Apple CEO Credit Card: మన దేశంలో కోట్ల మంది దగ్గర క్రెడిట్‌ కార్డులు ఉన్నాయి. నెలకు వేల రూపాయలు సంపాదించే వాళ్ల దగ్గర్నుంచి కోట్లు వెనకేసునే వాళ్ల వరకు, క్రెడిట్‌ కార్డులు పర్సులో పెట్టుకుని తిరుగుతున్నారు. నెలకు స్థిరమైన ఆదాయం సంపాదించే ప్రతి వ్యక్తి చాలా ఈజీగా క్రెడిట్‌ కార్డ్‌ పొందుతున్నారు. చేస్తున్న ఉద్యోగం & వస్తున్న జీతం బాగుంటే, ఏ బ్యాంకు కూడా క్రెడిట్ కార్డ్ ఇవ్వడానికి నిరాకరించట్లేదు. 


అయితే, నెలకు దాదాపు 68 కోట్ల రూపాయల ఆదాయం సంపాదిస్తున్న ఆపిల్‌ సీఈవో టిమ్‌ కుక్‌కు (Apple CEO Tim Cook) మాత్రం చేదు అనుభవం ఎదురైంది. ఆయన గ్లోబల్‌గా బెస్ట్‌ పొజిషన్‌లో ఉన్నా, అత్యంత భారీ ఆదాయం సంపాదిస్తున్నా, క్రెడిట్‌ కార్డ్‌ ఇవ్వడానికి ఓ బ్యాంక్‌ "నో" చెప్పింది. అందులోనూ, సొంత కంపెనీ కార్డ్‌ కోసం పెట్టుకున్న అప్లికేషన్‌ను రిజెక్ట్‌ చేసింది.
 
ప్రపంచంలోని అతి పెద్ద లిస్టెడ్ కంపెనీ ఆపిల్‌. ఫైనాన్షియల్ సర్వీస్ ప్రొవైడర్ 'గోల్డ్‌మన్ సాచ్స్‌' (goldman sachs), ఆపిల్‌తో కలిసి ఒక కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్‌ లాంచ్‌ చేసింది. ఆ క్రెడిట్‌ కార్డ్‌కు ఇంటర్నేషనల్‌ లెవల్లో బజ్‌ వచ్చింది, కోట్ల మంది దాని కోసం అప్లై చేసుకున్నారు. 'ది ఇన్ఫర్మేషన్‌'లో ప్రింట్‌ అయిన మ్యాటర్‌ ప్రకారం, ఆపిల్ సీఈవో టిమ్ కుక్ కూడా ఆపిల్‌ క్రెడిట్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే, ఆయన అప్లికేషన్‌ రిజెక్ట్‌ అయింది.


కేసు వయసు కేవలం 4 సంవత్సరాలు మాత్రమే
ఈ సంఘటన ఎప్పటిదో మాత్రం కాదు, నాలుగేళ్ల క్రితం 2019 ఆగస్టులో జరిగింది. ఆ సమయంలో కూడా టిమ్ కుక్ ఆపిల్ కంపెనీ CEOగానే ఉన్నారు, బిలియన్‌ డాలర్ల కొద్దీ సంపాదిస్తున్నారు. 2019లో ఆపిల్‌, గోల్డ్‌మన్‌ సాచ్స్‌ కలిసి ఆపిల్‌ క్రెడిట్‌ కార్డ్‌ తీసుకొచ్చి, దానిని టెస్ట్‌ చేస్తున్నాయి. ఆ సమయంలో, ఆపిల్‌ కంపెనీలోని అందరు ఉద్యోగుల్లాగే టిమ్ కుక్ కూడా అప్లై చేస్తే, దానిని బుట్టదాఖలు చేశారు. 


ఈ కారణంగా దరఖాస్తు తిరస్కరణ
టిక్ కుక్ క్రెడిట్ కార్డు అప్లికేషన్‌ను ఎందుకు రిజెక్ట్‌ చేశారు అన్న విషయాన్ని కూడా 'ది ఇన్ఫర్మేషన్‌' రిపోర్ట్‌ చేసింది. ఆపిల్‌ క్రెడిట్‌ కార్డ్‌ ఇష్యూ చేసే గోల్డ్‌మన్ సాచ్స్‌ టీమ్‌ మెంబర్లు, టిమ్‌ కుక్‌ అప్లికేషన్‌ను ఫేక్‌ అనుకున్నారట. టిమ్ కుక్ పేరు, గుర్తింపును ఉపయోగించి ఇంకెవరో క్రెడిట్ కార్డ్ పొందడానికి ప్రయత్నిస్తున్నారని అనుమానించారట. అందుకే ఆ దరఖాస్తును తిరస్కరించారు. తన అప్లికేషన్‌ రిజెక్ట్‌ అయ్యేసరికి టిమ్‌ కుక్‌ కూడా షాక్‌ తిన్నారు. ఆ తర్వాత, గోల్డ్‌మన్ సాచ్స్‌కు ఆపిల్‌ కంపెనీ నుంచి ఇన్ఫర్మేషన్‌ వెళ్లింది. జరిగిన పొరపాటు అర్ధం చేసుకున్న గోల్డ్‌మన్ సాచ్స్‌ టాప్ మేనేజ్‌మెంట్‌, ఆపిల్‌ సీఈవోకి సారీ చెప్పి, ఆపిల్ క్రెడిట్‌ కార్డును పువ్వుల్లో పెట్టి అందించారు.


టిమ్ కుక్ ఆస్తుల విలువ
టిమ్ కుక్ ప్రస్తుత నికర విలువ దాదాపు 2 బిలియన్‌ డాలర్లు. 2022 సంవత్సరంలో, ఆపిల్ నుంచి 99.4 మిలియన్‌ డాలర్లను (రూ. 815 కోట్లు) టిమ్‌ కుక్‌ అందుకున్నారు, ఇందులో 3 మిలియన్‌ డాలర్ల జీతం కూడా ఉంది. ఇది కాకుండా, 83 మిలియన్ల స్టాక్ అవార్డ్‌, బోనస్ కూడా తీసుకున్నారు. ఇది, 2021లో వచ్చిన మొత్తం కంటే ఎక్కువ. 2021లో, టిమ్‌ కుక్‌ 98.7 మిలియన్‌ డాలర్లు డ్రా చేశారు.


మరో ఆసక్తికర కథనం: మీరు కొనే మెడిసిన్‌ అసలా, నకిలీనా? స్కాన్‌ చేస్తే చరిత్ర తెలుస్తుంది


Join Us on Telegram: https://t.me/abpdesamofficial