Income Tax Return Filing Till Last Date: ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్స్ ఫైలింగ్‌లో ఈసారి భారీ ఊపు కనిపించింది, కొత్త రికార్డ్ క్రియేట్ అయింది. 2022-23 ఫైనాన్షియల్ ఇయర్/2023-24 అసెట్‌మెంట్ ఇయర్ కోసం ఆదాయ పన్ను రిటర్న్ దాఖలు చేయడానికి చివరి తేదీ నిన్నటితో (31 జులై 2023) ముగిసింది. ఉత్తర, ఈశాన్య భారతదేశంలో అతివృష్టి, వరదలు, ఇతర కారణాల వల్ల ఇప్పటికీ లక్షలాది మంది తమ ఐటీఆర్‌లు ఫైల్ చేయలేదు. వర్షాలు, వరదలను దృష్టిలో పెట్టుకుని ఐటీఆర్ ఫైలింగ్ లాస్ట్ డేట్ పెంచుతారని ఆశించినా, కేంద్ర ప్రభుత్వం పెంచలేదు.
రికార్డ్ స్థాయిలో ఐటీఆర్ ఫైలింగ్స్
ఆదాయ పన్ను విభాగం వెబ్‌సైట్ http://www.incometax.gov.in లో ఉన్న డేటా ప్రకారం, జులై 31 అర్ధరాత్రి 12 గంటల వరకు, 6,77,42,303 కోట్ల ఆదాయ పన్ను రిటర్న్‌లు దాఖలయ్యాయి. అంటే, 2023-24 అసెస్‌మెంట్ సంవత్సరానికి మన దేశంలో 6.77 కోట్లకు పైగా ఐటీఆర్స్ ఫైల్ అయ్యాయి. వ్యక్తిగత పన్ను చెల్లింపుదార్లు (individual tax payers), యూనిట్ల విషయంలో ఇది పెద్ద రికార్డు.
గతేడాది కంటే దాదాపు కోటి ఎక్కువ
ఆదాయ పన్ను విభాగం ట్వీట్ ప్రకారం, గత సంవత్సరం, అంటే 2021-22 ఫైనాన్షియల్ ఇయర్/2022-23 అసెట్‌మెంట్ ఇయర్‌లో వ్యక్తిగత పన్ను చెల్లింపుదార్లు & యూనిట్ల కేటగిరీలో మొత్తం 5.83 కోట్ల ఐటీఆర్‌లు దాఖలయ్యాయి. దీంతో పోలిస్తే, ఈ ఏడాది దాదాపు ఒక కోటి టాక్స్ రిటర్న్స్ ఎక్కువ ఫైల్ అయ్యాయి.
ఈ ఏడాది జులై 31 వరకు, 2023-24 అసెస్‌మెంట్ సంవత్సరానికి 3,44,16,658 కోట్ల ఐటీఆర్‌లు వెరిఫై అయ్యాయి, ప్రాసెస్ పూర్తయింది. 5,62,59,216 కోట్ల రిటర్నులను ధృవీకరించారు.
నిన్న ఒక్క రోజే 36.91 లక్షల ఫైలింగ్స్
ఆదాయ పన్ను పత్రాలు సబ్మిట్ చేయాల్సిన చివరి రోజున పోర్టల్‌లో రష్ భారీగా పెరిగింది. చివరి రోజైన జులై 31న, సాయంత్రం 6 గంటల వరకు 36.91 లక్షల ఐటీఆర్‌లు దాఖలైనట్లు ఆదాయ పన్ను విభాగం ట్విటర్‌లో వెల్లడించింది. 1.78 కోట్ల మంది ఆదాయపు పన్ను పోర్టల్‌లోకి లాగిన్ అయ్యారని లెక్కలు ప్రకటించింది.
ఆలస్యమైన ఐటీఆర్‌కు రూ.5 వేల వరకు జరిమానా
జులై 31 అర్ధరాత్రి లోపు ఐటీఆర్ ఫైల్ చేయడంలో విఫలమైనవాళ్లు నేటి (01 ఆగస్టు 2023) నుంచి బీలేటెడ్ ఐటీఆర్ (Belated ITR) ఫైల్ చేస్తారు. సకాలంలో టాక్స్ రిటర్న్ దాఖలు చేయనందుకు, ఐటీ డిపార్ట్‌మెంట్ వీరి నుంచి జరిమానా వసూలు చేస్తుంది. ఇన్‌కమ్ టాక్స్ యాక్ట్‌లోని సెక్షన్ 139(1) ప్రకారం, గడువు లోపు ఐటీఆర్ ఫైల్ చేయడంలో విఫలమైతే, సెక్షన్ 234F కింద రూ. 5,000 లేట్ ఫైన్ కట్టాల్సి ఉంటుంది. పన్ను విధించదగిన ఆదాయం రూ. 5 లక్షల కంటే తక్కువగా ఉంటే, రూ. 1000 జరిమానా చెల్లించాలి.
టాక్స్ ఫైలింగ్‌లో ఏదైనా సమస్యా?, ఇక్కడ సంప్రదించండి
ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్ ఫైలింగ్, టాక్స్ పేమెంట్, రిఫండ్ సహా రిటర్న్ ఫైలింగ్‌కు సంబంధించి ఏదైనా ఇబ్బందులు ఎదురైతే పరిష్కరించడానికి ఐటీ డిపార్ట్‌మెంట్ వివిధ రూపాల్లో సాయం చేస్తోంది. టాక్స్ పేయర్ల కోసం ఐటీ డిపార్ట్‌మెంట్ హెల్ప్‌డెస్క్ 24x7 ప్రాతిపదికన పనిచేస్తోంది. ఫోన్ కాల్స్, లైవ్ చాట్, వెబ్‌ఎక్స్ సెషన్లు, సోషల్ మీడియా ద్వారా సాయం వంటి రూట్లలో తాము అందుబాటులో ఉన్నామని ఆదాయ పన్ను శాఖ విభాగం ప్రకటించింది. టాక్స్ ఫైలింగ్‌కు సంబంధించి ఎలాంటి సమస్య వచ్చినా సంప్రదించవచ్చని సూచించింది.
మరో ఆసక్తికర కథనం: రాకెట్‌లా పెరిగిన గోల్డ్ - ఇవాళ బంగారం, వెండి కొత్త ధరలు ఇవి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial