Today News In Telugu: తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో రూ. 300 లకే ఫైబర్ కనెక్షన్‌తోపాటు కేబుల్ టీవీ ఇవ్వనున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 93 లక్షల ఇళ్లకు ఇంటర్నెట్ ఇవ్వడమే లక్ష్యమని కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రి జ్యోతిరాథిత్య సింథియాకు సీఎం రేవంత్ వివరించారు. ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలు కేంద్ర మంత్రి జ్యోతిరాధిత్య సింధియాతో సమావేశం అయ్యారు. రూరల్ ఏరియాలో 63 లక్షల ఇళ్లకు, అర్బన్ ప్రాంతాల్లో 30 లక్షల ఇళ్లకు నెలకు రూ. 300కే ఇంటర్నెట్, కేబుల్ టీవీ, ఈ-ఎడ్యుకేషన్ సేవలు అందించే ఈ ప్రాజెక్టు కోసం రూ. 1779 కోట్లు అంచనా వ్యయం అవుతుందని మంత్రికి వివరించారు. ఇప్పటికే పలు రకాల ఆర్థిక సంస్థల ద్వారా .రూ. 530 కోట్లు సమకూర్చుకున్నట్టు చెప్పారు.
ఈ తెలంగాణ ఫైబర్ ప్రాజెక్టు కోసం అయ్యే ఖర్చు రూ. 1779 కోట్లను యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్ (యూఎస్ఎఫ్ఓ) ద్వారా వడ్డీ లేని దీర్ఘకాలిక రుణంగా ఇవ్వాలని సీఎం విజ్ఞప్తి చేశారు. టీ-ఫైబర్ ద్వారా 65,500 ప్రభుత్వ సంస్థలకు జీ2జీ (గవర్నమెంట్ టూ గవర్నమెంట్), జీ2సీ (గవర్నమెంట్ టూ సిటిజన్) కనెక్టివిటీ కల్పించనున్నట్టు వారు కేంద్రమంత్రికి వివరించారు. టీ-ఫైబర్ ద్వారా రాష్ట్రంలో 300 రైతు వేదికలకు రైతు నేస్తం కార్యక్రమాన్ని ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తోందని, ఇదే ప్రాజెక్టు ద్వారా సాంఘిక సంక్షేమ పాఠశాలలకూ ఇంటర్నెట్ సౌకర్యాన్ని కల్పిస్తున్నామని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
భారత్ నెట్ పథకాన్ని టీ ఫైబర్‌కు వర్తింపజేయండి
ప్రస్తుతం జాతీయ ఆప్టికల్ ఫైబర్ నెట్ వర్క్ (ఎన్‌ఓఎఫ్ఎన్) మొదటిదశ పనులు కొన్ని జిల్లాల్లో లీనియర్ ఆర్కిటెక్చర్ ఆధారంగా నడుస్తుంటే... మిగతా ప్రాంతాల్లో రింగ్ ఆర్కిటెక్చర్ ఆధారంగా నడుస్తోందని కేంద్ర మంత్రికి సీఎం వివరించారు. ఇందుకోసం ఎన్‌ఓఎఫ్ఎన్ మొదటి దశ మౌలిక సదుపాయాలను రాష్ట్ర ప్రభుత్వానికి సకాలంలో అందించాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. ఇందుకోసం ఎన్‌ఓఎఫ్ఎన్ మొదటి దశనను భారత్ నెట్ -3 కి మార్చడానికి కేంద్రానికి పంపిన డీపీఆర్‌ను త్వరగా ఆమోదించాలని కోరారు. భారత్ నెట్ ఉద్యమి పథకాన్ని తెలంగాణ గ్రామీణ ప్రాంతాలకు హై-స్పీడ్ ఇంటర్నెట్ కల్పించేలా టీ-ఫైబర్‌కు వర్తింపజేయాలని సింధియాను సీఎం కోరారు. భారత్ తద్వారా రాష్ట్రంలోని 33 జిల్లాలకు ఈ-గవర్నెన్స్‌ను అందించవచ్చని అభిప్రాయపడ్డారు.
ఖేల్ ఇండియా యూత్ గేమ్స్ నిర్వహించే అవకాశం తెలంగాణకు ఇవ్వాలి
కేంద్ర క్రీడా శాఖ మంత్రి మాండవీయను సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పర్యాటక మంత్రి జూపల్లి కృష్ణారావు తదితరులు కలిశారు. 2025 జనవరిలో నిర్వహించనున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్ నిర్వహించే అవకాశం హైదరాబాద్‌కు ఇవ్వాలని కేంద్ర మంత్రి మాండవీయకు విజ్ఞప్తి చేశారు. విమాన, రైలు సర్వీసులతో అనుసంధానమై హైదరాబాద్‌లో వివిధ కేటగీరిల ఫైవ్ స్టార్ హోటల్స్ ఉన్నాయని తెలిపారు. 2002లో నేషనల్ గేమ్స్, 2003లో ఆఫ్రో-ఏషియన్ గేమ్స్, 2007లో ప్రపంచ మిలటరీ గేమ్స్ నిర్వహించిన విషయాన్ని వారు గుర్తు చేశారు. ఒలింపిక్స్, ఏషియన్ గేమ్స్, కామన్‌వెల్త్ గేమ్స్ నిర్వహించే అవకాశం భారత్‌కు వచ్చినపుడు హైదరాబాద్‌లో నిర్వహించేలా తెలంగాణ రాష్ట్రానికి కూడా అవకాశం ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. అంతర్జాతీయంగా క్రీడాకారులు రాణించడానికి అవసరమైన వసతులు కల్పించడంలో తమ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని వివరించారు. తెలంగాణలో క్రీడా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసి యువతలో క్రీడా నైపుణ్యాలను వెలికి తీసే అవకాశం కల్పించాలని కేంద్ర క్రీడాశాఖ మంత్రి మన్‌సుఖ్ ఎల్ మాండవీయను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కోరారు. .