RR vs GT IPL2024 Gujarat Titans Won By 3 Wickets: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(IPL)లో రాజస్థాన్‌ జైత్రయాత్రకు గుజరాత్‌ (GT)బ్రేక్‌ వేసింది. చివరి బంతి వరకూ ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌(RR)పై గుజరాత్‌ చివరి బంతికి విజయం సాధించింది. గెలుపు ఆశలు పూర్తిగా ఆవిరైనా చివరి వరకూ పోరాడిన గుజరాత్‌.. ఇన్నింగ్స్‌ చివరి బంతికి బౌండరీ కొట్టి విజయాన్ని అందుకుంది. వర్షం కారణంగా ఆలస్యమైన ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్‌... రియాన్‌ పరాగ్‌, సంజు శాంసన్‌ రాణించడంతో  నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. 197 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్‌... శుభ్‌మన్‌ గిల్‌ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ ఆడడంతో చివరి బంతికి విజయం సాధించింది.



మళ్లీ ఆ ఇద్దరే
 టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్‌కు పర్వాలేదనిపించే ఆరంభం దక్కింది. ఈ సీజన్‌లో వరుసగా విఫలమవుతున్న యశస్వీ జైస్వాల్‌ వరుసగా బౌండరీలు బాది టచ్‌లో కనిపించాడు. తొలి వికెట్‌కు 4.2 ఓవర్లలో 32 పరుగులు చేసిన అనంతరం యశస్వీ జైస్వాల్‌ అవుటయ్యాడు. 24 పరుగులు చేసిన యశస్వీ జైస్వాల్‌ను ఉమేశ్‌ యాదవ్‌ అవుట్‌ చేశాడు. ఆ తర్వాత కాసేపటికే గత మ్యాచ్‌లో సెంచరీ హీరో జోస్‌ బట్లర్‌ త్వరగానే పెవిలియన్‌ చేరాడు. 10 బంతుల్లో ఎనిమిది పరుగులు చేసిన బట్లర్‌ను రషీద్‌ఖాన్‌ అవుట్‌ చేశాడు. ఆ తర్వాత సంజు శాంసన్‌, రియాన్‌ పరాగ్‌ మరో వికెట్‌ పడకుండా ఆచితూచి ఆడారు. మరో వికెట్‌ పడకుండా ఇద్దరూ గుజరాత్‌ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నారు. ఆరంభంలో ఆచితూచి ఆడిన ఈ ఇద్దరు తర్వాత వేగంగా పరుగులు రాబట్టారు. గుజరాత్‌ బౌలర్లు కూడా ఆరంభంలో రాజస్థాన్‌ బ్యాటర్లను కట్టడి చేశారు. రియాన్‌ పరాగ్‌, సంజు శాంసన్‌ మరోసారి మెరవడంతో నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. రియాన్‌ పరాగ్‌ 48 బంతుల్లో 3 ఫోర్లు, అయిదు సిక్సర్లతో 76 పరుగులు చేశాడు. మోహిత్‌ శర్మ బౌలింగ్‌లో రియాన్‌ పరాగ్‌ అవుటయ్యాడు.చివరి వరకు క్రీజులో నిలిచిన సంజు శాంసన్‌ 38 బంతుల్లో ఏడు ఫోర్లు, రెండు సిక్సర్లతో 68 పరుగులతో అజేయంగా నిలిచాడు. గుజరాత్‌ బౌలర్లలో ఉమేష్‌ యాదవ్‌ ఒకటి... రషీద్‌ ఖాన్‌ ఒక వికెట్‌ తీశారు. మోహిత్‌ శర్మ కూడా ఒక వికెట్‌ తీశాడు. రషీద్‌ ఖాన్‌ నాలుగు ఓవర్లు బౌలింగ్‌ చేసి కేవలం 18 పరుగులు మాత్రమే ఇచ్చాడు. 



గిల్‌ నిలిచాడు.. రషీద్‌ ముగించాడు
 రాజస్థాన్‌ నిర్దేశించిన 197 పరుగుల లక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి దిగిన గుజరాత్‌ను రాజస్థాన్  బౌలర్లు ముప్పు తిప్పలు పెట్టారు. శుభ్‌మన్‌ గిల్‌ ఒక్కడే పోరాడాడు. 44 బంతుల్లో ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లతో గిల్‌ 72 పరుగులు చేసి చాహల్‌ బౌలింగ్‌లో స్టంపౌట్‌ అయ్యాడు. ఓపెనర్‌ సాయి సుదర్శన్‌ 35 పరుగులతో రాణించాడు. మినహా మిగిలిన బ్యాటర్లు అందరూ విఫలమయ్యారు. రాజస్థాన్‌  పేసర్‌ కుల్దీప్‌ సేన్‌.. అద్భుత బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. 10 బంతుల వ్యవధిలోనే మూడు వికెట్లు తీసి గుజరాత్‌ను కష్టాల్లో పడేశాడు. చాహల్‌ రెండు వికెట్లు, ఆవేశ్‌ ఖాన్‌ ఒక వికెట్‌ తీశాడు.



జట్టు క్లిష్ట సమయాల్లో ఉన్నప్పుడు రాహుల్‌ తెవాటియా, రషీద్‌ ఖాన్‌ నిలకడగా ఆడుతూ టార్గెట్‌కు దగ్గరగా తీసుకొచ్చారు. చివరి రెండు ఓవర్లలో గుజరాత్ గెలవాలంటే 37 పరుగులు అవసరమయ్యాయి. రాహుల్‌ తెవాటియా, రషీద్‌ ఖాన్‌ ఆ లక్ష్యాన్ని ఛేదించారు. తెవాటియా 22, రషీద్‌ ఖాన్‌ 24 నాటౌట్‌తో గుజరాత్‌కు విజయాన్ని అందించారు. విజయానికి చివరి బంతికి రెండు పరుగులు కావాల్సి ఉండగా  రషీద్‌ ఖాన్‌ ఫోర్‌ కొట్టి గుజరాత్‌ను గెలిపించాడు. రషీద్‌ ఖాన్‌ కేవలం 11 బంతుల్లో నాలుగు ఫోర్లతో 24 పరుగులు చేశాడు.