CM Revanth Comments In Passing Out Parade: రాష్ట్రంలో నిరుద్యోగులు ఆందోళనలు, నిరసనలు చేయాల్సిన అవసరం లేదని.. అన్నగా వారి కోసం తాను అండగా ఉంటానని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) స్పష్టం చేశారు. రంగారెడ్డి (Rangareddy) జిల్లాలోని వట్టినాగులపల్లిలో నిర్వహించిన అగ్నిమాపక శాఖ పాసింగ్ అవుట్ పరేడ్‌లో ఆయన శుక్రవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా 483 ఫైర్ మెన్స్, 155 డ్రైవర్ ఆపరేటర్స్‌కు నియామక పత్రాలు అందజేశారు. శిక్షణలో ప్రతిభ కనబరిచిన వారికి అవార్డులు అందించారు. 'ఫైర్‌మెన్ శిక్షణ పూర్తి చేసుకున్న యువకులకు శుభాకాంక్షలు. సమాజాన్ని కాపాడాలన్న ఉద్దేశంతో ముందుకు వచ్చిన మీ అందరినీ అభినందిస్తున్నా. ప్రజల ఆలోచనలకు అనుగుణంగా ప్రభుత్వం ముందుకెళ్తుంది. అందులో భాగంగానే విద్య, వ్యవసాయానికి బడ్జెట్‌లో ఎక్కువ నిధులు కేటాయించాం.' అని తెలిపారు.
'ఒకటో తేదీనే జీతాలు'
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెలా ఒకటో తేదీనే జీతాలు ఇస్తున్నట్లు సీఎం రేవంత్ చెప్పారు. నిరుద్యోగ సమస్యే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు అత్యంత కీలకంగా మారిందని అన్నారు. 'గత పదేళ్లు నిరుద్యోగులు ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం ఎదురుచూశారు. కాంగ్రెస్ హయాంలో 90 రోజుల్లోనే 31 వేల నియామక పత్రాలు అందించాం. విద్య, వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నాం. పేదలకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యం. వాస్తవాలకు అనుగుణంగానే బడ్జెట్ ప్రవేశపెట్టాం. అగ్నిమాపక శాఖలో ఉద్యోగం అంటే జీతభత్యాల కోసం చేసేది కాదు. ఓ సామాజిక బాధ్యతతో విపత్తుల సమయంలో ప్రజలను రక్షించేలా విధులు నిర్వహిస్తారు. నిరుద్యోగులు ఆందోళనలు చేయాల్సిన అవసరం లేదు. మంత్రులు, ఉన్నతాధికారులను కలవండి. మీకు అన్నగా అండగా ఉంటా. గ్రామాల్లో కొందరు యువకులు పేరెంట్స్‌ను సరిగ్గా చూడడం లేదని నా దృష్టికి వచ్చింది. దయచేసి మీకు రెక్కలు వచ్చాక కుటుంబాన్ని విడిచి వెళ్లొద్దని కోరుతున్నా.' అని సీఎం పేర్కొన్నారు.