Minister Komatireddy Comments On Brs: కాంగ్రెస్ లో ఏక్ నాథ్ షిండేలు లేరని.. ఐదేళ్లు కాదు రాష్ట్రంలో మరో పదేళ్లు రేవంత్ రెడ్డే (Revanth Reddy) సీఎంగా ఉంటారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkat Reddy) స్పష్టం చేశారు. రంజాన్ సందర్భంగా నల్గొండ జిల్లా కేంద్రంలోని ఈద్గా వద్ద సీనియర్ నేత జానారెడ్డితో కలిసి ఆయన గురువారం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ క్రమంలో ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అభిమానులు పాల్గొన్నారు. ప్రార్థనల అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి.. బీఆర్ఎస్, బీజేపీపై విమర్శలు గుప్పించారు. ఏక్ నాథ్ షిండేలను సృష్టించిందే బీజేపీ అని.. ఆ పార్టీ కుల, మతాల మధ్య ఘర్షణ పెట్టి లబ్ధి పొందాలని చూస్తోందని విమర్శించారు. రాబేయే ఎన్నికలు దేశ ఐక్యతకు నిదర్శనమన్నారు. హస్తం పార్టీలో గ్రూపులు లేవని.. రేవంత్ రెడ్డి నాయకత్వంలో అందరం పని చేస్తున్నామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ మరో పదేళ్లు అధికారంలో ఉంటుందని అన్నారు.
బీఆర్ఎస్ కు సవాల్
ప్రభుత్వం ఎన్ని రోజులు ఉంటుందో తెలియదన్న మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యల్ని ఖండిస్తున్నట్లు మంత్రి కోమటిరెడ్డి చెప్పారు. కాంగ్రెస్ లో గ్రూపులు ఉన్నాయని బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర రెడ్డి వ్యాఖ్యలపైనా ఆగ్రహం వ్యక్తం చేశారు. హరీష్ రావు, మహేశ్వర్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. ప్రభుత్వాన్ని పడగొడతామనే అనవసర మాటలు బంద్ చేయాలని అన్నారు. లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఒక్క ఎంపీ సీటు కూడా రాదని జోస్యం చెప్పారు. ఆ పార్టీ ఒక్క ఎంపీ సీటు గెలిచినా తాను దేనికైనా సిద్ధమని మంత్రి సవాల్ విసిరారు. 'ప్రతిసారి మహేశ్వర్ రెడ్డి నా పేరు ప్రస్తావనకు తెస్తున్నారు. బండి సంజయ్ ను దింపి కిషన్ రెడ్డిని ఎందుకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి బాధ్యతలు అప్పగించారో మహేశ్వర్ రెడ్డికి తెలుసా.?. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ ను 39 సీట్లకే పరిమితం చేసినా ఆ పార్టీ నేతలకు ఇంకా జ్ఞానోదయం కావట్లేదా.?. ప్రతిపక్ష నేతలు విజ్ఞతతో మాట్లాడాలి. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 14 సీట్లు సాధిస్తుంది.' అంటూ మంత్రి కోమటిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
Also Read: SCR: ప్రయాణికులకు గుడ్ న్యూస్ - వేసవికి మరిన్ని ప్రత్యేక రైళ్లు, సికింద్రాబాద్ నుంచి!