Summer Special Trains From Secunderabad: ప్రయాణీకులకు సౌత్ సెంట్రల్ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. వేసవి రద్దీ దృష్ట్యా ఇప్పటికే పలు ప్రత్యేక రైళ్లను ప్రకటించగా.. తాజాగా మరిన్ని రైళ్లను అందుబాటులోకి తెచ్చింది. సికింద్రాబాద్ నుంచి పశ్చిమబెంగాల్ లోని షాలిమార్, సాంత్రగాచిలకు.. కేరళలోని కొల్లంకు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు బుధవారం వేర్వేరు ప్రకటనలు విడుదల చేశారు. ప్రయాణీకులు ఈ సర్వీసులు వినియోగించుకోవాలని సూచించారు.

ప్రత్యేక రైళ్లు ఇవే..

 సికింద్రాబాద్ - సాంత్రాగాఛి (07223) ప్రత్యేక రైలు ప్రతి శుక్రవారం బయల్దేరుతుంది. ఏప్రిల్ 19 నుంచి జూన్ 28 వరకూ ఈ సర్వీస్ అందుబాటులో ఉంటుంది. అలాగే, సాంత్రాగాఛి - సికింద్రాబాద్ (07224) ప్రత్యేక రైలు ఏప్రిల్ 20 నుంచి జూన్ 29 వరకూ ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది. తెలంగాణలో నల్గొండ, మిర్యాలగూడ స్టేషన్లలో ఈ రైళ్లు ఆగుతాయి. ఏపీలో గుంటూరు, విజయవాడ, దువ్వాడ, విజయనగరం, భువనేశ్వర్, కటక్, ఖరగ్ పూర్ మీదుగా ఈ రైళ్లు రాకపోకలు సాగిస్తాయి.

సికింద్రాబాద్ - షాలిమార్ (07225) ప్రత్యేక రైలు ఏప్రిల్ 15 నుంచి జూన్ 24 వరకూ ప్రతి సోమవారం.. అలాగే షాలిమార్ - సికింద్రాబాద్ (07226) రైలు ఏప్రిల్ 16 నుంచి జూన్ 25 వరకు ప్రతి మంగళవారం బయల్దేరుతాయి. ఈ సర్వీసులు 11 ట్రిప్పులు తిరుగుతాయి. తెలంగాణలో కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం స్టేషన్లలో ఆగుతాయి. అటు, ఏపీలో రాయనపాడు, రాజమహేంద్రవరం, దువ్వాడ, భువనేశ్వర్, ఖరగ్ పూర్, సాంత్రాగాచి మీదుగా రాకపోకలు సాగిస్తాయి.

సికింద్రాబాద్ - కొల్లం మధ్య రానుపోను 22 ట్రిప్పుల ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. సికింద్రాబాద్ - కొల్లం (07193) ప్రత్యేక రైలు ఏప్రిల్ 17, 24, మే 1, 8, 15, 22, 29.. జూన్ 5, 12, 19, 26 తేదీల్లో బయల్దేరుతుంది. కొల్లం - సికింద్రాబాద్ (07194) రైలు ఏప్రిల్ 19, 26.. మే 3, 10, 17, 24, 31.. జూన్ 7, 14, 21, 28 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. ఈ రైలు తెలంగాణలో నల్గొండ, మిర్యాలగూడ స్టేషన్లలో ఆగుతుంది. ఏపీలో గుంటూరు, ఒంగోలు, రేణిగుంటలో ఆగుతుంది. అలాగే, కాట్పాడి, ఈరోడ్, కోయంబత్తూరు, ఎర్నాకుళం, కొట్టాయం, కాయంకుళం స్టేషన్ల మీదుగా రాకపోకలు సాగిస్తుంది.

ఇంకా ప్రత్యేక సర్వీసులు

ఈ నెల 11న హుబ్బళ్లి - విజయవాడ (07002) మధ్య కూడా ప్రత్యేక సర్వీసును నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఇరుమార్గాల్లో గుంటూరు, నరసరావుపేట, వినుకొండ, దొనకొండ, మార్కాపూర్ రోడ్, గిద్దలూరు, నంద్యాల, డోన్, గుంతకల్లు, బళ్లారి, తోరనగల్లు, హోసేపేట జంక్షన్, మునిరాబాద్, కొప్పాల్, గదగ్, అన్నిగెరి స్టేషన్లలో ఆగుతాయని పేర్కొన్నారు. అలాగే, తిరుపతి, మచిలీపట్నం మధ్య కూడా స్పెషల్ రైళ్లు నడపనున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఏప్రిల్ 17, 24.. మే 1, 8, 15, 22, 29 తేదీల్లో సాయంత్రం 5 గంటలకు ప్రత్యేక రైళ్లు (07517) బయలుదేరుతాయి. మరుసటి ఉదయం 8 గంటలకు నాగర్ సోల్ చేరుకుంటాయి. నాగర్ సోల్ నుంచి ఏప్రిల్ 18. 25.. మే 2, 9, 16, 23, 30 తేదీల్లో రాత్రి 10 గంటలకు ప్రత్యేక రైళ్లు బయలుదేరుతాయి. మరుసటి రోజు ఉదయం 10:50 గంటలకు సికింద్రాబాద్ స్టేషన్ కు చేరుకుంటాయని సౌత్ సెంట్రల్ రైల్వే తెలిపింది. అటు, తిరుపతి నుంచి ఏప్రిల్ 14, 21, 28.. మే 5, 12, 19, 26 తేదీల్లో రాత్రి 10:20 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7:30 గంటలకు మచిలీపట్నం చేరుకుంటుంది. మచిలీపట్నం నుంచి ఏప్రిల్ 15, 22, 29.. మే 6, 13, 20, 27 తేదీల్లో సాయంత్రం 5:40 గంటలకు బయలుదేరి మరుసటి రోజు తెల్లవారుజామున 3:20 గంటలకు తిరుపతి చేరుకుంటుందని అధికారులు తెలిపారు. 

Also Read: Hyderabad Traffic: రంజాన్ వేళ హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు, ఈ మార్గాల్లో వెళ్లే వారికి అలర్ట్