కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన జాతీయ విద్యావిధానంలో భాగంగా దేశీయ యూనివర్సిటీలు విదేశాల్లోనూ పాగవేయనున్నాయి. ఇప్పటికే విదేశీ యూనివర్సిటీలతో కలిసి ఇంటిగ్రేడెట్ కోర్సులను ప్రవేశపెట్టిన స్వదేశీ యూనివర్సిటీలు.. ఇక అక్కడే క్యాంపస్‌లు ఏర్పాటు చేసే దిశగా దూసుకుపోతున్నాయి. ఇందుకు జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం(జేఎన్‌టీయూ) ముందడుగు వేసింది. విదేశాల్లో క్యాంపస్‌లు ప్రారంభించేందుకు జేఎన్‌టీయూ సన్నాహాలు చేస్తోంది. 


నూతన జాతీయ విద్యావిధానంలో భాగంగా అమెరికా, ఐరోపా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో విశ్వవిద్యాలయ క్యాంపస్‌లను ప్రారంభించనుంది. ఇందుకోసం ఆయా దేశాల్లోని పూర్వ విద్యార్థుల సహకారం తీసుకోనుంది. వీటిపై చర్చించేందుకు జేఎన్‌టీయూ వైస్ ఛాన్స్‌లర్ కట్టా నరసింహారెడ్డి, రిజిస్ట్రార్‌ మంజూర్‌ హుస్సేన్‌ న‌వంబ‌రు 2న‌ అమెరికా పర్యటనకు వెళ్లారు. పూర్వ విద్యార్థుల సంఘ అధ్యక్షుడు డాక్టర్‌ హరి ఇప్పనపల్లి వీరికి సహకరిస్తున్నారు. 


విదేశాల్లో జేఎన్‌టీయూ క్యాంపస్‌ల ఏర్పాటుకు స్థానిక రాష్ట్రాల నుంచి అనుమతులు రాగానే పనులు ప్రారంభించనున్నారు. మరోవైపు డ్యూయల్‌ డిగ్రీ కోర్సు ఒప్పందాల్లో భాగంగా లాస్‌వేగాస్, న్యూయార్క్, న్యూజెర్సీ, డెట్రాయిట్, అలబామాలోని విదేశీ వర్సిటీల అధికారులను కలుసుకోనున్నారు.


ఇక్కడ మూడేళ్లు, అక్కడ రెండేళ్లు...
జేఎన్‌టీయూ పరిధిలో ఐదేళ్ల ఇంజినీరింగ్‌ డ్యూయల్‌ డిగ్రీ కోర్సులో మూడేళ్లు హైదరాబాద్‌లో, నాలుగో సంవత్సరం అమెరికాలో, ఐదో సంవత్సరం ఎంఎస్‌ చదవాల్సి ఉంటుంది. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో స్థిరపడిన తెలుగువారు జేఎన్‌టీయూ క్యాంపస్‌లలో తమ పిల్లలను చేర్పించే అవకాశాలున్నాయి.


ఉన్నత విద్యలో నాణ్యత పెరగాలి - ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ఆర్‌ లింబాద్రి 
దేశవ్యాప్తంగా ఉన్నత విద్యలో నాణ్యత ప్రమాణాలు మరింత మెరుగుపడాలని తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ఆర్‌ లింబాద్రి తెలిపారు. గురువారం ఢిల్లీలో నీతి ఆయోగ్‌(ఎడ్యుకేషనల్‌ వర్టికల్‌), అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ యూనివర్సిటీస్‌(ఏఐయూ)లు సంయుక్తంగా ‘యూనివర్సిటీల్లో నాణ్యమైన విద్య’ అనే అంశంపై జాతీయ సదస్సు నిర్వహించారు. ఇందులో ఐదు రాష్ర్టాల ఉన్నత విద్యామండలి చైర్మన్లు, 60 యూనివర్సిటీల వీసీలు హాజరయ్యారు. ‘క్వాలిటీ, ఫైనాన్సింగ్‌, గవర్నెన్స్‌ అండ్‌ ఎంప్లాయిబిలిటీ ’ అనే అంశాలపై కీలకంగా చర్చించారు. ఉన్నత విద్యకు ఎంతో ప్రాముఖ్యత ఉన్నదని, అందుకే యూనివర్సిటీ విద్యపై ప్రత్యేక శ్రద్ధ అవసరమని లింబాద్రి చెప్పారు. ఈ సదస్సులో ఉన్నత విద్యామండలి వైస్‌ చైర్మన్‌ వీ వెంకట రమణ హాజరయ్యారు.


ALSO READ:


జేఈఈ మెయిన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?
దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థలైన ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ ఐటీలు, కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే ఇంజినీరింగ్‌ విద్యాసంస్థల్లో ప్రవేశాలకోసం నిర్వహించే జేఈఈ మెయిన్-2024 మొదటి విడత దరఖాస్తు ప్రక్రియ షెడ్యూలు ప్రకారం నవంబరు 1న ప్రారంభంకావాల్సి ఉండగా... నవంబరు 2న ప్రారంభమైంది. అభ్యర్థులు నిర్ణీత ఫీజు చెల్లించి ఆన్‌లైన్‌ దరఖాస్తు ద్వారా నవంబర్‌ 30న రాత్రి 9 గంటల వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.  ఈ పరీక్షలను రెండు విడతలుగా నిర్వహించనున్నారు. వచ్చే ఏడాది జనవరిలో మొదటి సెషన్‌, ఏప్రిల్‌లో రెండో విడత పరీక్షలు నిర్వహించనున్నారు. ఆన్‌లైన్‌ విధానంలో జేఈఈ పరీక్షలు జరుగనున్నాయి. ఈ మేరకు జనవరి సెషన్‌కు సంబంధించిన నోటిఫికేషన్‌ను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA) నవంబరు 1న విడుదల చేసింది. తెలుగుతోపాటు ఇంగ్లిష్‌, హిందీ సహా మొత్తం 13 భాషల్లో పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్షలను 2024 జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 మధ్య నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 12న ఫలితాలను విడుదల చేస్తారు.
జేఈఈ మెయిన్ నోటిఫికేషన్, దరఖాస్తు కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...