Kolkata Doctor Death Case: కోల్‌కతా హత్యాచార కేసులో కీలక ఆధారం వెలుగులోకి వచ్చింది. ఆర్‌జీ కర్‌ హాస్పిటల్‌లోని సెమినార్ రూమ్‌లోకి నిందితుడు వెళ్తున్నట్టుగా అక్కడి సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. అర్ధరాత్రి దాటాక సంజయ్ రాయ్‌ ఆ రూమ్‌లోకి వెళ్లినట్టు ఈ ఫుటేజ్ ఆధారంగా తెలుస్తోంది. మెడలో బ్లూటూత్ డివైజ్ కూడా కనిపించింది. ఇదే బ్లూటూత్ డివైజ్ క్రైమ్‌ సీన్‌ వద్ద పోలీసులకు దొరికింది. దీని ఆధారంగానే సంజయ్ రాయ్‌ని అరెస్ట్ చేశారు. అర్ధరాత్రి 1.03 గంటలకు హాస్పిటల్‌లోకి సంజయ్ రాయ్ వచ్చినట్టు అక్కడి సీసీ కెమెరాలో స్పష్టంగా రికార్డ్ అయింది. విచారణలో భాగంగా ఇదే ఫుటేజ్‌ని నిందితుడికి చూపించారు పోలీసులు. ఆ తరవాతే తానే ఈ నేరం చేసినట్టు అంగీకరించాడు. హాస్పిటల్‌కి వచ్చే ముందు సంజయ్ రాయ్‌ రెడ్‌ లైట్ ఏరియాకి వెళ్లినట్టు విచారణలో వెల్లడైంది. సోనాగచికి వెళ్లి అక్కడే ఇద్దరు వేశ్యలతో గడిపాడు. అప్పటికే మద్యం మత్తులో ఉన్నాడు. రెడ్‌ లైట్ ఏరియా నుంచి నేరుగా అర్ధరాత్రి హాస్పిటల్‌కి వెళ్లాడు. జూనియర్ డాక్టర్‌ నిద్రిస్తున్న రూమ్‌లోకి వెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఈ ఘటనపై సంచలనమైంది. నిందితుడిని ఉరి తీయాలంటూ పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. 


FIR నమోదులో ఆలస్యం..


ఆగస్టు 9వ తేదీన ఆర్‌జీ కర్ హాస్పిటల్‌లో ట్రైనీ డాక్టర్ దారుణంగా హత్యాచారానికి గురైంది. ఓ డాక్టర్ ఆమె మృతదేహాన్ని సెమినార్‌ రూమ్‌లో గుర్తించాడు. అర్ధనగ్నంగా పడి ఉన్న డెడ్‌బాడీని చూసి అంతా దిగ్భ్రాంతి చెందారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అయితే...ఈ కేసులో FIR నమోదు చేయడంలో పోలీసులు నిర్లక్ష్యం చేశారన్న ఆరోపణలున్నాయి. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు కూడా ప్రస్తావించింది. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. 30 ఏళ్లలో ఎప్పుడూ ఇలాంటి కేసు చూడలేదని, పోలీసుల వైఖరి ఏమీ బాలేదని మండి పడ్డారు. ప్రస్తుతం నిందితుడు సంజయ్ రాయ్‌ జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నాడు. సీబీఐ విచారణ కొనసాగిస్తోంది. నిందితుడికి లై డిటెక్టర్ టెస్ట్ చేసేందుకు కోర్టు నుంచి అనుమతి తెచ్చుకుంది. త్వరలోనే ఈ పరీక్ష చేయనున్నారు. అయితే..హాస్పిటల్‌లోని నలుగురు డాక్టర్‌లకూ ఇదే టెస్ట్ చేయాలని సీబీఐ నిర్ణయించుకుంది. నేరంతో నేరుగా వాళ్లకు సంబంధం లేకపోయినా సాక్ష్యాధారాలను తప్పుదోవ పట్టించారా అన్న కోణంలో విచారిస్తున్నారు. 


నిందితుడి తరపున మహిళా లాయర్..


ఈ కేసులో నిందితుడి తరపున వాదించేందుకు ఓ మహిళా లాయర్ ముందుకొచ్చారు. ఇప్పటి వరకూ ఏ అడ్వకేట్‌ అతని తరపున వాదించేందుకు అంగీకరించలేదు. కబితా సర్కార్ మాత్రం అందుకు ఒప్పుకున్నారు. ఇప్పటికే ఆమె కేసు డాక్యుమెంట్స్ పరిశీలిస్తున్నారు. త్వరలోనే బెయిల్ పిటిషన్ కూడా వేస్తానని చెప్పారు. తన ఫొటోని మీడియాలో ఎక్కడా పబ్లిష్ చేయొద్దని, తన డ్యూటీ తాను చేస్తున్నానని అన్నారు. నిందితుడికైనా కోర్ట్ ట్రయల్‌ అవసరమే అని అభిప్రాయపడ్డారు. 


Also Read: Kolkata: కోల్‌కతా కేసుని మలుపు తిప్పనున్న "ఆ నలుగురు", లై డిటెక్టర్ టెస్ట్‌తో వెలుగులోకి కొత్త నిజాలు!