Harish Rao :  ఎన్నికల్లో తెలంగాణాను దెబ్బతీయడానికి తెలంగాణ ద్రోహులందరూ ఏకమవుతున్నారని మంత్రి హరీష్ రావు ఆరోపించారు. కేసీఆర్ ను క్రిమినల్ అంటున్న రేవంత్ రెడ్డే ఓటుకు నోటు కేసులో దొరికిన అసలైన క్రిమినల్ అని ఆయన అన్నారు. సంగారెడ్డిలో నిర్వహించిన ప్రజాఆశీర్వాద సభలో ఆయన ప్రసంగించారు. రేవంత్ రెడ్డి పార్టీ టికెట్లు అమ్ముకుంటున్నాడని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే అంటున్నారని, అధికారంలోకి వస్తే తెలంగాణానే అమ్మేస్తాడని హరీష్ రావు ఎద్దేవా చేశారు. సంగారెడ్డిలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. సంగారెడ్డిలో గులాబీ జెండా ఎగిరితే, అభివృద్ది పరుగులు పెడుతుందన్నారు. కేసీఆర్ హయాంలో తాగునీటికీ, కరెంటుకూ కొరత లేదనీ, ఆడపిల్ల పెళ్లికి అడ్డంకులు లేవనీ, కొట్లాటలూ, కర్ఫ్యూలు లేవని ఆయన చెప్పారు.


గెలిచినా జగ్గారెడ్డి ఏమీ  చేయలేదు ! 
  
మొన్న మల్లికార్జున ఖర్గే సంగారెడ్డి వస్తే మీటింగ్ లో జనం లేరని హరీష్ రావు తెలిపారు.  అన్ని సర్వేలు హ్యాట్రిక్ సీఎం కేసీఆర్ అంటున్నాయని గుర్తు చేశారు. గత ఎన్నికల్లో  జగ్గారెడ్డి గెలిచాడు తప్ప, 5 ఎల్లలో ఒక్కనాడు ఊళ్ళలకు రాలేదన్నారు. ఆయన పత్తా తెల్వదు, ఫోన్ నంబర్ తెల్వదు,  గల్లికో ఏటీఎమ్ పెడతా అన్నడు. ఎన్నో ఇల్లు ఇస్తానన్నడు ఒక్కటన్న జరిగిందా అని ఓటర్లను ప్రశ్నించారు.  అందరం కలిసి కార్యరంగంలో దిగితే జగ్గారెడ్డి గాల్లో కొట్టుక పోతాడని జోస్యం చెప్పారు. గత ఎన్నికల్లో  చింతా ప్రభాకర్ గెలవకున్నా, ప్రజల మధ్య ఉన్నడు. ఎంతో సేవ చేశారన్నారు.  కేసీఆర్ 570 కోట్లతో మెడికల్ కాలేజీ ఇచ్చారు. నర్సింగ్ కాలేజీ ఇచ్చారన్నారు. 


తెలంగాణ ద్రోహులతో కలిసిన బీజేపీ, కాంగ్రెస్ 


జగ్గారెడ్డి తెలంగాణ ద్రోహి. తెలంగాణ వద్దు అన్నాడని. సంగారెడ్డిని  కర్ణాటకలో కలుపుతా అన్నాడని మండిపడ్డారు.  తెలంగాణ వ్యతిరేకులతో చేతులు కలిపిన వ్యక్తి జగ్గారెడ్డి అని స్పష్టం చేశారు.  పవన్ కళ్యాణ్ తో బిజెపి చేతులు కలిపితే, షర్మిల కాంగ్రెస్ తో చేతులు కలిపిందన్నారు.  పవన్ కళ్యాణ్ తెలంగాణ రావడం ఇష్టం లేదు అని భోజనం మానేసిండని..  తెలంగాణ ఇవ్వాలంటే నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి సిగరెట్టా, బీడీనా అన్నడని గుర్తు చేశారు.  బతికి ఉండగా తెలంగాణ రానే రాదు అన్నాడు..  తెలంగాణ వ్యతిరేకించింది షర్మిల అని గుర్తు చేశారు.  చంద్రబాబు లోపలి నుండి మద్దతు ఇస్తానన్నాడని  అలాంటి వాళ్ళతో నేడు బిజెపి, కాంగ్రెస్ చేతులు కల్పిందని మండిపడ్డారు. 
 
కిందా మీద అయితే తెలంగాణ ఆగం 


కింద మీద అయితే తెలంగాణ ఆగమవుతుందని హరీష్ రావు హెచ్చరించారు.  వీళ్ళందరూ తెలంగాణ రాకుండా నాడు కుట్రలు చేసినవాళ్లేనన్నారు.  పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలంగాణ వ్యతిరేకి. జై తెలంగాణ అన్న వల్ల మీదికి తుపాకి పట్టుకొని బయలుదేరాడన్నారు.  తెలంగాణ ద్రోహులకు, నికార్సైన తెలంగాణ బిడ్డ కేసీఆర్ కు మధ్య పోటీ జరుగుతోందన్నారు.  తెలంగాణ గెలవాలంటే కారుకు ఓటు వేయాలి, ఓడాలంటే రేవంత్ రెడ్డి అండ్ క్రిమినల్ గ్యాంగుకు ఓటు వేయాలి. ప్రజలు ఆలోచించి ఓటేయాలన్నారు.  రేవంత్ రెడ్డి ఓయూ విద్యార్థులు అడ్డా మీది కూలీలు అన్నడు. బీరుకు బిర్యానికి అమ్ముడు పోతరట... ఎంత అవహేళనగా మాట్లాడారు. ఓయూ విద్యార్థుల పోరాటాలు, త్యాగాలను రేవంత్ రెడ్డి అవమానించారని మండిపడ్డారు. 


జనవరి నుంచి కొత్త హామీలు అమలు
    
బీఆర్ఎస్  మేనిఫెస్టో గురించి ప్రజల్లోకి తీసుకు వెళ్ళాలని పిలపునిచ్చారు.  జనవరి నుండి దొడ్డు బియ్యం కాదు సన్నబియ్యం వస్తాయి. రూ. 400 లకే గ్యాస్ సిలిండర్ ఇవ్వబోతున్నాము.  
కోటి కుటుంబాలకు కేసీఆర్ బీమా ఇవ్వబోతున్నము. ఎకరాకు 16 వేల రైతు బంధు ఇబ్బబోతున్నాం.  అసైన్డ్ భూములను పట్టా ఇవ్వబోతున్నామని హామీ ఇచ్చారు.  బట్టే బాజ్ మాటలకు, నాటకాలకు మోసపోవద్దు. మోసపోతే సంగారెడ్డి ఆగం అవుతుందని హెచ్చరించారు.