Telangana BJP Leaders Placed In Modi 3.0 Cabinet: కేంద్ర మంత్రివర్గంలోకి తెలంగాణ నుంచి ఇద్దరికి చోటు దక్కింది. సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌లకు (Bandi Sanjay) మోదీ కేబినెట్‌లో అవకాశం లభించింది. ఈ మేరకు పీఎంవో నుంచి సమాచారం అందడంతో వారు ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ఆదివారం సాయంత్రం 7:15 గంటలకు దేశ ప్రధానిగా మూడోసారి నరేంద్ర మోదీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆయనతో పాటు 30 మంది మంత్రులూ ప్రమాణస్వీకారం చేయనున్నారు. అటు, ఏపీ నుంచి శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు, గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్, నర్సాపురం బీజేపీ ఎంపీ శ్రీనివాసవర్మలకు కేంద్ర మంత్రులుగా అవకాశం దక్కింది. 


కిషన్ రెడ్డి రాజకీయ ప్రస్థానం


ఇటీవల పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్ స్థానం నుంచి పోటీ చేసిన కిషన్ రెడ్డి (Kishan Reddy) మరోసారి ఎంపీగా విజయం సాధించారు. గతంలోనూ ఇదే స్థానంలో గెలిచి కేంద్ర మంత్రిగా పని చేశారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగానూ కొనసాగుతున్నారు. ఈ క్రమంలో ఆయన రాజకీయ ప్రస్థానం ఓసారి పరిశీలిస్తే.. 



  • రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాపురం గ్రామంలో కిషన్ రెడ్డి జన్మించారు. టూల్ డిజైనింగ్‌లో డిప్లొమా చేశారు.

  • సంఘ్ కార్యకర్తగా చేసిన అనంతరం 1977లో జనతా పార్టీలో చేరారు. 1980లో రంగారెడ్డి జిల్లా బీజేపీ యువమోర్చా కన్వీనర్‌గా బాధ్యతలు చేపట్టారు.

  • 2001లో బీజేపీ రాష్ట్ర కోశాధికారిగా.. 2004లో బీజేపీ యువమోర్చా జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. బీజేపీలో కీలక నేతగా ఎదిగి తొలిసారి హిమాయత్ నగర్ శాసనసభ నుంచి బరిలో నిలిచి విజయం సాధించారు.

  • అనంతరం హైదరాబాద్ నగరంలో నియోజకవర్గాల పునర్విభజన కారణంగా 2009లో అంబర్ పేట్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 2010లో ఉమ్మడి ఏపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.

  • 2014 ఎన్నికల్లో అంబర్ పేట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి మళ్లీ గెలుపొందారు. 2016 - 18 వరకూ బీజేపీ శాసనాసభపక్ష నేతగా పనిచేశారు.

  • 2018 ఎన్నికల్లో అంబర్ పేట్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం ఇటీవల పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఇప్పుడు మరోసారి ఆయన్ను కేంద్ర మంత్రి పదవి వరించింది.


ఢిల్లీ నుంచి ఆహ్వానం


కేంద్ర మంత్రులుగా అవకాశం దక్కిన వారందరికీ పీఎంవో కార్యాలయం నుంచి పోన్లు వచ్చాయి. ప్రమాణస్వీకారానికి ఢిల్లీ రావాలని సమాచారం అందడంతో కిషన్ రెడ్డి సహా బండి సంజయ్ ఢిల్లీ చేరుకున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తం ఐదుగురు మోదీతో పాటు కేంద్ర మంత్రులుగా ఆదివారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు.


'అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తాం'


తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కోసం పని చేస్తామని కిషన్ రెడ్డి అన్నారు. కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న క్రమంలో ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. 'తెలంగాణలో గత పదేళ్లలో కేంద్రం రూ.10 లక్షల కోట్లు ఖర్చు చేసింది. గత పదేళ్లలో దేశవ్యాప్తంగా 4 కోట్ల ఇళ్లు నిర్మించాం. రాబోయే రోజుల్లో పేదలకు మరో 3 కోట్ల ఇళ్లు నిర్మిస్తాం. రాబోయే రోజుల్లో బీజేపీని మరింత బలోపేతం చేసే దిశగా కార్యకర్తలు కృషి చేయాలి' అని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు.