KTR Attended Infront Of The Women Commission: ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణానికి సంబంధించి మహిళలపై చేసిన వ్యాఖ్యల క్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) శనివారం మహిళా కమిషన్ ఎదుట హాజరయ్యారు. ఉదయం హైదరాబాద్‌లోని (Hyderabad) తెలంగాణ భవన్ (Telangana Bhawan) నుంచి మహిళా నేతలతో కలిసి బయల్దేరిన ఆయన.. ట్యాంక్ బండ్‌లోని బుద్ధభవన్‌లో ఉన్న మహిళా కమిషన్ కార్యాలయానికి చేరుకున్నారు. అయితే, పోలీసులు కేవలం కేటీఆర్‌ను మాత్రమే లోపలికి అనుమతించారు. బీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్లు, నేతలను అడ్డుకోగా వాగ్వాదం చోటు చేసుకుంది. వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. ఇదే క్రమంలో అక్కడకు కాంగ్రెస్ మహిళా నేతలు సైతం చేరుకుని పోటాపోటీ నినాదాలు చేశారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
'కేటీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాలి'
మహిళా లోకాన్ని కేటీఆర్ అవమానించారని.. ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాలని మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీత, ఇతర నేతలు డిమాండ్ చేశారు. బుద్ధభవన్ మహిళా కమిషన్ ఎదుట ఆందోళనకు దిగారు. పోటాపోటీ నినాదాలు, ఆందోళనలతో కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొనగా.. బీఆర్ఎస్, కాంగ్రెస్ మహిళా నేతల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఇరువర్గాలను శాంతింపచేసే ప్రయత్నం చేశారు.
అసలు కారణం ఇదే..
తెలంగాణలోని ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ పథకంపై కేటీఆర్ తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బస్సుల్లో కుట్లు, అల్లికలు, అల్లం - వెల్లుల్లి వలవడం వంటి పనులు చేసుకుంటే తప్పేంటని మంత్రి సీతక్క వ్యాఖ్యానించారు. దీనిపై స్పందించిన కేటీఆర్.. బస్సుల్లో కుట్లు, అల్లికలు తాము వద్దనట్లేదని, అవసరమైతే బ్రేక్ డ్యాన్సులు వేసుకున్నా తమకు ఎలాంటి అభ్యంతరం లేదని అన్నారు. బస్సుల్లో సీట్ల కోసం ప్రయాణికులు తన్నుకుంటున్నారని.. ఆర్టీసీ సిబ్బంది ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. బస్సుల సంఖ్య పెంచాలని మాత్రమే తాము కోరుతున్నట్లు స్పష్టం చేశారు. అయితే, ఈ వ్యాఖ్యలపై మహిళా కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన మహిళా కమిషన్ ఆ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని కేటీఆర్‌కు మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలోనే ఆ నోటీసులకు వివరణ ఇచ్చేందుకు కేటీఆర్ శనివారం మహిళా కమిషన్ ఎదుట హాజరయ్యారు. కాగా, ఇప్పటికే తన వ్యాఖ్యల పట్ల ఆయన క్షమాపణ చెప్పారు.
కేటీఆర్ సంచలన ట్వీట్
కర్ణాటక వాల్మీకి స్కామ్‌తో తెలంగాణ రాష్ట్ర నేతలు, వ్యాపారవేత్తలకు లింకులున్నాయని కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. ఈ మేరకు ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. కర్ణాటక ఎస్టీ కార్పొరేషన్ నుంచి రూ.45 కోట్లు బదిలీ అయ్యాయని తెలిపారు. ఎంపీ ఎన్నికల వేళ నగదు డ్రా చేసిన బార్లు, బంగారు దుకాణాల నిర్వాహకులెవరని ప్రశ్నించారు. 'హైదరాబాద్‌లోని 9 మంది బ్యాంకు ఖాతాలకు రూ.45 కోట్లు బదిలీ అయ్యాయి. వాల్మీకి స్కాంకు సంబంధించి రాష్ట్రంలో సిట్, సీఐడీ సోదాలు జరిగాయి. ఈ వార్తలు బయటకు రాకుండా అణచివేశారు. రూ.90 కోట్ల అవినీతి జరిగిందని కర్ణాటక అసెంబ్లీలో సీఎం సిద్ధరామయ్య ప్రకటించారు. సిద్ధరామయ్యను తొలగిస్తే తెలంగాణ ప్రభుత్వమూ కూలుతుందని కర్ణాటక మంత్రి సతీశ్ అన్నారు. ఆయన అలా ఎందుకన్నారు.?. ఇన్ని అంశాలు వెలుగులోకి వచ్చినా ఈడీ ఎందుకు మౌనంగా ఉంది. తెలంగాణలో కాంగ్రెస్‌ను ఎవరు రక్షిస్తున్నారు.?' అని ట్విట్టర్ వేదికగా కేటీఆర్ ప్రశ్నలు సంధించారు.
Also Read: Telangana: తెలంగాణలో రూ. 300 లకే ఇంటర్నెట్, కేబుల్ టీవీ ప్రసారాలు