తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ రెండు రోజుల పాటు మహారాష్ట్ర పర్యటనకు వెళ్లనున్నారు. ఈ నెల 26, 27 తేదీల (రేపటి నుంచి) నుంచి ఆయన మహారాష్ట్ర పర్యటన ఉండనుంది. మహారాష్ట్రలోని పండరీపూర్‌, తుల్జాపూర్‌లో ఆలయాల్లో కేసీఆర్ ప్రత్యేక పూజలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత సోలాపూర్‌లో బీఆర్ఎస్ పార్టీ నిర్వహించనున్న సభలో పాల్గొంటారు. 


షెడ్యూల్ ఇది


జూన్ 26న (సోమవారం) ఉదయం 10 గంటలకు హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గం ద్వారానే సుదీర్ఘ దూరం సీఎం కేసీఆర్ మహారాష్ట్రకు వెళ్లనున్నారు. అలా సాయంత్రానికి హైదరాబాద్ కు సుమారు 500 కిలో మీటర్లకు పైగా దూరం ఉన్న సోలాపూర్‌ కు చేరుకుంటారు. రాత్రికి బస అక్కడే చేయనున్నారు. సోలాపూర్‌కు చెందిన స్థానికంగా పేరొందిన లీడర్ భగీరథ్‌ బాల్కే అనే వ్యక్తి కేసీఆర్‌ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరనున్నారు. సోలాపూర్‌లోని కొంత మంది మహారాష్ట్ర నేతలు, తెలంగాణ నుంచి వెళ్లిన చేనేత కార్మికుల ఫ్యామిలీ కేసీఆర్‌ను కలిసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. 


తర్వాతి రోజు జూన్ 26 (మంగళవారం) ఉదయం సోలాపూర్‌లోని పండరీపూర్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి విఠోభారుక్మిణి మందిరంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు. తర్వాత దారాశివ్‌ జిల్లాలోని శక్తి పీఠం తుల్జాభవానీ అమ్మవారిని దర్శించుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో మళ్లీ హైదరాబాద్ తిరుగుప్రయాణం కానున్నారు. ఈ పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ వెంట పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సహా ప్రజా ప్రతినిధులు కూడా భారీ కాన్వాయ్‌గా తరలి వెళ్లనున్నారు.