Tammineni Veerabhadram: అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయనున్నట్లు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. రాష్ట్రంలో బీజేపీ ఒక్క స్థానంలోనూ గెలవకూడదనే లక్ష్యంతో ఈ ఎన్నికల్లో ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. మిర్యాలగూడ, వైరా స్థానాలపై తేల్చేందుకు తాము విధించిన డెడ్‌లైన్‌ ముగిసినప్పటికీ కాంగ్రెస్‌ స్పందించకపోవడంతో 17 స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. వైరా విషయంలో భట్టి విక్రమార్క మాట మార్చారని పేర్కొన్నారు.


పట్టుదలకు పోకుండా భద్రచలం, మధిర స్థానాలను వదులుకున్నామని చెప్పారు. అయినా తాము కోరిన స్థానాలకు కాంగ్రెస్​ అభ్యంతరం తెలిపిందన్నారు. కాంగ్రెస్​ నేతల వైఖరి.. తమ పార్టీ నేతలను ఎంతో బాధించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత అవమానకరంగా పొత్తులు అవసరం లేదన్న, మ్యూనిస్టులకు విలువ ఇవ్వని కాంగ్రెస్‌ పొత్తు ఉండదని తమ్మినేని స్పష్టం చేశారు. అనివార్య పరిస్థితుల్లో ఒంటరిగానే పోటీ చేయాలని నిర్ణయించుకున్నామని తెలిపారు.


బీజేపీ ఓటమే లక్ష్యం
కేవలం బీజేపీని ఓడించడమే ప్రధాన లక్ష్యంగా కాంగ్రెస్‌తో పొత్తు ప్రయత్నాలు చేసినట్లు ఆయన చెప్పారు. అయితే కాంగ్రెస్ నుంచి స్పష్టత లేదని, అందుకే పొత్తు నుంచి తప్పుకుని ఒంటరిగా పోటీ చేయాలనే నిర్ణయం తీసుకున్నట్లు తమ్మినేని చెప్పారు. మొదటగా 17 స్థానాల్లో పోటీకి నిర్ణయం తీసుకున్నామని, ఈ సంఖ్య పెరుగే అవకాశం ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ కార్యకర్తలు, బలం ఉన్న చోట పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. కమ్యూనిస్టుల్లేని శాసనసభ దేవుడు లేని దేవాలయం లాంటిదని వ్యాఖ్యానించారు.


సీపీఐకి మద్దతు
అసెంబ్లీలో కమ్యూనిస్టులకు ప్రాతినిథ్యం ఉంటేనే ప్రజలకు మేలు జరుగుతుందని తమ్మినేని అభిప్రాయపడ్డారు. కమ్యూనిస్టు పార్టీలు ఐక్యంగా పోటీ చేయాలని నిర్ణయించినప్పటికీ సీపీఐ వైఖరి చెప్పలేదని, అయినప్పటికీ సీపీఐకి మద్దతిస్తామని తమ్మినేని పేర్కొన్నారు. ఒకవేళ కాంగ్రెస్‌తో పొత్తు కొనసాగించి సీపీఐ పోటీ చేస్తే ఆ పార్టీకి మద్దతిస్తూ అక్కడ పోటీ చేయబోమని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో సీపీఎం పోటీ చేసే స్థానాల్లో కాకుండా మిగతా చోట్ల బీజేపీని ఓడించే ప్రధాన పార్టీకి మద్దతివ్వాలని తమ కార్యకర్తలకు సూచిస్తామన్నారు. 


బీజేపీ అభ్యర్థులు బలంగా ఉన్న చోట్ల ఆ తర్వాత స్థానంలో ఉన్న బీఆర్‌ఎస్‌ లేదా కాంగ్రెస్‌ లేదా ఇతరులెవరున్నా సీపీఎం మద్దతుగా నిలుస్తుందని తమ్మినేని స్పష్టం చేశారు. దేశాన్ని నాశనం చేస్తున్న బీజేపీని ఎదుర్కొనేందుకు ఎంతవరకైనా వెళ్తామన్నారు. గత పదేళ్లలో బీజేపీ సర్కార్ అనేక సార్లు ధరలు పెంచి సామాన్యులపై భారం మోపిందన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి గుణపాఠం చెబుతారని తమ్మినేని అన్నారు. బీజేపీ రహిత దేశం కోసం పోరాటం చేస్తామన్నారు.


సీపీఎం పోటీ చేసే 17 స్థానాలు
తమకు బలం ఉన్న 17 నియోజకవర్గాల్లో సీపీఎం పోటీ చేయాలని నిర్ణయించింది. భద్రాచలం (ఎస్టీ), అశ్వారావుపేట (ఎస్టీ), పాలేరు, మధిర (ఎస్సీ), వైరా (ఎస్టీ), ఖమ్మం, సత్తుపల్లి (ఎస్సీ), మిర్యాలగూడ, నల్లగొండ, నకిరేకల్‌ (ఎస్సీ), భువనగిరి, హుజూర్‌నగర్, కోదాడ, జనగామ, ఇబ్రహీంపట్నం, పటాన్‌చెరు, ముషీరాబాద్‌ స్థానాల్లో పోటీ చేయనున్నట్లు తమ్మినేని వెల్లడించారు. త్వరలో పార్టీ జిల్లా కార్యదర్శులు, సీనియర్లతో చర్చించిన తర్వాత ఈ సెగ్మెంట్లకు అభ్యర్థులను ప్రకటిస్తామన్నారు. ముషీరాబాద్‌ అభ్యర్థిగా సీపీఎం హైదరాబాద్‌ జిల్లా కార్యవర్గ సభ్యుడు మద్దెల దశరథ్‌ పేరు ప్రచారం జరుగుతోంది.