KCR Health: బీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ మాజీ సీఎం కల్వకుంట్ల కేసీఆర్‌ (Ex CM KCR) ఆరోగ్య పరిస్థితిపై సీఎం రేవంత్‌రెడ్డి ఆరా తీస్తున్నారు. కేసీఆర్‌కు అందిస్తున్న వైద్యం గురించి హైదరాబాద్‌ సోమాజిగూడ యశోదా ఆస్పత్రి వైద్యులతో మాట్లాడారు. కేసీఆర్‌కు మేరుగైన వైద్యం అందేలా చూడాలని ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వికి బాధ్యతలు అప్పగించారు సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy). కేసీఆర్‌ ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. అత్యవసరమైతే కేసీఆర్‌ను మరో ఆస్పత్రికి తరలించేందుకు గ్రీన్‌ ఛాలెజ్‌ ఏర్పాటు చేయాలను అందుబాటులో ఉంచాలని తెలుస్తోంది.


కేసీఆర్‌ త్వరలో కోలుకోవాలి: మోడీ ట్వీట్‌
కేసీఆర్‌ ఆరోగ్యంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ (PM MODI) కూడా స్పందించారు. కేసీఆర్‌కు గాయమైన విషయం తెలియగానే చాలా బాధకలిగిందని ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. కేసీఆర్‌ మంచి  ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నానని చెప్పారు. కేసీఆర్‌ త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్టు ట్వీట్‌ చేశారు ప్రధాని మోడీ. 


నిన్న రాత్రి ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌లో పంచె తగిలి కాలుజారి పడ్డారు కేసీఆర్‌. దీంతో కేసీఆర్‌కు తీవ్ర గాయమైంది. దీంతో నిన్న(గురువారం) అర్ధరాత్రి సోమాజిగూడ యశోద ఆస్పత్రి (యశోద ఆసుపత్రి)లో కేసీఆర్‌ను చేర్పించి చికిత్స అందిస్తున్నారు. సీటీ స్కాన్‌ (CT scan) లో కేసీఆర్‌ ఎడమ తుంటి ఎముక విరిగినట్లు వైద్యులు గుర్తించారు. ఆయనకు ఆపరేషన్‌ చేయాలని  తెలిపారు. ఎడమ తుంటి మార్పిడి చేయాలని వైద్యులు తెలిపారు. కేసీఆర్‌ ఆరోగ్యానికి సంబంధించి హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేశారు. ప్రస్తుతం సోమాజిగూడలోని యశోద  ఆస్పత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు కేసీఆర్‌. సాయంత్రం 4గంటల తర్వాత కేసీఆర్‌కు మేజర్‌ ఆపరేషన్‌ (Operation for KCR) జరగనుంది. ఈ ఆపరేషన్‌ తర్వాత... ఆరు నుంచి ఏడు నెలల పాటు కేసీఆర్‌కు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుందని వైద్యులు చెప్తున్నారు.


కేసీఆర్ బాత్రూంలో పడిపోవడంతో తుంటి మార్పిడి ఆపరేషన్‌ చేయించుకోవాల్సి వచ్చింది ఆయన కుమారుడు, మాజీ మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. కేసీఆర్‌ త్వరగా కోలుకోవాలని సందేశాలు పంపుతున్న వారందరికీ ధన్యవాదాలు తెలిపారాయన. కేసీఆర్‌ గాయంపై.. ఆయన కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కూడా ట్వీట్‌ చేశారు. దురదృష్టవశాత్తు జరిగిన ప్రమాదం కారణంగా కేసీఆర్‌కి పెద్ద ఆపరేషన్‌ జరగబోతోందని చెప్పారు. కేసీఆర్‌ ఆరోగ్యం కోసం ప్రార్థిస్తున్న వారందిరికీ ధన్యవాదాలు తెలిపారు. తమ నాయకుడు కేసీఆర్ త్వరగా కోలుకోవాలని బీఆర్ఎస్‌ కుటుంబం,, శ్రేయోభిలాషులు ప్రార్థిస్తున్నారని చెప్పారు. ప్రస్తుతం కేసీఆర్‌ కుంటుంబసభ్యుల యశోద ఆస్పత్రిలోనే ఉన్నారు. మాజీ మంత్రి హరీష్‌రావు కూడా కేసీఆర్‌ వెంటనే ఉన్నారు. మాజీ మంత్రులు కూడా సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి చేరుకుంటున్నారు.


కేసీఆర్‌ గాయపడ్డారన్న వార్త తెలియడంతో... బీఆర్‌ఎస్‌ నేతలు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో సోమజిగూడ యశోద ఆస్పత్రి దగ్గరకు చేరుకుంటున్నారు. దీంతో యశోదా ఆస్పత్రి దగ్గర పోలీసు బందోబస్తు కూడా పెంచారు. సాయంత్రం కేసీఆర్‌కు ఆపరేషన్‌ చేయనున్నారు యశోదా ఆస్పత్రి వైద్యులు. ఆపరేషన్‌కు సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయి. సీఎం కార్యాలయం కూడా మాజీ సీఎం కేసీఆర్‌ వైద్యంపై ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది.