Cbi Arrested Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో తీహార్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు (Kavitha) మరో షాక్ తగిలింది. మనీ లాండరింగ్ కు సంబంధించి ఈడీ కేసులో ఇప్పటికే ఆమె తీహార్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. తాజాగా, కవితను గురువారం ఈ కేసులో సీబీఐ (CBI) అరెస్ట్ చేసింది. కాగా, లిక్కర్ కేసుకు సంబంధించి కవితను ప్రశ్నించేందుకు సీబీఐ అధికారులు కోర్టును ఆశ్రయించగా.. న్యాయస్థానం అందుకు అనుమతి ఇచ్చింది. దీంతో ఈ నెల 6న కేంద్ర దర్యాప్తు సంస్థ ఆమెను ప్రశ్నించింది. ఇదే కేసులో గతంలో ఆమెను సీబీఐ ప్రశ్నించింది. తాజాగా, కవితను కస్టడీలోకి తీసుకుంటున్నట్లు ప్రకటించింది. లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తో కలిసి ఆమె కుట్రలు పన్నారని సీబీఐ ఆరోపించింది. ఈ క్రమంలో కవితను జ్యుడీషీయల్ కస్టడీ నుంచి సీబీఐ హెడ్ క్వార్టర్స్ కు తరలించనున్నారు. మరోవైపు, కవిత రెగ్యులర్ పిటిషన్ పై ఈ నెల 16న విచారణ జరగనుండగా.. తాజాగా సీబీఐ కస్టడీలోకి తీసుకోవడం సంచలనంగా మారింది. 






లిక్కర్ స్కాంకు సంబంధించి మనీ లాండరింగ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితన మార్చి 15న ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఆమెను ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచగా.. కోర్టు మార్చి 26 వరకూ ఈడీ కస్టడీకి అప్పగించింది. అనంతరం కస్టడీ గడువు ముగియడంతో కోర్టు కవితకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. దీంతో ఆమెను తీహార్ జైలుకు తరలించారు. రెండు రోజుల క్రితం మళ్లీ కోర్టులో హాజరు పరచగా.. ఆమె జ్యుడీషియల్ కస్టడీని మరో 14 రోజులు పొడిగించింది. దీంతో ఆమె ఈ నెల 23 వరకూ తీహార్ జైలులోనే ఉండనున్నారు. మరోవైపు, కవిత రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై ఈ నెల 16న విచారణ జరగనుంది.


వరుస షాక్ లు


ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో రోజుకో కీలక పరిణామం చోటు చేసుకుంటోంది. తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కవిత దాఖలు చేసిన పిటిషన్ ను రౌస్ అవెన్యూ కోర్టు ఈ నెల 8న కొట్టేసింది. చిన్న కుమారుడికి పరీక్షలు ఉన్నందున ఈ నెల 16 వరకూ మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కవిత పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం.. ఏప్రిల్ 4న తీర్పును రిజర్వ్ చేసింది. అనంతరం ఈ నెల 8న (సోమవారం) దీనిపై తీర్పు వెలువరించింది. ఇక, ఈ కేసుకు సంబంధించి సీబీఐ అధికారులు కవితను గతంలోనే హైదరాబాద్ లో విచారించారు. ఈడీ కేసులో తీహార్ జైలులో ఉన్న అనంతరం ఆమెను కోర్టు అనుమతితో ఈ నెల 6న ప్రశ్నించారు. తాజాగా, ఆమెను తీహార్ జైలు నుంతి తమ కస్టడీలోకి తీసుకున్నారు.


Also Read: Komatireddy VenkatReddy: 'పదేళ్లు సీఎంగా రేవంత్ రెడ్డి' - బీఆర్ఎస్ ఒక్క ఎంపీ సీటు గెలిచినా దేనికైనా సిద్ధమన్న మంత్రి కోమటిరెడ్డి