KTR Slams CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి ఇకనైనా చిల్లర మాటలు మాని.. హుందాగా ప్రవర్తించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. తన సవాల్ కు స్పందించి మల్కాజిగిరిలో గెలిచి దమ్మేంటో నిరూపించుకోవాలని ఛాలెంజ్ చేశారు. ఆదివారం కామారెడ్డి నియోజకవర్గం బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడారు. 'ఎన్నికల్లో గెలిస్తే మగాడు. ఓడితే కాదా.?. నా సవాల్ ను రేవంత్ రెడ్డి ఎందుకు స్వీకరించడం లేదు. మల్కాజిగిరిలో ఇద్దరం పోటీ చేద్దాం. ఎవరు మగాడో తేల్చుకుందాం. మా అయ్య పేరు కేసీఆర్. నేను ఉద్యమం చేసి రాజకీయాల్లోకి వచ్చాను. అంతేకానీ రేవంత్ రెడ్డిలాగా రాంగ్ రూట్ లో రాలేదు.' అంటూ మండిపడ్డారు.


ఈ నెల 17 వరకే..


కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ నెల 17 వరకూ ఓపిక పడతామని.. కాంగ్రెస్ వంద రోజుల పాలన పూర్తయ్యాక ప్రజల్లోకి వెళ్తామని స్ఫష్టం చేశారు. 'మేడిగడ్డలో 85 పిల్లర్లు ఉంటే.. అందులో మూడు కుంగిన మాట వాస్తవమే. అంతే కానీ కాళేశ్వరం, మేడిగడ్డ కుంగిపోలేదు. 3 నెలల్లో ఆ పిల్లర్లను బాగు చేయలేరా.?. అసంబద్ధమైన హామీలు ఇచ్చి కామారెడ్డిలో కేసీఆర్ ను ఓడించారు. గొర్రె కసాయిని నమ్మినట్లు ప్రజలు కాంగ్రెస్ కు అధికారం ఇచ్చారు. డిసెంబర్ 9న రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే రుణమాఫీ చేయాలి. వంద రోజులు పూర్తయ్యాక ఆడబిడ్డలు కాంగ్రెస్ భరతం పడతారు.' అని వ్యాఖ్యానించారు.


'ఎవరినీ తప్పుపట్టలేం'


ఎన్నికల్లో అందరూ కష్టపడి పని చేశారని.. ఎవరినీ తప్పు పట్టలేమని కేటీఆర్ అన్నారు. 'మబ్బుల వెనక్కి పోతేనే సూర్యుడి విలువ తెలుస్తుంది. మనం కూడా కొద్ది రోజుల్లో మళ్లీ వెలుగులోకి వస్తాం. కరీంనగర్ లో ఎండిన పొలాలు పరిశీలించినప్పుడు రైతులు బాధ పడుతున్నారు. ప్రత్యేక రాష్ట్రంలో తొలిసారి మళ్లీ అర్ధరాత్రి పొలం వద్దకు పోయే పరిస్థితి వచ్చిందని ఆవేదన చెందుతున్నారు. సామాన్య ప్రజలు, రైతులు, మహిళల్లో మంచి ప్రభుత్వాన్ని పోగొట్టుకున్నాం అనే బాధ ఉంది. జరిగిందేదో జరిగింది మనస్సులోంచి తీసేయండి. అందరూ గట్టిగానే కష్టపడి నిలబడ్డారు. నిజం గడపదాటేలోగా అబద్దం ఊరంతా తిరిగొస్తుందని పెద్దలు ముందే చెప్పారు. నిజాయితీ గల మోసగాడు రేవంత్ రెడ్డి.' అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.


ఆడపిల్లల వివాహాలకు తులం బంగారం ఇస్తామని రేవంత్ ఎన్నికల టైంలో చెప్పారని.. 3 నెలలవుతున్నా ఇంత వరకూ ఆ ఊసే లేదని కేటీఆర్ ధ్వజమెత్తారు. ఇప్పటికీ కేసీఆర్ అమలు చేసిన కల్యాణలక్ష్మి చెక్కులే ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. 'వంద రోజులు పూర్తైన తర్వాత కాంగ్రెస్ పార్టీకి బొంద తవ్వేది ఆడబిడ్డలే. మహాలక్ష్మి కింద ఆడబిడ్డలకు రూ.2,500 ఇస్తామన్న హామీ ఏమైంది.?. రైతులకు క్వింటాల్ కు రూ.500 బోనస్ ఇస్తా అన్నారు. ఇప్పుడు యాసంగి పంట కోతకు వస్తుంది. సీఎం రేవంత్ కు చిత్తశుద్ధి, రైతుల మీద ప్రేమ ఉంటే ఎన్నికల కోడ్ వచ్చే లోపు బోనస్ ప్రకటించాలి.' అని కేటీఆర్ డిమాండ్ చేశారు.


Also Read: RS Praveen Kumar: బీఆర్ఎస్-బీఎస్పీ పొత్తుపై వీడిన సందిగ్ధత, మాయావతి అంగీకారంతో లైన్ క్లియర్