ఉస్తాద్ రామ్ పోతినేని (Ram Pothineni) అనగానే అందరికీ ‘ఇస్మార్ట్ శంకర్’, ‘డబుల్ ఇస్మార్ట్’ అంటూ ఊర మాస్ లుక్, డైలాగ్సే గుర్తుకు వస్తుంటాయి. అలా రామ్‌ని డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ మార్చేశాడు. రామ్ అని తలుచుకుంటే చాలు.. అదే అవతారం గుర్తుకు వస్తుంటుంది. కొన్నాళ్లుగా ఇదే లుక్‌లో దర్శనమిచ్చిన రామ్... ఇప్పుడు పూర్తిగా తన మేకోవర్‌ని మార్చేశారు. వింటేజ్ రామ్ (Rapo22)ని తలపిస్తున్నారు. ప్రస్తుతం ఆయన మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో ఓ సినిమా ఓకే చేసిన విషయం తెలిసిందే. రీసెంట్‌గానే ఈ మూవీకి సంబంధించి అధికారిక ప్రకటన రావడం, ఆ వెనువెంటనే సినిమా పూజా కార్యక్రమాలు జరుపుకోవడం చకాచకా జరిగిపోయాయి. తాజాగా ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైనట్లుగా తెలుపుతూ.. చిత్రంలోని రామ్ క్యారెక్టర్ లుక్‌ని మేకర్స్ రివీల్ చేశారు.
ఈ లుక్‌లో నిజంగా రామ్ వింటేజ్ రామ్ మళ్లీ వచ్చేశాడనేలా.. ఫ్యాన్స్‌కి ట్రీట్ ఇచ్చారు. ‘మీకు సుపరిచితుడు... మీలో ఒకడు... మీ సాగర్’ అంటూ రామ్ పాత్రను మేకర్స్ పరిచయం చేశారు. ఈ పోస్టర్‌తో పాటు.. ‘‘నిజంగా అతని గురించి మీకు తెలిస్తే.. అతనిలో మీరు మిమ్మల్ని చూస్తారు. అతను సముద్రమంతటి గొప్ప సినిమా మూమెంట్స్‌ని మీ కోసం తీసుకురాబోతున్నాడు. షూటింగ్ ప్రారంభమైంది’’ అని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఎక్స్‌లో పేర్కొంది. రామ్ 22వ సినిమాగా రూపుదిద్దుకుంటోన్న ఈ మూవీని యువ దర్శకుడు మహేష్ బాబు పి తెరకెక్కిస్తున్నారు. సాగర్ పాత్రలో ఇందులో రామ్ కనిపించనున్నారు.
Also Read: 'అల్లు అర్జున్ కళ్ల ముందే మహిళను చంపేశారు' - సంచలన విషయాలు బయటపెట్టిన ప్రత్యక్ష సాక్షి
ఈ పోస్టర్‌లోని రామ్ లుక్ విషయానికి వస్తే.. ఓల్డ్ డేస్‌లో ఉపయోగించిన సైకిల్ స్టాండ్‌ని వెరైటీగా తీస్తూ ఈ పోస్టర్‌లో రామ్ కనిపించారు. అతని లాంగ్ హెయిర్, క్లీన్ షేవ్, చేతిలో బుక్ వంటివన్నీ చూస్తుంటే ఇందులో అతను కాలేజ్‌లో చదువుకునే యువకుడిగా కనిపిస్తాడనేది అర్థమవుతోంది. అలాగే ఆ నవ్వుతున్న తీరు చూస్తుంటే.. ఒక మంచి సినిమాను మైత్రీ వారు ఇవ్వబోతున్నారనే ఫీలింగ్ కలుగుతోంది. ఓవరాల్‌గా అయితే ఈ ఫస్ట్‌లుక్‌తోనే సినిమాపై మంచి అంచనాలు ఏర్పడేలా చేశారు మైత్రీ నిర్మాతలు నవీన్ ఎర్నేని, రవి శంకర్ యలమంచిలి. మొదటి నుండి కాస్త వెరైటీ పాత్రలను ఎన్నుకుంటున్న రామ్‌కి ఇది మరో వెరైటీ చిత్రం అయ్యే అవకాశాలు లేకపోలేదు.
అలాగే రామ్‌కి ప్రస్తుతం మంచి హిట్ సినిమా కావాలి. ‘డబుల్ ఇస్మార్ట్’పై ఎన్నో ఆశలు పెట్టుకుంటే అది మిక్స్‌డ్ టాక్‌కే పరిమితమైంది. మరి ఈ కుర్ర దర్శకుడు మహేష్ బాబు, రామ్‌కి ఎలాంటి హిట్ ఇవ్వబోతున్నాడో తెలియాలంటే ఇంకొన్ని నెలల పాటు వెయిట్ చేయక తప్పదు. అన్నట్టు ఈ సినిమాలో రామ్ సరసన ఇటీవల రవితేజ ‘మిస్టర్ బచ్చన్’ సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమైన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. మేకర్స్ వదిలిన ఈ లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ లుక్ సూపర్ అంటూ రామ్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన - ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌పై కేసు నమోదు