Loksabha News : తెలంగాణలో గిరిజన రిజర్వేషన్ల పెంపు విషయంలో సుప్రీంకోర్టులో కేసుల పరిష్కారం తర్వాతే నిర్ణయం తీసుకుంటామని  కేంద్రం స్పష్టం చేసింది. టీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర గిరిజన శాఖ మంత్రి అర్జున్ ముండా రాతపూర్వక సమాధానం ఇచ్చారు.  తెలంగాణాలో గిరిజన రిజర్వేషన్ల పెంపు బిల్లు కేంద్ర ప్రభుత్వానికి అందిందని మంత్రి అర్జున్ ముండా తెలిపారు.రిజర్వేషన్లను 10 శాతానికి పెంచాలని కోరూతూ తెలంగాణ ప్రభుత్వం ఆమోదించిన బిల్లు కేంద్ర హోం శాఖకు చేరిందన్నారు. రిజర్వేషన్లకు సంబంధించిన కేసులు ప్రస్తుతం సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్నాయని కేంద్రం తెలిపింది. అత్యున్నత న్యాయస్థానంలో కేసుల పరిష్కారం తరువాత దీనిపై ముందకు వెళతామని కేంద్ర హోంశాఖ తెలిపిందని కేంద్ర మంత్రి అర్జున్ మండా వెల్లడించారు.  


గిరిజనులకు పది శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం 


జనాభా దామాషా ప్రకారం ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తూ ప్రభుత్వం  సెప్టెంబర్ 30వ తేదీన  జీవో నంబర్‌ 33 జారీ చేసింది.  ఎస్టీలకు రిజర్వేషన్లు పెంచుతామని కేసీఆర్‌ సీఎంగా బాధ్యతలు చేపట్టిన కొత్తలో ప్రకటించారు.  రిజర్వేషన్ల పెంపు అధ్యయనానికి విశ్రాంత ఐఏఎస్‌ అధికారి ఎస్‌ చెల్లప్ప నేతృత్వంలో కమిషన్‌ కూడా వేశారు. ఈ కమిషన్‌ ఇచ్చిన నివేదికను 2017లో ఏప్రిల్‌ 15న రాష్ట్ర మంత్రి వర్గం ఆమోదించింది. ఆ తర్వాతి రోజే శాసనసభలో తీర్మానం కూడా చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించింది. కానీ రిజర్వేషన్లు యాభై శాతానికి మించకూడదన్న సుప్రీంకోర్టు తీర్పు కారణంగా కేంద్రం ఆమోదించలేదు.


ప్రత్యేక పరిస్థితుల్లో యాభై శాతం మించి రిజర్వేషన్లు ఇవ్వవచ్చని తెలంగాణ సర్కార్ వాదన 


అయితే  ఎక్స్‌ట్రార్డినరీ సిచ్యువేషన్‌  లో రిజర్వేషన్లు 50 శాతం మించవచ్చిని సుప్రీంకోర్టు పేర్కొన్నది. ఆ ప్రత్యేక సందర్భాలను కూడా స్పష్టంగా తెలిపింది. సుప్రీంకోర్టు చెప్పిన ప్రత్యేక సందర్భం తెలంగాణకు ఉందని ప్రభుత్వం వాదిస్తోంది. సుప్రీంకోర్టు తీర్పు చెప్పినట్లుగా ఎక్స్‌ట్రార్డినరీ సిచ్యువేషన్‌ ప్రాతిపదికగా ఆ బిల్లును ఆమోదించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ సహా రాష్ట్ర మంత్రులు, గిరిజన సంఘాల నేతలు అనేకసార్లు కేంద్రానికి విన్నవించారు. పార్లమెంటులోనూ టీఆర్‌ఎస్‌ నేతలు గిరిజన రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్‌ చేశారు. అయినా కేంద్రం స్పందించలేదు. 


కేంద్రం స్పష్టతతో తెలంగాణ సర్కార్ జారీ చేసిన జీవో చెల్లుతుందా ? లేదా ? 


దీంతో రాష్ట్రప్రభుత్వం గిరిజన రిజర్వేషన్లను పెంచుతూ  జీవో జారీచేసింది. కేంద్రంతో సంబంధం లేకుండా జీవో అమలు చేస్తామని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. అయితే ఈ రిజర్వేషన్లు తెలంగాణలో అమలు కావాలంటే రాష్ట్రపతి ఆమోద ముద్ర ఉండాలి. అందుకే ఇప్పుడు ఈ రిజర్వేషన్లు అమలవుతాయా లేదా అన్నది క్లారిటీ లేకుండా  పోయింది.  తెలంగాణ ప్రభుత్వం ... పార్లమెంట్‌లో కేంద్రం చేసిన ప్రకటనపై స్పందిస్తే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. 


యాగంలో నీ బిడ్డతో ప్రమాణం చేయించు, లేదంటే నీ కుట్రలు నీకే తిప్పికొడతాయి - బండి సంజయ్