QR Code on Medicines: మన దేశంలో ఫార్మా కంపెనీలు ఏటా లక్షల కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నాయి. రూపాయి కూడా విలువ చేయని మాత్ర దగ్గర్నుంచి కొన్ని కోట్ల రూపాయలు ఖరీదైన ఔషధం వరకు అమ్ముతున్నాయి. అయితే, మనం కొనే మెడిసిన్‌ ఒరిజినలా, నకిలీనా అనేది ఎలా తెలుస్తుంది?. ఇప్పటి వరకు ఈ డౌట్‌ చాలా మందికి వచ్చి ఉంటుంది. ఇప్పుడు, ఆ సమస్యకు పరిష్కారం దొరికింది.


కేంద్ర ప్రభుత్వం ఈ రోజు (01 ఆగస్టు 2023) నుంచి కొత్త రూల్‌ తీసుకొచ్చింది, ఔషధాల మీద QR కోడ్ ప్రింట్‌ చేయాలని ఆదేశించింది. డ్రగ్స్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా (DCGI) ఫార్మా కంపెనీలకు కఠిన ఆదేశాలు జారీ చేసింది. ఆ ఆర్డర్స్‌ ప్రకారం, మన దేశంలో ఎక్కువగా అమ్ముడవుతున్న టాప్ 300 డ్రగ్ బ్రాండ్స్‌ మీద QR కోడ్ లేదా బార్ కోడ్‌ తప్పనిసరిగా ముద్రించాలి. ఆగస్టు 1 నుంచి ఈ ముద్రణ ప్రారంభం అవుతుంది, క్యూఆర్‌ కోడ్‌/బార్‌ కోడ్‌ ఉన్న ఔషధాలు కొన్ని రోజుల్లోనే మార్కెట్‌లోకి వస్తాయి. ఆ కోడ్‌ను స్కాన్ చేస్తే, దాని చరిత్ర మొత్తం తెలుస్తుంది. ఫైనల్‌గా అది ఒరిజినల్‌ మందా, కాదా అన్నది తేలిపోతుంది.


QR కోడ్‌ ముద్రించే లిస్ట్‌లో ఏ మందులు ఉన్నాయి?
రూ. 50,000 కోట్ల విలువైన ఈ టాప్ 300 బ్రాండ్స్‌లో.. అలెగ్రా, షెల్‌కాల్, కాల్పాల్, డోలో, మెఫ్టాల్ వంటి పేర్లు ఉన్నాయి. యాంటీ బయాటిక్స్, కార్డియాక్ పిల్స్‌, పెయిన్‌ రిలీఫ్‌ టాబ్లెట్స్‌, యాంటీ డయాబెటిక్స్, యాంటీ అలెర్జిక్స్‌ అన్నింటినీ ఈ జాబితాలో చేర్చింది. ఇది తొలి దశ మాత్రమే. ఈ లిస్ట్‌ను దశల వారీగా పెంచుకుంటూ వెళ్తారు. ఫస్ట్‌ ఫేస్‌లో లిస్ట్‌ చేసిన బ్రాండ్స్‌ మీద QR కోడ్ లేదా బార్ కోడ్‌ ముద్రించడంలో ఫెయిల్‌ అయితే, భారీ జరిమానాలు కట్టడానికి సిద్ధంగా ఉండాలని కూడా DCGI ఫార్మా కంపెనీలను హెచ్చరించింది. 


QR కోడ్‌ స్కాన్‌ చేస్తే ఏయే వివరాలు తెలుస్తాయి?
యునిక్‌ ప్రొడక్ట్‌ ఐడెంటిఫికేషన్‌ కోడ్ (unique product identification code) ద్వారా, ఆ ఔషధం ప్రాపర్‌ నేమ్‌, జనరిక్‌ పేరు, బ్రాండ్ పేరు, తయారీ కంపెనీ పేరు, చిరునామా, బ్యాచ్ నంబర్, తయారీ తేదీ, ఎక్స్‌పైరీ డేట్‌, తయారీ కంపెనీ లైసెన్స్ నంబర్ వంటివి తెలుస్తాయి.


ప్రభుత్వం ఈ నిర్ణయం ఎందుకు తీసుకోవలసి వచ్చింది?
కొన్ని సంవత్సరాలుగా, నకిలీ మరియు నాణ్యత లేని మందులు మార్కెట్లోకి వచ్చిన సందర్భాలు కోకొల్లలు. వాటిలో చాలా వాటిని అధికారులు సీజ్‌ చేశారు. ప్రధాన కేసులను చూస్తే... అబాట్‌ అమ్ముతున్న థైరాయిడ్ మెడిసిన్‌ 'థైరోనార్మ్‌'లో నాణ్యత లేదని, నకిలీదని అధికార్లు డిక్లేర్‌ చేశారు. గ్లెన్‌మార్క్‌ కంపెనీ అమ్మిన బీపీ మాత్ర Telma-H కూడా నకిలీ అని తేలింది. ఇలాంటివే వందల కేసులున్నాయి. నకిలీ లేదా తక్కువ నాణ్యతతో దగ్గు సిరప్‌లు, ఇంజెక్షన్లు, టీకాలు మార్కెట్‌లోకి వచ్చాయి. ఫేమస్‌ కంపెనీలు కూడా, డబ్బులు మిగుల్చుకోవడానికి తమ మందుల్లో క్వాలిటీ తగ్గించి అమ్ముతున్నాయి. ఇవేమీ తెలీని అమాయక జనం వాటిని "బ్రాండెడ్‌" అనుకుని కొంటున్నారు. 


దేశంలో పెరుగుతున్న నాణ్యత లేని, నకిలీ మందుల వ్యాపారాలను చెక్‌ పెట్టడానికి, ఔషధాల్లో నాణ్యత పెంచడానికి కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇది 'ట్రాక్ అండ్ ట్రేస్' (track and trace) మెకానిజంలో ఒక భాగం. వాస్తవానికి, గత ఏడాది నవంబర్‌లోనే కేంద్ర ప్రభుత్వం ఇలాంటి యాక్షన్‌ గురించి చెప్పింది. కొంత కాలం క్రితం దీని నోటిఫికేషన్ విడుదల చేసింది, ఈ రోజు నుంచి అమల్లోకి తెచ్చింది. ఈ యాక్షన్‌ అమలు చేయడానికి, డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్‌ 1940కి సమవరణ చేసింది. ఈ సవరణ ప్రకారం, ఔషధ కంపెనీలు తమ బ్రాండ్‌ల మీద H2/QR ముద్రించడం తప్పనిసరి.


మరో ఆసక్తికర కథనం: టాక్స్‌పేయర్లలో ఇంత ఊపు ఎప్పుడూ చూడలేదు, ఫైలింగ్స్‌లో పాత రికార్డ్‌ బద్ధలు


Join Us on Telegram: https://t.me/abpdesamofficial