Rewind 2024 In Cricket: మరో క్రికెట్ ఏడాది ముగుస్తోంది. అంతర్జాతీయ క్రికెట్‌కు కొందరు పూర్తిగా వీడ్కోలు పలికారు. మరికొందరు పొట్టి క్రికెట్ కు బై చెప్పేశారు. క్రికెట్ ప్రపంచంలో ప్రకంపనలు సృష్టించిన భారత ఆటగాళ్లు వీడ్కోలు పలకడం అభిమానులను తీవ్ర ఆవేదనకు గురిచేసింది. 2024లో మొత్తం 27 మంది అంతర్జాతీయ క్రికెటర్లు రిటైర్మెంట్ ప్రకటించారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ., రవీంద్ర జడేజా టీ 20 క్రికెట్ నుంచి వైదొలిగారు. 

 

విరాట్ కోహ్లీ 

టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ.. టీ 20 క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. ICC T20 వరల్డ్ కప్ 2024 ఫైనల్‌లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్న తర్వాత.. కోహ్లీ ఈ ప్రకటన చేశాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో కోహ్లి 76 పరుగులతో భారత్ విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. టీ 20 ప్రపంచకప్ సాధించి జగజ్జేతలుగా నిలిచిన అనంతరం కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటన చేశాడు. 

 

రోహిత్ శర్మ 

రోహిత్ శర్మ కూడా   ICC T20 వరల్డ్ కప్ 2024 గెలిచిన అనంతరం టీ 20 కెరీర్ కు వీడ్కోలు పలికాడు. ప్రపంచకప్ ట్రోఫీని గెలుచుకున్న మూడో భారత కెప్టెన్‌గా రోహిత్ నిలిచాడు. రిటైర్మెంట్ సమయానికి రోహిత్ శర్మ T20 మ్యాచుల్లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్ గా నిలిచాడు. 2024 T20 ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా ఉన్నాడు.

 


 

రవీంద్ర జడేజా

ICC T20 ప్రపంచ కప్ 2024 గెలిచిన తర్వాత విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మతో కలిసి రవీంద్ర జడేజా  కూడా పొట్టి ఫార్మాట్ నుంచి రిటైర్ అయ్యాడు. భారత్ విశ్వ విజేతలుగా నిలిచిన ఒక రోజు తర్వాత జడేజా ఈ ప్రకటన చేశాడు. జడేజా వన్డే, టెస్టుల్లో కొనసాగుతున్నాడు. జడేజా 2009 నుంచి 2024 వరకు 74 టీ 20 మ్యాచులు ఆడాడు. ఇందోల 515 పరుగులు చేసి.. 54 వికెట్లు తీసుకున్నాడు.

 

సౌరభ్ తివారీ 

టీమిండియా ప్లేయర్ సౌరభ్ తివారీ కూడా అన్ని ఫార్మాట్ల అంతర్జాతీయ క్రికెట్ కూ వీడ్కోలు పలికాడు. జార్ఖండ్ బ్యాట్స్‌మెన్ సౌరభ్ తివారీ ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రొఫెషనల్ క్రికెట్‌కు రిటైరయ్యాడు, దీంతో 17 ఏళ్ల క్రికెట్ కెరీర్‌కు తెరపడింది. అతను 2006/07లో తన ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేశాడు. 2008లో విరాట్ కోహ్లీ నేతృత్వంలోని అండర్-19 ప్రపంచ కప్ విజేత జట్టులో సౌరభ్ కీలక ఆటగాడు.

 

వరుణ్ ఆరోన్

టీమిండియా ఆటగాడు వరుణ్ ఆరోన్ కూడా అంతర్జాతీయ క్రికెట్ వీడ్కోలు పలికాడు. తాను అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించాడు. ఫాస్ట్ బౌలర్ వరుణ్ ఆరోన్ జార్ఖండ్ తరపున ఆడిన రంజీ ట్రోఫీ సీజన్ ముగింపుతో రిటైర్ మెంట్ ప్రకటన చేశాడు. ఆరోన్ 66 ఫస్ట్-క్లాస్ మ్యాచులు ఆడాడు. 2011, 2015 మధ్య తొమ్మిది టెస్టుల్లో, ఆరోన్ 52 సగటుతో 18 వికెట్లు తీయగలిగాడు.

 

దినేష్ కార్తీక్

భారత వెటరన్ క్రికెటర్ దినేష్ కార్తీక్ కూడా  అన్ని ఫార్మాట్ల అంతర్జాతీయ క్రికెట్ కూ వీడ్కోలు పలికాడు. 39 ఏళ్ల కార్తిక్ T20 ప్రపంచ కప్ 2024 జట్టుకు ఎంపిక కాకపోవడంతో రిటైర్ మెంట్ ప్రకటన చేశాడు. భారత్ తరపున 94 వన్డేలు, 60 T20 మ్యాచులు, 26 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు. 

 

కేదార్ జాదవ్

టీమిండియా ఆటగాడు కేదార్ జాదవ్ కూడా అంతర్జాతీయ క్రికెట్ వీడ్కోలు పలికాడు. 39 ఏళ్ల కేదార్ జాదవ్ ఈ ఏడాది జూన్‌లో అన్ని రకాల ఆటల నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. కేదార్ జాదవ్ 73 వన్డేలు, తొమ్మిది టీ20ల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. అతని పేరుపై రెండు వన్డే సెంచరీలు ఉన్నాయి. ఆరు అర్ధసెంచరీలు కొట్టాడు.