ఎన్నికలు రాగానే ఆగం కావొద్దని, ఎవరో చెప్పిన అబద్ధాలు నమ్మి ఓటెయ్యొద్దని సీఎం కేసీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్మల్ జిల్లా భైంసాలో ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడారు. ఆ నియోజకవర్గంలో ఎవరు పోటీ చేస్తున్నారు, ఆ అభ్యర్థి వెనుక ఉన్న పార్టీ, దాని చరిత్ర, ఆ పార్టీ అమలు చేసిన సంక్షేమ పథకాలు, నేతల దృక్పథం చూసి వివేకంతో ఓటు వెయ్యాలన్నారు. దేశంలో 24 గంటల విద్యుత్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని పునరుద్ఘాటించారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లవుతున్నా, ప్రజల్లో ప్రజాస్వామ్య పరిణతి రాలేదని అన్నారు. 


ప్రతిపక్షాలపై విమర్శలు


ఈ సందర్భంగా కాంగ్రెస్, బీజేపీలపై సీఎం కేసీఆర్ విమర్శలు చేశారు. రైతు బంధు దుబారా అని కాంగ్రెస్ నేతలు అంటున్నారని, రైతులకు 24 గంటల కరెంట్ అవసరం లేదని అన్నారని గుర్తు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణి ఎత్తేస్తామని చెబుతున్నారని, అదే జరిగితే మళ్లీ పైరవీలు మొదలవుతాయని, అన్నదాతలు అధికారుల చుట్టూ తిరగాల్సిన దుస్థితి ఏర్పడుతుందని చెప్పారు. రైతు బంధు, రైతు బీమా ఎలా వస్తాయి? అని ప్రశ్నించారు. 'రాష్ట్రంలో 24 గంటల కరెంట్, ఇంటింటికీ నీళ్లు ఉచితంగా ఇస్తున్నాం. వ్యవసాయానికి అధిక ప్రాధాన్యం ఇస్తూ పెట్టుబడి సాయం చేస్తున్నాం. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత చాలా కష్టపడి అన్ని సమస్యలు పరిష్కరించుకున్నాం.' అని కేసీఆర్ తెలిపారు. రాష్ట్రాన్ని 50 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ ప్రజలకు ఏం మేలు చేసిందని నిలదీశారు. 


బీజేపీ ఓట్లు ఎలా అడుగుతుంది.?


ప్రధాని మోదీ రాష్ట్రానికి ఒక్క వైద్య కళాశాల కూడా ఇవ్వలేదని కేసీఆర్ విమర్శించారు. రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పాటు చేసుకుంటే కనీసం ఒక్క నవోదయ విద్యాలయం కూడా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణకు ఏమీ ఇవ్వకుండానే ఇవాళ బీజేపీ నేతలు ఓట్లు అడుగుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రధానికి ప్రైవేటైజేషన్ పిచ్చి పట్టుకుందని మండిపడ్డారు. 'రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు, కరెంట్ ఇలా అన్నీ ప్రైవేటుపరం చేస్తున్నారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టమన్నారు. రైతులకు నష్టం కలుగుతుందని నేను పెట్టలేదు. కోపంతో మనకు ఇచ్చే నిధుల్లో కోత విధించారు.' అని కేసీఆర్ వెల్లడించారు.


'తెలంగాణ కోసమే బీఆర్ఎస్''


తెలంగాణ కోసమే బీఆర్ఎస్ పుట్టిందని, ప్రజల సంక్షేమం కోసం అనేక హామీలు అమలు చేసినట్లు సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఆర్మూరులో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ఆదాయం పెరిగే కొద్దీ సంక్షేమ పథకాలు పెంచుతున్నామని చెప్పారు. 10 హామీలిచ్చి, 100 హామీలు నెరవేర్చామని అన్నారు. దశాబ్దాలుగా వెనుకబడి ఉన్న ఎస్సీలు బాగు పడాలనే ఉద్దేశంతోనే దళిత బంధు పథకం తెచ్చామని, ప్రతీ దళిత కుటుంబానికి రూ.10 లక్షలు ఇచ్చి ఆదుకుంటామని స్పష్టం చేశారు. ఆర్మూర్ బీఆర్ఎస్ అభ్యర్థి జీవన్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.


'ఆయన్ను ఆశీర్వదించండి'


అనంతరం కోరుట్లలోని ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి సంజయ్ ఓ వైద్యుడిగా రూ.కోట్లు సంపాదించుకోవచ్చు. కానీ, ఆయన ప్రజాసేవ చేద్దామనే రాజకీయాల్లోకి వచ్చారు. తాను ఢిల్లీలో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టినప్పుడు పక్కనే ఉండి తన ప్రాణాలు కాపాడారని చెప్పారు. 'యువకుడు, వైద్యుడు అయిన సంజయ్ ను మీరంతా ఆశీర్వదించాలి' అంటూ కేసీఆర్ కోరుట్ల ప్రజలకు పిలుపునిచ్చారు. తెలంగాణ అభివృద్ధి కొనసాగాలంటే బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావాలని స్పష్టం చేశారు.


Also Read: తెలంగాణ ద్రోహులతో కలిసిన బీజేపీ, కాంగ్రెస్ - బీఆర్ఎస్‌కే పట్టం కట్టాలని హరీష్ రావు పిలుపు !