Free Ration న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది. మరో ఏడాదిపాటు దేశ ప్రజలకు ఉచితంగా రేషన్ పంపిణీ చేయాలని కేంద్రం శుక్రవారం నిర్ణయించింది. జాతీయ ఆహార భద్రతా చట్టం (National Food Security Act) కింద 81.3 కోట్ల మందికి ఏడాదిపాటు ఉచితంగా రేషన్ పంపిణీ చేయాలని కేంద్రం శుక్రవారం నిర్ణయించింది.
ఈ నిర్ణయంతో ప్రభుత్వానికి భారం ఎంతంటే !
జాతీయ ఆహార భద్రతా చట్టం కింద రేషన్‌ను ఉచితంగా అందించడానికి దాదాపు రూ.2 లక్షల కోట్లు ఖర్చవుతుందని, ఈ ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని కేంద్ర పౌరసరఫరాలశాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఒక్క రూపాయి సైతం చెల్లించకుండా డిసెంబర్ 2023 వరకు ఉచితంగా 81.3 కోట్ల మందికి రేషన్ అందిస్తామని చెప్పారు. ఆహార చట్టంగా వ్యవహరించే జాతీయ ఆహార భద్రతా చట్టం కింద, ప్రభుత్వం ప్రస్తుతం ఒక వ్యక్తికి నెలకు 5 కిలోల ఆహార ధాన్యాలను కిలోకు రూ. 2 నుంచి 3 రూపాయల చొప్పున అందిస్తోంది. అయితే అంత్యోదయ అన్న యోజన (Antyodaya Anna Yojana) కింద ఉన్న కుటుంబాలకు ప్రతినెలా 35 కిలోల ఆహార ధాన్యాలు అందిస్తున్నారు. ఈ చట్టం ప్రకారం పేదలకు రూ.3కు కిలో బియ్యం, కిలో రూ.2కే గోధుమలు చొప్పున పంపిణీ జరుగుతోంది.
న్యూ ఇయర్ గిఫ్ట్.. కేంద్ర మంత్రి
కేంద్ర కేబినెట్ సమావేశం అనంతరం మంత్రి పీయూష్ గోయల్ మీడియాతో మాట్లాడుతూ.. ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ చట్టం కింద ఉచిత రేషన్ అందించడానికి అయ్యే ఖర్చును కేంద్ర ప్రభుత్వం భరిస్తుందన్నారు. ఈ తాజా నిర్ణయంతో కేంద్రం ఖజానాకు ఈ సమయంలో సుమారు రూ. 2 లక్షల కోట్లు భారం ఉంటుందని అంచనా వేశారు. కాగా, డిసెంబర్ 31తో ముగియనున్న ఉచిత రేషన్ పథకం ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన (PMGKAY)ని పొడిగించకూడదని కేబినెట్ నిర్ణయం తీసుకుందని తెలిపారు. "దేశంలోని పేదలకు కేంద్ర ప్రభుత్వ నూతన సంవత్సర కానుక"గా పీయూష్ గోయల్ అభివర్ణించారు.
జూలై 1, 2019 నుంచి సాయుధ బలగాల పెన్షనర్లు, కుటుంబ పెన్షనర్ల పింఛన్‌ను వన్ ర్యాంక్ వన్ పెన్షన్ (OROP) కింద సవరించడానికి కేంద్ర మంత్రివర్గం శుక్రవారం ఆమోదం తెలిపింది. తాజా నిర్ణయం వల్ల 25.13 లక్షల మంది వెటరన్స్ ప్రయోజనం పొందుతారని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియా సమావేశంలో తెలిపారు.