయింది. కాగా, తాజాగా, డబ్బింగ్ మొదలుపెట్టినట్టు చిత్ర ప్రొడక్షన్ హౌస్ ప్రకటించింది. అభిమానులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఈ చిత్రంలో సూర్య ఐదు విభిన్న పాత్రల్లో అలరించబోతున్నారు. 


పాన్ వరల్డ్ చిత్రంగా ఈ మూవీ పది భాషల్లో విడుదల కానుంది. సంక్రాంతి పండుగ సందర్భంగా గత నెల సెకండ్ లుక్ రిలీజ్ చేసారు. "విధి..కాలం కంటే బలమైనది. గతం, వర్తమానం, భవిష్యత్..కాలం ఏదైనా నలుదిక్కులా మార్మొగే పేరు కంగువా" అనే క్యాప్షన్ తో రిలీజ్ అయిన ఈ సెకండ్ లుక్ పోస్టర్ ప్ర్రేక్షకుల అంచనాలను భారీగా పెంచేసింది. పైగా, సూర్య ఈ పోస్టర్లో అటు చారిత్రక పాత్రలోనూ, ఇటు ట్రెండీ లుక్ తోనూ కనిపించటంతో, అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఎప్పుడూ విభిన్నమైన పాత్రలనే ఎంచుకునే సూర్య ఈసారి ఏకంగా ఒకే చిత్రంలో ఐదు విభిన్న పాత్రల్లో కనిపించబోవటంతో అన్ని వర్గాల ప్రేక్షకులూ ఈ చిత్రం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం రూపొందించటంతో మ్యుజికల్ గా కూడా సినిమాపై అంచనాలు పెరిగిపొతున్నాయి.


తమిళ హీరో అయినా తెలుగు రాష్ట్రాల్లోనూ సూర్యకు విపరీతమైన అభిమానులు ఉన్నారు. 'సూర్య సన్నాఫ్ క్రిష్నన్' సినిమా తెలుగు రాష్ట్రాల్లో రీరిలీజ్ అయిన విషయం తెలిసిందే. గజిని, 24.. లాంటి ఎన్నో విభిన్న కథాంశాలతో సూర్య ఎప్పుడో పాన్ ఇండియా స్టార్ గా పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు కంగువ చిత్రం ఇంగ్లిష్ లోనూ రిలీజ్ చేస్తుండటంతో ప్రపంచానికి సౌత్ ఇండియా స్టార్ల ఖ్యాతి మరొక్కసారి తెలియబోతోంది. 


'కంగువ' అంటే అగ్ని శక్తి ఉన్న వ్యక్తి. సాటిలేని పరాక్రమవంతుడు అని అర్థం. 14 వ శతాబ్దం నేపథ్యంలో కంగువా అనే యుద్ధవీరుడి కల్పిత కథను రెండుభాగాలుగా విడుదల చేయబోతున్నారు. టీజర్ లో వేవేల పులిగోళ్ల పదునే వీడు..శతకోటి సర్పాల పొగరే వీడు..చెలరేగు సంద్రాల ముఖమే వీడు..గర్జించు ఢంకాల అదురే వీడు..ఒక్కడే ఒక్కడు వీరుడురా..యుద్ధమై ఉరుకు సూరీడురా... ఓటమే లేని ధీరుడురా... మన అడవితల్లికి ప్రాణమురా..." అనే మాటలతో హీరో పరిచయం, పరాక్రమవీరుడిగా సూర్య లుక్స్ రోమాలు నిక్కబొడుచుకుంటాయి. పైగా, ఈ చిత్రం త్రీడీలో అవబోతుండటం అభిమానులను ఉర్రూతలూగిస్తోంది.






ఇది సూర్య నటిస్తున్న 42 వ చిత్రం కాగా, ఈ చిత్రం తర్వాత సూర్య.. వాసివాసల్ అనే చిత్రంలో చేయనున్నారు. ఆ సినిమా వెట్రిమారన్ దర్శకత్వంలో రాబోతోంది. అలాగే సూర్య .. అక్షయ్ కుమార్ నటిస్తోన్న సూరరై పోట్రు అనే హిందీ రిమేక్ లో అతిథి పాత్రలో నటించబోతున్నారు.