BRS to go for Gurukul Bata | హైదరాబాద్: గురుకుల పాఠశాలలు, ఇతర ప్రభుత్వ పాఠశాలల్లో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్నాయి. ఇటీవల కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలంలోని ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కావడంతో ఓ విద్యార్థిని చనిపోవడం తల్లిదండ్రులను ఆందోెళనకు గురిచేస్తోంది. గురుకులాలలో వరుసగా ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతుండటంతో ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ కీలక నిర్ణయం తీసుకుంది.
రాష్ట్ర వ్యాప్తంగా నవంబర్ 30 వ తేదీ నుంచి 7 వ తేదీ వరకు BRS గురుకుల బాట కార్యక్రమానికి నిర్ణయం తీసుకుంది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో ఐదుగురు సభ్యులతో గురుకుల అధ్యయన కమిటీ బీఆర్ఎస్ ఏర్పాటు చేసింది. గురుకులాలు, మోడల్ స్కూళ్లు, కేజీబీవీ, పరిస్థితులను అధ్యయనం చేసేందుకు బీఆర్ఎస్ తరఫున ఈ అధ్యయన కమిటీని పార్టీ అధినేత కేసీఆర్ ఏర్పాటు చేశారు. గురుకుల బాట కార్యక్రమంలో భాగంగా గురుకులాలు, మోడల్ స్కూల్స్, కేజీబీవీలు, ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలు, కాలేజీలను ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో బీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్ నాయకులు, మహిళా నేతలు వెళ్లి పరిశీలించనున్నారు. ఈ కమిటీ పార్టీకి తమ నివేదికను సమర్పిస్తుంది. ప్రవీణ్ కుమార్ కమిటీ ఇచ్చే నివేదికలోని అంశాలను సభలో లేవనెత్తాలని బీఆర్ఎస్ భావిస్తోంది. అధికార కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టేందుకు బీఆర్ఎస్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది.