Tirupati News :  టీటీడీ మాజీ పాలక మండలి సభ్యులు భాను ప్రకాష్ రెడ్డిపై టీటీడీ ఈవో ధర్మారెడ్డి మండిప్డడారు.  అలిపిరి పాదాల మండపాన్ని తొలగిస్తున్నారని ప్రచారం చేయడంపై విమర్శలు గుప్పించారు.  శిధిలావస్థకు చేరుకున్న పురాతన మండపంపై భానుప్రకాష్ రెడ్డి అనవసరంగా రాద్దాంతం చేస్తున్నారని  ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఉదయం తిరుమలలోని అన్నమయ్య భవన్లో ఏర్పాటు చేసిన డయల్ యువర్ కార్యక్రమంలో టీటీడీ ఈవో ఏ వి ధర్మారెడ్డి పాల్గొని భక్తుల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. తర్వాత మీడియాతో మాట్లాడాు. 


అలిపిరి పాదాల మండపంపై అనవసర విమర్శలు 


అలిపిరి పాదాల మండపం వద్ద పురాతన మండపం శిథిలావస్థకు చేరుకుందన్నారు. అందుకే తిరిగి అదే మండపాన్ని మళ్లీ జీర్ణోదరణ చేస్తున్నామని అంతే తప్ప కూల్చి వేయడం లేదన్నారు.  దీనిపై బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరిని అలిపిరి పాదాల మండపం వద్దకు తీసుకెళ్లి భానుప్రకాష్ రెడ్డి అనవసరంగా  వివాదం చేస్తున్నారని చేస్తున్నట్లు ఆయన ఆరోపించారు. భానుప్రకాష్ రెడ్డి టీటీడీ పాలక మండలి సభ్యుడిగా ఉన్న సమయంలో శ్రీవారి ఆలయంలో అనేక మార్పులు చేశామని ఆయన గుర్తు చేశారు. ఆ సమయంలో అడ్డు చెప్పని మాజీ పాలకమండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి ఇప్పుడు ఎందుకు మండపాల జీర్ణోర్ధరణ పనులకు అడ్డుపడుతున్నారో అర్థం కావడం లేదన్నారు.  భానుప్రకాష్ రెడ్డికి ధైర్యం ఉంటే తిరుమలలోని పార్వేటి మండపం వద్దకు వచ్చి మండపాన్ని పరిశీలించి నిర్మాణం బాగా లేదని చెప్పాలని సవాల్ చేశారు.  భక్తుల సౌకర్యార్థం వారి క్షేమార్థం టీటీడీ చేస్తున్న పనులకు బిజెపి భానుప్రకాష్ రెడ్డి అడ్డుపడడం సరైన విధానం కాదన్నారు.  భాను ప్రకాష్ రెడ్డి ఇల్లు ఎందుకు కట్టుకున్నారో చెప్పగలరా అంటూ ఆయన ప్రశ్నించారు.  


పదో తేదీ నుంచి వైకుంఠ ద్వార దర్శనం టిక్కెట్లు 


ఈ ఏడాది డిసెంబర్ 23వ తారీఖున వచ్చే వైకుంఠ ఏకాదశి పర్వదినంకు సంబంధించిన వైకుంఠ ద్వార దర్శనం సంబంధించి 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకెన్లను ఈ నెల 10వ తేదీ నుండి భక్తులకు అందుబాటులో ఉంచునున్నట్లు టిటిడి ఈవో వెల్లడించారు. 10 రోజులకు కలిపి రెండు లక్షల 25 వేల టోకెన్లను అందుబాటులో ఉంచునున్నట్లు చెప్పారు. అదే విధంగా రోజుకు 2000 చొప్పున శ్రీవాణి టికెట్లను కేటాయిస్తామని, శ్రీవాణి టికెట్లను పొందిన భక్తులకు 300 రూపాయల టికెట్లు కేటాయించినట్లు ఆయన తెలియజేశారు.. అలాగే సర్వదర్శనం టోకెన్లను తిరుపతిలో 9 ప్రాంతాల్లో 4 లక్షల 25 వేల టోకెన్లను సామాన్య భక్తులకు అందుబాటులో ఉంచుతామని, తిరుపతిలో జారీ చేసే వైకుంఠ ద్వార దర్శనం టోకెన్లను ఒక్క‌ రోజు నుండి టిటిడి‌ కేటాయించిన 9 ప్రాంతాల్లో జారీ చేస్తున్నాంమని తెలిపారు. 


సామాన్య భక్తులకే పెద్ద పీట 


వైకుంఠ ద్వార దర్శనంకు సంబంధించి సామాన్య భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నాంమని, వైకుంఠ ద్వార దర్శనం కల్పించే 10 రోజుల్లో సిఫార్సు లేఖలపై విఐపి బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నాంమని,ఇతర ప్రివిలైజ్ దర్శనాలను కూడా రద్దు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.. ఇక అక్టోబర్ నెలకు సంబంధించి 21 లక్షల 75 వేల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకోగా, 108 కోట్ల రూపాయలు హుండి ద్వారా ఆదాయం లభించినట్లు చెప్పారు.. ఒక కోటి 5 లక్షల లడ్డూలు భక్తులకు విక్రయించగా, 47 లక్షల ఐదు వేల మంది భక్తులు అక్టోబర్ నెలలో అన్న ప్రసాదం స్వీకరించారన్నారు.. 8 లక్షల 30 వేల మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించినట్లు టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి వెల్లడించారు..