అర్జున రణతుంగ,సనత్ జయసూర్య, ముత్తయ మురళీధరన్, కుమార సంగక్కర, మహేల జయవర్దనే, చమిందా వాస్, తిలకరత్నే దిల్షాన్...ఇలా ఒకప్పుడు శ్రీలంక జట్టునిండా దిగ్గజాలే. ఈ పేర్లు వింటేనే ప్రత్యర్థి జట్లు కొంచెం ఆందోళన పడేవి. ఒంటిచేత్తో జట్టును విజయ తీరాలకు చేర్చే ఆటగాళ్లతో శ్రీలంక ప్రత్యర్థి జట్లకు గట్టిపోటీనిచ్చేది. ఆస్ట్రేలియా అప్రతిహాత జైత్రయాత్ర చేస్తున్న రోజుల్లోనూ ఆ జట్టుకు లంకేయులు గట్టి సవాల్ విసిరి సత్తా చాటేవారు. మూడుసార్లు ప్రపంచకప్ ఫైనల్ ఆడిదంటే 1990వ దశకంలో లంక ఆటతీరు ఎలా సాగిందో చెప్పుకోవచ్చు. 1996లో అర్జున రణతుంగ సారథ్యంలో శ్రీలంక ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది. 2007లో ఆస్ట్రేలియాతో ప్రపంచకప్ ఫైనల్స్ ఆడిన లంకేయులు 2011లో టీమిండియాతోనూ తుదిపోరులు తలపడ్డారు. 2007, 2011లో వరుసగా రెండుసార్లు ఫైనల్స్ ఆడి సత్తా చాటారు. కానీ 1996 తర్వాత లంక మళ్లీ ప్రపంచ ఛాంపియన్‌గా మారలేకపోయింది. కొన్నేళ్ల క్రితం వరకూ శ్రీలంక జట్టు తన ప్రదర్శనతో అద్భుతాలు సృష్టించేది. కానీ కాలం గడుస్తున్నా కొద్దీ సీనియర్ ఆటగాళ్ల రిటైర్‌మెంట్‌లు, దేశవాళీ నుంచి అద్భుతమైన క్రికెటర్లు రాక లంక పరిస్థితి దిగజారి పసికూన స్థాయికి దిగజారింది. ఇప్పుడు ఎప్పుడో కానీ లంకనుంచి అద్భుతాలు ఆశించడం గగనమైపోయింది. ఆసియాకప్ ఫైనల్లో భారత్ చేతిలో 50 పరుగులకు ఆలౌట్.. మళ్లీ ప్రపంచకప్‌లో 55 పరుగులకు ఆలౌట్ అయి లంక క్రికెట్ ప్రేమికుల మనసులను గాయపరిచింది.
ఒకప్పుడు టీమిండియా.. శ్రీలంకతో తలపడుతుంటే పోరు ఉత్కంఠభరితంగా సాగేది. భారత భౌలర్లకు లంక బ్యాటర్లకు మధ్య యుద్ధం జరిగేది. జయసూర్య, కుమార సంగక్కర, మహేల జయవర్దనే, ఆటపట్టు, దిల్షాన్ వంటి ఆటగాళ్లు టీమిండియా పేసర్లకు సవాల్ విసిరేవారు. సచిన్, రాహుల్, గంగూలీ, ధోనీ, విరాట్ వంటి బ్యాటర్లను ముత్తయ్య మురళీధరన్, చమిందా వాస్ వంటి అగ్రశ్రేణి బౌలర్లు ముప్పుతిప్పలు పెట్టేవారు. కానీ ఇప్పుడు ఈ పోరాటం కనిపించడం లేదు. భారత జట్టు ముందు లంక చతికిలపడిపోతుంది. కనీస పోటీ ఇవ్వలేక చేత్తులెత్తోస్తోంది. వేరే జట్లపై కనీసం పరుగులైనా చేస్తున్న లంకేయులు భారత్ అంటే మాత్రం హడలిపోతున్నారు. భారత బౌలర్లు, బ్యాటర్లేమో లంక అనగానే రెచ్చిపోతున్నారు.
కారణమేదైనా ఈ ఫలితాలు క్రికెట్ అభిమానులకు మాత్రం తీవ్ర నిర్వేదాన్ని మిగులుస్తున్నాయి. ఒకప్పుడు హోరాహోరీగా జరిగే శ్రీలంక-టీమిండియా మ్యాచ్‌లు ఇప్పుడు పూర్తిగా ఏకపక్షంగా మారడంపై క్రికెట్ ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లంక జట్టు ఆటతీరు దిగజారడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇదేనా మనం చూసిన ప్రపంచ ఛాంపియన్ లంక జట్టు అని బాధపడుతున్నారు. గత ఏడాది ఆసియాకప్‌ను గెలుచుకున్న లంక ఈసారి భారత్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌లో అద్భుతాలు సృష్టిస్తుందని అందరూ అనుకున్నారు. భారత ఉపఖండం పిచ్‌లు స్పిన్‌కు అనుకూలిస్తాయన్న అంచనాలతో లంక స్పిన్నర్లు రాణిస్తారని అంచనా వేశారు. కానీ ఈ అంచనాలేవీ పనిచేయలేదు. లంక అందరూ ఆశించినట్లు ఎలాంటి అద్భుతాలు సృష్టించలేదు. 1996లో శ్రీలంక ప్రపంచకప్ గెలిచినప్పుడు ఈ టోర్నీని భారత్-శ్రీలంక-పాకిస్థాన్ సంయుక్తంగా నిర్వహించాయి. అయితే, ఈసారి భారత్‌కు మాత్రమే ఆతిథ్యం లభించింది. భారత్‌లో దాదాపుగా లంకలాంటి పరిస్థితులే ఉంటాయి. వీటిని శ్రీలంక జట్టు సద్వినియోగం చేసుకుంటుందనుకున్నా అలాంటిదేమీ జరగలేదు. 27 ఏళ్ల తర్వాతైనా ప్రపంచకప్‌ను ఒడిసిపడుతుందనుకున్న శ్రీలంక అసలు సెమీస్ లేకుండానే నిష్క్రమించడం క్రికెట్ అభిమానులను మాత్రం తీవ్ర నిరాశను మిగిల్చింది.