ముఖ్యమంత్రి కేసీఆర్ మహారాష్ట్ర పర్యటనలో భాగంగా ప్రముఖ కవి అన్నాభావు సాఠే 103వ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అన్నాభావు సాఠే మహారాష్ట్ర యుగకవి అని, దళిత సాహిత్య చరిత్రలో ఆద్యుడిగా పేరుగాంచారని అన్నారు. అన్నాభావు సాఠే భరతమాత ముద్దు బిడ్డ అని కేసీఆర్ కొనియాడారు. అన్నాభావు సాఠేకు భారతరత్న ఇవ్వాలని, ఈ ప్రతిపాదనకి తెలంగాణ ప్రభుత్వం కూడా మద్దతు ఇస్తుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అన్నాభావు సాఠే గొప్పతనాన్ని గుర్తించాలని ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేస్తున్నానని సీఎం పేర్కొన్నారు. మహారాష్ట్రలోని వాటేగావ్‌లో అన్నాభావు సాఠే 103వ జయంతి వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా సాఠే చిత్రపటానికి కేసీఆర్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం బహిరంగ సభపై మాట్లాడారు.
రష్యా లాంటి పెద్ద దేశమే అన్నాభావు సాఠేని గుర్తించిందని కేసీఆర్ గుర్తించారు. అలాంటి అన్నాభావు సాఠేని మన దేశంలో సరిగ్గా గుర్తించలేదని అన్నారు. రష్యాలోని మెయిన్ లైబ్రరీలో అన్నాభావు సాఠే విగ్రహాన్ని ప్రతిష్ఠించారని కేసీఆర్ చెప్పారు. ఆయన రచనలు ప్రతి ఒక్కరూ ఆచరించదగినవని అన్నారు. అన్నాభావు రచనలు అన్ని భాషల్లోకి అనువదించాలని కేసీఆర్ కోరారు.
ఇంకా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ.. ‘‘అణగారిన వర్గాల కోసం అన్నాభావు సాఠే గొంతెత్తి పోరాడారు. పీడిత ప్రజల తరఫున అన్నాభావ్ బాసటగా నిలిచారు. సమస్యలను చూసి అన్నాభావ్ ఎప్పుడూ వెనక అడుగు వేయలేదు. రష్యా ప్రభుత్వం కూడా అన్నాభావును పిలిపించి ఘనంగా సత్కరించింది. అన్నాభావ్ సాఠేను లోక్‌షాహెర్ బిరుదు కూడా లభించింది.
రష్యా ప్రభుత్వం అన్నాభావ్‌ను భారత మ్యాక్సిమ్ గోర్కి అని ప్రశంసించింది. రష్యా కమ్యూనిస్ట్ నేత మ్యాక్సిమ్ గోర్కి నవల ‘మా’ (తెలుగులో ‘అమ్మ’) ప్రపంచ ప్రసిద్ధి చెందింది. ‘మా’ అనే నవల వివిధ భాషల్లో అనువాదం జరిగి ప్రతి దేశంలోనూ అందుబాటులో ఉంది. అన్నాభావ్ రచనలు మరాఠీలో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అన్నాభావు సాఠే రచనల పట్ల ఇప్పటికైనా మహారాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. ఆయన రచనలను, పద్యాలను వేరే భాషల్లోకి అనువదించాలి. అన్నాభావు సాఠే రచనలు ఏ ఒక్క వర్గానికి పరిమితం కాకూడదు. ఆయన రచనలు అందర్నీ చేరాలి. అన్నాభావ్ రచనలతో ప్రపంచానికి విజ్ఞానం దొరుకుతుంది.
అంతేకాక, మాతంగ్ సామాజిక వర్గానికి మహారాష్ట్ర రాజకీయాల్లో సరైన స్థానం దక్కలేదు. మాతంగ్ సామాజిక వర్గానికి బీఆర్ఎస్ తరపున సముచిత స్థానం కల్పిస్తాం’’ అని కేసీఆర్ వేదికపై మాట్లాడారు.