CM KCR News: తెలంగాణ సీఎం కేసీఆర్ పై అభిమానంతో ఓ వీరాభిమాని తన చేతిపై కేసీఆర్ చిత్రాన్ని తన చేతిపై పచ్చబొట్టుగా వేయించుకొని తన అభిమానాన్ని చాటుకున్నాడు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం మీర్జాపూర్ గ్రామానికి చెందిన గూళ్ళ యాదగిరి హైదరాబాదులో సెంట్రింగ్ పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఈయనకు ముఖ్యమంత్రి  కేసీఆర్ అంటే అమితమైన గౌరవం. సీఎం కేసీఆర్ పై వీరాభిమానంతో తొమ్మిది వేల రూపాయలు ఖర్చు చేసి రెండు గంటలకు పైగా నొప్పిని భరించి మరీ కేసిఆర్ చిత్రపటాన్ని పచ్చబొట్టుగా ముద్రించుకున్నాడు. పచ్చబొట్టు కొట్టించుకున్న తర్వాత పచ్చబొట్టు స్టిక్కర్ ను హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ చేతుల మీదుగా విప్పించాడు. సీఎం కేసీఆర్ పై యాదగిరి చూపిస్తున్న వీరాభిమానానికి హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ ముగ్ధుడయ్యాడు. పచ్చబొట్టు స్టిక్కర్ ను విప్పిన ఎమ్మెల్యే సతీష్ కుమార్ యాదగిరిని అభినందించాడు.




కేసీఆర్ కు 2021లో గుడికట్టిన మరో అభిమాని


తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్‌ను దేవుడిలా పూజించేవారికి కొదవలేదు. స్వరాష్ట్ర కలను సాకారం చేసిన ధీరుడిగా కేసీఆర్‌కు గుర్తింపు ఉంది. కొంత మంది ఇళ్లలో ఫోటోలు పెట్టుకుంటారు.. అయితే ఆయనను దేవుడిలా చూసిన గుండ రవీందర్ అనే తెలంగాణ వీరాభిమాని మాత్రం ఏకంగా గుడినే కట్టించాడు. రోజూ పూజలు చేశాడు. కానీ ఇప్పుడు ఆ గుడినే అమ్మకానికి పెట్టాడు. ఎవరూ కొనకపోతే కూల్చేస్తానంటున్నాడు. మంచిర్యాల జిల్లా దండేపల్లికి చెందిన గుండ రవీందర్ తెలంగాణ ఉద్యమకారుడు. తెలంగాణ రాష్ట్రం సాధించాలన్న లక్ష్యంతో 2010లో టీఆర్ఎస్‌లో చేరారు. అప్పట్నుంచి కేసీఆర్ పిలుపునిచ్చిన కార్యక్రమాలన్నింటిలోనూ పాల్గొనేవారు. ఉద్యమంలో  జోరుగా పాల్గొన్నారు. స్వరాష్ట్రం సిద్ధించిన తర్వాత ఆయన కేసీఆర్‌పై అభిమానంతో ఇంటి ముందే గుడి కట్టేశారు.  రూ.3లక్షలు పెట్టి ఆలయం నిర్మించి అందులో కేసీఆర్, జయశంకర్ సార్, తెలంగాణ తల్లి విగ్రహాలను పెట్టారు. రోజూ పూజలు చేసేవారు. ఆయన అభిమానం మీడియాలోనూ హైలెట్ అయింది.


అయితే ఇప్పుడు గుండా రవీందర్ తాను గుడిని అమ్మకానికి పెట్టానని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. తాను అప్పుల పాలయ్యానని కుటుంబాన్ని పోషించుకోలేకపోతున్నందున గుడిని కొనుక్కునేవాళ్లు రావొచ్చంటున్నారు. గుండా రవీందర్ తాను కేసీఆర్‌పై చూపిన అభిమానానికి ప్రతిఫలం ఆశించారు. తన భక్తిని మెచ్చి దేవుడిగా భావిస్తున్న కేసీఆర్ ఏదో ఓ పదవి ఇవ్వకపోతారా అని ఆశ పడ్డారు. కానీ ఆయన ఆశలు అడియాశలయ్యాయి. ఎలాంటి పదవి దక్కలేదు. అదే సమయంలో ఆయన కేబుల్ ఆపరేటర్‌గా ఉండేవారు. ఆ వ్యాపారం కూడా స్థానిక టీఆర్ఎస్ నేతలు చేజిక్కించుకున్నారు. దాంతో ఆయనకు ఉన్న ఉపాధి కూడా కోల్పోయినట్లయింది. తన గురించి కేటీఆర్, కేసీఆర్‌కు చెప్పుకుందామని చాలా సార్లు హైదరాబాద్ వచ్చారు కానీ ప్రగతి భవన్‌లోకి ఎంట్రీ దొరకలేదు. ఆ తర్వార గుడి ముందు ధర్నాచేయడం.. టవర్ ఎక్కడం వంటి రకరకాల నిరసనలతో  కేసీఆర్, కేటీఆర్ దృష్టిలో పడే ప్రయత్నం చేశారు కానీ ఫలితం రాలేదు. చివరికి గుడిలో విగ్రహాలకు ముసుగులు వేసి పూజలు ఆపేసి.. బీజేపీలో చేరిపోయారు.  అందుకే గతంలో తాను దేవుడిగా కొలిచి కేసీఆర్‌కు నిర్మించిన ఆలయాన్ని అమ్మాలని ఎవరూ కొనకపోతే కూల్చేయాలని నిర్ణయించుకున్నారు. గుండ రవీందర్ కేసీఆర్ టెంపుల్ ఫర్ సేల్ పోస్ట్ వైరల్ అవుతోంది. అయితే ఆయన పోస్టు కింద అనేక మంది టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, ఉద్యమకారులు కూడా తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యమంమలో తాము ఎంత ఖర్చు పెట్టుకున్నామో.. ఎలా కష్టపడ్డామో చెబుతూ.. తమకూ గుర్తింపు రాలేదని కామెంట్ల రూపంలో పెడుతున్నారు.