Amit Shah At Chevella : వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ సంపూర్ణ మెజారిటీతో గెలుస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. చేవెళ్ల బహిరంగ సభలో ముస్లిం రిజర్వేషన్లపై అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్ రద్దు చేస్తామన్నారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రావాలని దిల్లీలో ప్రధాని మోదీకి వినిపడేలా నినదించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో 9 ఏళ్లుగా బీఆర్ఎస్ అవినీతి పాలన చేస్తుందని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాషాయ జెండా ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు. పేపర్ లీకేజీ వ్యవహారంపై మాట్లాడిన అమిత్ షా... ఏ తప్పు చేయకుండా బండి సంజయ్ అరెస్టు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ అరెస్టులకు బీజేపీ ఎప్పుడూ భయపడదన్నారు.  


కేసీఆర్ అవినీతి పాలన అంతానికి కౌంట్ డౌన్ స్టార్ట్ 


" తెలంగాణలో యువతకు అన్యాయం జరుగుతోంది. ఏ పరీక్ష పెట్టినా పేపర్‌ లీక్‌ అవుతోంది. పేపర్‌ లీకేజీలపై ఇప్పటి వరకు సీఎం కేసీఆర్‌ స్పందించలేదు. పేపర్‌ లీక్‌ ఘటనలపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నాను. తెలంగాణలో ఉద్యోగాల భర్తీ జరగడం లేదు. రాష్ట్రంలో కేంద్ర పథకాలు ప్రజలకు చేరడం లేదు. కేసీఆర్‌ ఎన్ని కుట్రలు చేసినా ప్రజలను మోదీ నుంచి దూరం చేయలేరు.  రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ సంపూర్ణ మెజారిటీతో గెలుపొందడం ఖాయమని ఈ మహాసభ తెలియజేస్తోంది. బీఆర్‌ఎస్ అవినీతి పాలన అంతం కావడానికి కౌంట్ డౌన్ మొదలైంది. కేసీఆర్ మీ దౌర్జన్యాలకు ప్రజలు భయపడరు, ఇప్పుడు మిమ్మల్ని గద్దె దించే వరకు వారి పోరాటం కొనసాగుతుంది. జాగ్రత్తగా వినండి కేసీఆర్! దురదృష్టవశాత్తు తెలంగాణలో, పోలీసు, పరిపాలన పూర్తిగా రాజకీయకోణంలో జరుగుతోంది. మోదీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు మధ్యలోనే ఆపేస్తున్నారు.  రాష్ట్ర ప్రజలకు సంక్షేమం అభివృద్ధిని దూరం చేస్తున్నారు.   "- అమిత్ షా 


నేను మళ్లీ వస్తా 


"నేను మళ్లీ వస్తాను కేసీఆర్ హామీలను నిలదీస్తాను. పేపర్ లీకేజి మీద సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం రావాల్సిన అవసరం ఉందా? లేదా?  మోదీని మరొక్క సారి ప్రధాని చేస్తారా? అని ప్రశ్నించారు. కేసీఆర్, ఓవైసీని మట్టికరిపిస్తారా?  మేము అధికారంలోకి రాగానే పేపర్ లీకేజీ చేసిన వారిని వదిలే ప్రసక్తే లేదు. ఇక మిగిలింది కొంత కాలమే. ఇకనైనా దౌర్జన్యాలు మానేసి ప్రజల అభివృద్ధి, సంక్షేమంపై దృష్టి పెట్టండి కేసీఆర్. బీజేపీ కార్యకర్తలు యోధులు, మా పుట్టుక ప్రతిపక్షంలోనే ఉంది. మజ్లిస్ (ఒవైసీ)తో స్టీరింగ్ ఉన్న ఏ ప్రభుత్వం తెలంగాణలో నడవదు. తెలంగాణ, దేశ అభివృద్ధికి సంపూర్ణంగా అంకితమయ్యే ప్రభుత్వాన్ని మేము ఏర్పాటు చేస్తాము." - అమిత్ షా 


కేసీఆర్ ప్రధాని సీటు ఖాళీ లేదు 


సీఎం కేసీఆర్‌ ప్రధాని కావాలని కలలు కంటున్నారని, అయితే ప్రధాని సీటు ఖాళీగా లేదని అమిత్‌ షా స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల తర్వాత కూడా మోదీనే ప్రధాని అని వెల్లడించారు.  కేసీఆర్‌ ముందు సీఎం సీటు కాపాడుకుంటే చాలంటూ సెటైర్లు వేశారు. ప్రధాని మోదీని ప్రజల నుంచి సీఎం కేసీఆర్‌ దూరం చేయలేరన్నారు. కేసీఆర్‌ బీఆర్ఎస్ పేరుతో దేశమంతా విస్తరించాలనుకుంటున్నారని, అందులో భాగంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. మజ్లీస్ చేతుల్లో కారు స్టీరింగ్‌ ఉందన్నారు. మజ్లిస్‌కు బీజేపీ భయపడేది లేదని స్పష్టం చేశారు. మజ్లిస్‌కు భయపడే బీఆర్ఎస్ తెలంగాణ విమోచన దినం కూడా నిర్వహించట్లేదన్నారు.