Pushpa 2 Stampede In Hyderabad Sandhya Theater: పుష్ఫ 2 సినిమా విడుదల సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద జరిగిన విషాదం తెలుగు రాష్ట్రాలను ఉలిక్కిపడేలా చేసింది. తొక్కిసలాటలో ఓ కుటుంబం బలైన పరిస్దితి అందరినీ కలిచివేసింది. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో మొదటి షో చేసేందుకు వందలాదిగా ప్రేక్షకులు, అల్లు అర్జున్ అభిమానులు బుధవారం రాత్రి థియేటర్ వద్దకు చేరుకున్నారు. సంధ్యా థియేటర్ వద్ద విషాదానికి ఎవరు భాద్యులని తెలుసుకునే ప్రయత్నం చేిసింది ఏబీపీ దేశం. ఈ సందర్భంగా ప్రత్యక్ష సాక్షిని కలిసింది. తొక్కిసలాట సమయంలో అక్కడే ఉన్న విజయ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. హీరో అల్లు అర్జున్‌పై ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ ఆరోపిస్తున్నారు. ఆ రాత్రి ఏం జరిగిందనే దానిపై ప్రత్యక్షసాక్షి మాటల్లో..
'నేను రాత్రి 9 గంటలకు సంధ్యా థియేటర్ వద్దకు వచ్చాను. అప్పటికే ఆర్టీసీ క్రాస్ రోడ్డు, సంధ్యా థియేటర్ పరిసర ప్రాంతాలు పూర్తిగా జనాలతో నిండిపోయింది. పోలీసులు చాలా తక్కువ మంది ఉన్నారు. జనం తాకిడి ఎక్కువ ఉంటుందని తెలసినా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. అందులోనూ ఎలాంటి అనుమతి లేకుండా అల్లు అర్జున్ థియేటర్‌కు ఎలా వచ్చారు. అల్లు అర్జున్ రావడంతో రద్దీ మరింతగా పెరిగిపోయింది. జనాలను లాఠీలతో చెదరగొడుతున్నారు. ఒక్కసారిగా అల్లు అర్జున్ థియేటర్ వద్దకు రావడంతో అభిమానులు కంట్రోల్ తప్పారు. వాహనంపైకి దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. అప్పటికే ఏమాత్రం ఖాళీ లేక జనం కిక్కిరిసిపోయి ఉంటే అదే మార్గంలో అల్లు అర్జున్ వాహనాన్ని థియేటర్‌లోకి పంపారు. ఆ సందర్భంగా థియేటర్ వద్ద జనాలను క్రిమినల్స్‌ను కొట్టినట్లు కొట్టారు. దీంతో ఒక్కసారిగా ఒకరిపై ఒకరు పడుతూ తొక్కిసలాట జరిగింది. పోలీసులు ముందే సరైన భాద్రతా ఏర్పాట్లు చేసి ఉంటే ఈ పరిస్దతి వచ్చేది కాదు. ఇంతటి విషాదం జరిగేది కాదు.' అని పేర్కొన్నారు.
'ఫిర్యాదు తీసుకోమన్నారు'
'ఒక్కో టిక్కెట్ ధర రూ.1100 తీసుకుని, కనీసం టిక్కెట్ కూడా చెక్ చేయకుండా జనాలను థియేటర్ లోపలికి అనుమతించడంలో సంధ్యా థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ఘటనకు యాజమాన్యం బాధ్యత వహించాలి. అప్పటికే థియేటర్ వద్ద విపరీతంగా రద్దీ ఉందని తెలిసి కూడా హీరో అల్లు అర్జున్ ఎటువంటి అనుమతి లేకుండా థియేటర్ వద్దకు రావడం అల్లు అర్జున్ చేసిన తప్పిదం. ప్రధాన బాధ్యత పోలీసులకు ఉంటుంది. జనం రద్దీని అంచనా వేయడంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారు. పోలీసుల లాఠీఛార్జ్ చేయగా ఒకరిపై ఒకరు తోసుకుంటూ ఒక్కసారిగా థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగింది. అల్లు అర్జున్ వాహనంలో వెళ్తుండగానే మహిళను జనాలు తొక్కేశారు. బాలుడు సైతం ఊపిరాడక తొక్కిసలాటలో నలిగిపోయాడు. నేను ఈ ఘటనపై ఫిర్యాదు చేసేందుకు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వెళ్తే గంటల తరబడి నిలబెట్టి వెనక్కు పంపేశారు. ఫిర్యాదు తీసుకోము పొమ్మన్నారు.
నా ఫిర్యాదులో పోలీసులు నిర్లక్ష్యంతో పాటు అల్లు అర్జున్ ఎవరి అనుమతితో వచ్చాడు. థియేటర్ యాజమాన్యం ఎందుకు స్పందించలేదు. టిక్కెట్ లేని వారిని కూడా థియేటర్ లోపలికి ఎందుకు అనుమతి ఇచ్చారు. ఇలా పోలీసులు, అల్లు అర్జున్, సంధ్యా థియేటర్ యాజమాన్యంపై ఫిర్యాదు చేసేందుకు వెళ్తే కనీసం నా ఫిర్యాదు తీసుకోవడం లేదు. ఉన్నత స్థాయి విచారణ జరగాలని డిమాండ్ చేస్తుంటే పోలీసుల నుంచి కనీస స్పందన లేదు. బాధితులకు న్యాయం జరిగేవరకూ పోరాటం చేస్తాం. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునేలా ఒత్తిడి తెస్తాం.' అని అన్నారు.