Invitation To KCR: కేసీఆర్ ఎలాగూ రారని ఫిక్సయ్యారేమో కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనను ఇరుకున పెట్టేలా విచిత్రమైన ఆహ్వానాలు పంపుతోంది. తాజాగా కేసీఆర్ ను తెలంగాణ సెక్రటేరియట్ లో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు రావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ద్వారా అధికారికంగా ఆహ్వానించాలని నిర్ణయించారు. మంత్రి పొన్నం కూడా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. అయితే కాంగ్రెస్ తీరుపై రాజకీయవర్గాల్లో ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. ఎందుకంటే నిర్వహిస్తోంది ప్రజాపాలన విజయోత్సవాలు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది అయిన సందర్భంగా నిర్వహిస్తున్న ఉత్సవాలు. దీనికి కేసీఆర్‌ను పిలవడం ఏమిటని.. ఆయనను ఓడించి ఏడాది అయిందని సంబరాలు నిర్వహిస్తూ ఆయనకే ఆహ్వానం పంపుతారా అన్న సందేహాలు పలువురిలో వస్తున్నాయి.
తెలంగాణ తల్లి విగ్రహం రూపురేఖలు సీక్రెట్
ఇప్పుడు ఏర్పాటు చేస్తున్న తెలంగాణ తల్లి విగ్రహం కూడా ఏకగ్రీవంగా ఆమోదించినది కాదు. అసలు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏ రూపంలో సిద్దం చేయించారో కూడా తెలియదు. ఈ అంశంపై బీఆర్ఎస్ విమర్శలు గుప్పిస్తోంది. తెలంగాణ తల్లి విగ్రహం రూపాన్ని ప్రజల ముందు ఉంచి అందరి ఆమోదంతో ఫైనల్ చేయాలి కానీ ఒకరిద్దరి ఆమోదంతో రూపొందించి దాన్ని సెక్రటేరియట్ లో ఆవిష్కరించడం దానికి కేసీఆర్ ను పిలవాలనుకోవడం ఏమిటని బీఆర్ఎస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. బీఆర్ఎస్ ఇంత కాలం సిద్ధం చేసిన.. ప్రాచుర్యంలోకి తెచ్చిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని రేవంత్ పట్టించుకోలేదు.
Also Read: రాజ్యసభలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ సీటు వద్ద నోట్ల కట్టలు- విచారణకు ఛైర్మన్ ఆదేశం
కాంగ్రెస్ ప్రజా పాలన విజయోత్సవాలుక కేేసీఆర్ ఎలా వస్తారు ?
తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టడానికి సెక్రటేరియట్ లో తాము స్థలం ఉంచితే అక్కడ రాజీవ్ విగ్రహాన్ని పెట్టారని.. రాహుల్ గాంధీ తండ్రి విగ్రహానికి.. సెక్రటేరియట్ కు సంబంధం ఏమిటని బీఆర్ఎస్ ప్రశ్నిస్తోంది. తాము వచ్చాక రాజీవ్ విగ్రహాన్ని తీసేసి తెలంగాణ తల్లి విగ్రహం పెడతామంటున్నారు. అంటే ప్రస్తుతం పెడుతున్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని తాము అంగీకరించబోవడం లేదని చెప్పడమే. నిజానికి కేసీఆర్ ను తెలంగాణ ఉత్సవాలకు ఆవిష్కరించాలంటే జూన్ రెండో తేదీన ఘనంగా నిర్వహించిన ఉత్సవాలకు పిలవాల్సి ఉంది. కానీ కేసీఆర్‌కు అధికారికంగా ఎలాంటి ఆహ్వానం పంపలేదని చెబుతున్నారు.
Also Read: ఏఐ టెక్నాలజీతో తెలంగాణలో ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపిక- మొదటి రెండు విడతల్లో వీళ్లకే ప్రాధాన్యత
ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పాలన ఉత్సవాల్లో పాల్గొనాలని.. పిలవడం అంటే ఖచ్చితంగా కేసీఆర్ ను కించ పరచడమేనని భావిస్తున్నారు. ఈ పిలుపు కోసం అయితే మంత్రి పొన్నం ప్రభాకర్ కు ఫామ్ హౌస్ గేట్లు తెరుచుకునే అవకాశం లేదని అంటున్నారు. కేసీఆర్ ను కించ పరిచేలా రేవంత్ మాట్లాడుతున్నారని ఇప్పుడు మంత్రులతోనూ ఇలాంటి ఆహ్వానాలు పంపుతూ టీజ్ చేస్తున్నారని మండిపడుతున్నారు.