Reason behind Rajasthan loss : ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) 2024 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్(RR)కు తొలి పరాజయం ఎదురైంది. అప్రతిహాత విజయాలతో దూసుకుపోతున్న రాజస్థాన్‌కు గుజరాత్(GT) బ్రేక్ వేసింది. చివరి వరకూ ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో చివరిబంతికి రషీద్ ఖాన్ ఫోర్ కొట్టి గుజరాత్‌ను గెలిపించాడు. అయితే ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ ఓటమికి స్లో ఓవర్ రేట్ కూడా ఓ కారణమైంది. స్లో ఓవర్ రేట్ రాజస్థాన్ రాయల్స్ కొంపముంచింది.
రాజస్థాన్ నిర్ణీత సమయానికి ఐదు నిమిషాలు వెనుకబడి ఉండటంతో చివరి ఓవర్‌లో సర్కిల్ బయట ఓ ఫీల్డర్‌ను తక్కువగా ఉంచాల్సి వచ్చింది. ఇదే రాజస్థాన్ ఓటమికి ప్రధాన కారణమైంది. విజయం దక్కాలంటే గుజరాత్ చివరి ఓవర్‌కు 6 బంతుల్లో 15 పరుగులు చేయాల్సి ఉంది. ఈ సమయంలో స్లో ఓవర్ రేట్ వల్ల 30 యార్డ్స్ సర్కిల్ బయట ఒక్క ఫీల్డరే ఉండాల్సి వచ్చింది. సర్కిల్ బయట ఓ ఫీల్డర్ తక్కువగా ఉండటంతో గుజరాత్ బ్యాటర్లు ధాటిగా ఆడి గెలుపునకు కావాల్సిన పరుగులు రాబట్టారు. ఈ ఓవర్‌లో గుజరాత్ బ్యాటర్లు ఓ సిక్సర్ కూడా కొట్టలేదు. కొట్టిన మూడు భారీ షాట్లు కూడా బౌండరీలే. అదే సర్కిల్ బయట ఇంకో ఫీల్డర్ ఉంటే పరిస్థితి మారేదేమో అని మాజీలు విశ్లేషిస్తున్నారు. ఈ ఓవర్‌లో గుజరాత్ బ్యాటర్లు సర్కిల్ పై నుంచి సులువుగా షాట్లు ఆడి మూడు బౌండరీలు సాధించారు. ఇన్నింగ్స్ చివరి బంతికి రషీద్ ఖాన్ ఫోర్ కొట్టి గుజరాత్‌ను గెలిపించాడు.
రాజస్థాన్ జైత్రయాత్రకు బ్రేక్
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో రాజస్థాన్ జైత్రయాత్రకు గుజరాత్ బ్రేక్ వేసింది. చివరి బంతి వరకూ ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌పై గుజరాత్ చివరి బంతికి విజయం సాధించింది. వర్షం కారణంగా ఆలస్యమైన ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ రియాన్ పరాగ్, సంజు శాంసన్ రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. రియాన్ పరాగ్ 48 బంతుల్లో 3 ఫోర్లు, అయిదు సిక్సర్లతో 76 పరుగులు చేయగా సంజు శాంసన్ 38 బంతుల్లో ఏడు ఫోర్లు, రెండు సిక్సర్లతో 68 పరుగులతో అజేయంగా నిలిచాడు. గుజరాత్ బౌలర్లలో ఉమేష్ యాదవ్, రషీద్ ఖాన్, మోహిత్ శర్మ ఒక్కో వికెట్ తీశారు. 197 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్‌శుభ్‌మన్ గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడడంతో చివరి బంతికి విజయం సాధించింది. గిల్ 44 బంతుల్లో 6 ఫోర్లు, రెండు సిక్సర్లతో 72 పరుగులు చేసి గుజరాత్‌ను విజయం దిశగా నడిపించాడు. గుజరాత్ విజయానికి చివరి రెండు ఓవర్లలో 37 పరుగులు అవసరంకాగా రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్ ధాటిగా ఆడి లక్ష్యాన్ని ఛేదించారు. చివరి బంతికి రెండు పరుగులు కావాల్సి ఉండగా రషీద్ ఖాన్ ఫోర్ కొట్టి గుజరాత్‌ను గెలిపించాడు. తెవాటియా 22, రషీద్ ఖాన్ 24 నాటౌట్‌తో గుజరాత్‌కు విజయాన్ని అందించారు. రషీద్ ఖాన్ కేవలం 11 బంతుల్లో నాలుగు ఫోర్లతో 24 పరుగులు చేశాడు.