CM Revanthreddy Review on Health Department: తెలంగాణలో వైద్య కళాశాల ఉన్న ప్రతీచోట నర్సింగ్, పారా మెడికల్ కాలేజీలు ఉండాలని.. ఇందు కోసం కామన్ పాలసీని తీసుకురావాలని సీఎం రేవంత్ రెడ్డి (CM RevanthReddy) అధికారులను ఆదేశించారు. సచివాలయంలో వైద్య ఆరోగ్య శాఖపై సోమవారం ఆయన సమీక్షించారు. ఈ సమావేశంలో వైద్య ఆరోగ్య మంత్రి దామోదర రాజనర్సింహ (Damodar Rajanarasimha), సీఎస్ శాంతికుమారి,  ప్రిన్సిపాల్ సెక్రటరీ శేషాద్రి, ఆరోగ్య శాఖకు సంబంధించిన ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. బీబీనగర్ (BB Nagar AIIMS) ఎయిమ్స్ లో వైద్య సేవలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు. దీని ద్వారా ఉస్మానియా, నిమ్స్ ఆస్పత్రులపైనా భారం తగ్గుతుందని అభిప్రాయపడ్డారు. అలాగే, ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల ప్రజలకు చాలా ప్రయోజనకరంగా ఉంటుందని అన్నారు. ఎయిమ్స్ ను సందర్శించి నివేదిక సమర్పించాలని సూచించారు. వైద్య సేవల కోసం అవసరమైతే తానే స్వయంగా కేంద్రమంత్రిని కలిసి వివరిస్తానని అన్నారు. కొడంగల్ లో మెడికల్, నర్సింగ్ కాలేజీల ఏర్పాటును పరిశీలించాలని నిర్దేశించారు. ఈ సందర్భంగా ఉస్మానియా విస్తరణలో సమస్యలను అధికారులు సీఎంకు వివరించారు. ఆస్పత్రి హెరిటేజ్ భవనంపై మంగళవారం హైకోర్టులో విచారణ ఉందని అధికారులు సీఎం దృష్టికి తీసుకురాగా.. ఉన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు నడుచుకుందామని స్పష్టం చేశారు.


ప్రతి ఒక్కరికీ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్


రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని.. డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డును ఒక యూనిక్ నెంబరుతో అనుసంధానించాలని సూచించారు. దీంతో అత్యవసర పరిస్థితుల్లో సరైన వైద్యం అందించే వీలుంటుందని అన్నారు. ఈ హెల్త్ ప్రొఫైల్ కార్డుతో ఆరోగ్యశ్రీని అనుసంధానం చేయాలని పేర్కొన్నారు. అలాగే, ఆరోగ్యశ్రీకి తెల్లరేషన్ కార్డు తప్పనిసరి అనే నిబంధన సడలించే అంశాన్ని కూడా పరిశీలించాలని అధికారులకు నిర్దేశించారు. వరంగల్, ఎల్బీ నగర్, సనత్ నగర్, అల్వాల్ లో టిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణాలు వేగవంతంగా పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. వైద్యుల కొరత లేకుండా మెడికల్ కాలేజీలను ఆసుపత్రులకు అనుసంధానంగా ఉండేలా చూడాలని అన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలు వైద్యం కోసం కేవలం హైదరాబాద్ పైనే ఆధారపడకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలన్నారు. ఏరియాల వారీగా ఎక్కడికక్కడ వైద్య సదుపాయాలు కల్పించి ప్రజలకు మెరుగైన వైద్యం అందించేలా చూడాలన్నారు.  సంబంధిత మెడికల్ కాలేజీల్లో ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. 


'3 నెలలకోసారి ఆరోగ్యశ్రీ బిల్లులు'


మెడికల్ కాలేజీలతో అనుసంధానంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో హౌస్ కీపింగ్ మెయింటెనెన్స్ నిర్వహణ బాధ్యతను పెద్ద ఫార్మా కంపెనీలకు అప్పగించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. ఉస్మానియా, గాంధీ ఆసుపత్రుల్లో ఏదో ఒక ఆసుపత్రిలో దీన్ని పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించాలని సూచించారు. అలాగే, రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ అమలు తీరుపైనా అధికారులతో చర్చించారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలతో అనుసంధానంగా ఉన్న టీచింగ్ హాస్పిటల్స్, ప్రభుత్వ ఆస్పత్రులకు పెండింగ్ లో ఉన్న రూ.270 కోట్ల ఆరోగ్య శ్రీ బిల్లులు వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు. అటు, ప్రైవేటు ఆసుపత్రుల ఆరోగ్యశ్రీ బిల్లులను ప్రతీ మూడు నెలలకోసారి విడుదల చేసేలా ఒప్పందం కుదుర్చుకోవాలని నిర్దేశించారు. అలాగే, జూనియర్ డాక్టర్స్, ఆశా వర్కర్స్, స్టాఫ్ నర్సుల జీతాలు ప్రతి నెలా క్రమం తప్పకుండా అందించేలా చూడాలన్నారు. 108, 102 సేవల పనితీరుపైనా ఆరా తీశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన సేవలందేలా చూడాలని అధికారులకు స్పష్టం చేశారు.


Also Read: KTR: మూడు ఫీట్లు లేనోడు మనల్ని 100 మీటర్ల లోతు బొంద పెడతాడా? - కేటీఆర్ వ్యాఖ్యలు