CM KCR Diksha Divas: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం ఉద్ధృతంగా సాగుతున్న రోజులవి. సబ్బండ వర్ణాలు తమకు ప్రత్యేక రాష్ట్రం కావాలంటూ ధర్నాలు, నిరసనలతో హోరెత్తిస్తున్నారు. ఇక హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా విద్యార్థి సంఘాలు సైతం పలు రకాల కార్యక్రమాలతో ఉద్యమ వేడిని కొనసాగిస్తున్న సమయం అది. తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత చంద్రశేఖర రావు ఇక తన అమ్ముల పొదిలోని ఫైనల్ బాణాన్ని వదిలారు. "తెలంగాణ వచ్చుడో... కెసిఆర్ సచ్చుడో" అనే నినాదంతో ఏకంగా అమరణ దీక్షకు సిద్ధమయ్యారు. 2009 నవంబర్ 29న కరీంనగర్ లోని తీగల గుట్టపల్లి నుంచి సిద్దిపేటలోని దీక్షాస్థలికి బయలు దేరారు. అప్పటికే వేలాది సంఖ్యలో కార్యకర్తలు.. నాయకులు, ఉద్యమకారులు కేసీఆర్ వెంట నడవడానికి సిద్ధమయ్యారు.




ఆమరణ దీక్షకు దిగడానికి నిర్ణయించుకొని అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. అయితే అప్పటి ప్రభుత్వం కేసీఆర్ దీక్షను ఎలాగైనా అడ్డుకోవాలని నిర్ణయించుకుంది. దీంతో భారీ ఎత్తున పోలీసు బలగాలతోపాటు ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేసి కేసీఆర్‌ను అరెస్టు చేయడానికి సిద్ధమైంది. సిద్దిపేటకు వెళ్తున్న కేసీఆర్‌ను కరీంనగర్ పట్టణానికి శివారులో ఉన్న అలుగునూర్ వద్ద అడ్డుకుంది. దీంతో మానేరు బ్రిడ్జి ప్రాంతమంతా జై తెలంగాణ నినాదాలతో హోరెత్తింది. అత్యంత కఠినమైన పరిస్థితిల మధ్య కేసీఆర్ ను అరెస్టు చేసిన పోలీసు బలగాలు ముందుగా ఖమ్మంలోని జైలుకు తరలించారు. దీంతో తన మొండిపట్టు వీడని కేసీఆర్ జైలులోని 11 రోజులపాటు దీక్ష నిర్వహించారు.




ఆ తర్వాత హోరెత్తిన ఉద్యమం..


డిసెంబర్ 1వ తేదీన తాను లేకున్నా ఉద్యమం నడవాలని కేసీఆర్ ప్రకటించారు. డిసెంబర్ 2వ తేదీన పార్లమెంట్ లో బీజేపీ అగ్రనేత అద్వానీ ఈ దీక్షను ప్రస్తావించారు. ఆరోగ్యం క్షీణించడంతో డిసెంబర్ 3న తేదీన కేసీఆర్ హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. 4వ తేదీన తెలంగాణ వస్తే జైత్ర యాత్ర లేకుంటే నా శవయాత్ర అని కేసీఆర్ ప్రకటించారు. 5న వెంకటస్వామి, చిరంజీవి, చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ ఎంపీలు కలిసి దీక్ష విరమించాలని కోరినా కేసీఆర్ ఒప్పుకోలేదు. 6 న అసెంబ్లీలో 14ఎఫ్ ను రద్దు చేస్తూ తీర్మానం చేశారు. కేసీఆర్ ఆరోగ్యం క్షీణీస్తోందన్న సమాచారంతో తెలంగాణలోని చాలాచోట్ల నిరసనలు వెల్లువెత్తాయి. బంద్ లు జరిగాయి. ఎక్కడ చూసినా జై తెలంగాణ అనే నినాదమే వినిపించింది. వరుస బంద్ లతో బస్సులు రైళ్లు నిలిచిపోయాయి.


డిసెంబర్ 7వ తేదీన అప్పటి ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశంలో అన్ని పార్టీలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మద్దతు ప్రకటించాయి. డిసెంబర్ 8న తెలంగాణ దిశగా సోనియా గాంధీ నిర్ణయం తీసుకున్నారు. దాంతో డిసెంబర్ 9న కాంగ్రెస్ కోర్ కమిటీ 5 సార్లు సమావేశం అయింది. తెలంగాణ రాష్ట్రం ఇస్తున్నట్లుగా ప్రకటన చేయాలన్న సోనియా సూచన మేరకు కేంద్ర హోం మంత్రి హోదాలో చిదంబరం తెలంగాణ రాష్ట్ర ప్రక్రియ ప్రారంభించామని ప్రకటన చేశారు. 11 రోజుల సుదీర్ఘ దీక్షతో తెలంగాణను ఏకం చేసిన కేసీఆర్ తెలంగాణ ఏర్పాటు ప్రకటన తర్వాత తన ఆమరణ దీక్షను విరమించాడు. తెలంగాణ ఉద్యమ పరిస్థితులను మరో లెవెల్ కి తీసుకెళ్లిన ఈ రోజును దీక్షా దివస్ గా టీఆర్ఎస్ శ్రేణులు పిలుచుకుంటున్నాయి.